Read more!

English | Telugu

సినిమా పేరు:అ..ఆ..ఇ..ఈ
బ్యానర్:శ్రీ కల్పన ఆర్ట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 6, 2009
చంద్రం (శ్రీకాంత్‌), కళ్యాణి (మీరాజాస్మిన్‌) భార్యభర్తలు చంద్రం బామ్మ భారతమ్మ (తెలంగాణ శకుంతల) ముగ్గురూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. చంద్రం ఓ ట్యాక్సీ డ్రైవర్‌. చాలా మంచివాడు. చంద్రం దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఆ కాలనీవారి పిల్లలనే తమ పిల్లలుగా చూసుకుంటుంటారు. ఎన్నో నోములు నోచిన తర్వాత కళ్యాణి తల్లికాబోతుందని తెలుసుకున్న చంద్ర ఎగిరి గంతేస్తాడు. అయితే కళ్యాణి హార్ట్‌కి ప్రాబ్లెం ఉందని, ఆమె గర్భం దాలిస్తే ఆమెకి, పుట్టబోయే బిడ్డకి కూడా ప్రమాదమేనని డాక్టర్‌ చెబుతుంది. కళ్యాణికి వెంటనే ఆపరేషన్‌ చేయాలని దానికి ఎనిమిది లక్షల వరకు డబ్బు కావలసివస్తుందని డాక్టర్‌ చెప్పడంతో చంద్రం డీలా పడిపోతాడు. ఏం చేయాలో తోచక ఓ రైల్వేట్రాక్‌నుండి నడుస్తూ ఉంటే ట్రాక్‌ మధ్యలో రైలు ఢీకొట్టిన ఓ ఆడ శవం కనిపిస్తుంది.. ఆ ప్రక్కనే ఓ బ్యాగ్‌ కనిపిస్తుంది.. ఆ బ్యాగ్‌లో రమ్య (సదా) ఫోటోతోపాటు దాదాపు పదిలక్షల రూపాయల వరకు ఉంటుంది.దాన్ని తీసుకుని నిజాయితీగా పోలీసులకి అప్పగిస్తాడు చంద్రం.. కానీ చంద్రం లాయర్‌ ఫ్రెండు (కృష్ణభగవాన్‌) ఆ చనిపోయినావిడ తన భార్యని పోలీసులకి చెప్పమంటాడు. చంద్రం అలాగే చేస్తాడు. ఆ బ్యాగ్‌లో ఉన్న డబ్బులని భార్య ఆపరేషన్‌కి ఖర్చుచేస్తాడు. అనుకోకుండా రమ్య తల్లిదండ్రులు కలవడం వారి అభ్యర్థనతో వారింట్లోనే అల్లుడిగా చంద్రం కొనసాగడం జరిగిపోతుంది. అయితే హఠాత్తుగా రైలు యాక్సిడెంట్‌లో చనిపోయిందనుకున్న రమ్య ఇంటికి వస్తుంది.. రమ్యని చూసిన అందరూ షాకయిపోతారు. ఆ తర్వాతేంజరిగిందన్నదే మిగతా కథ..
ఎనాలసిస్ :
శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఆ చిత్రం పూర్తి వినోదాత్మకంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్ఖర్లేదు. అయితే ఈ చిత్రంలో వినోదంతో పాటు సెంటిమెంటుని కూడా బాగా పండించారు. అయితే చిత్ర కథ పాతదే అయినప్పటికీ తనదైన శైలిలో కథని నడిపించి రక్తికట్టించాడు దర్శకుడు. ముఖ్యంగా సెంటిమెంటు సీన్లని బాగా తీసారు. పద్మశ్రీ బ్రహ్మానందం, కోవై సరళల మధ్యలో నడిచే కామెడీ ట్రాక్‌ బాగుంది. గజినిగా ఆలీ బాగా చేసాడు. అలాగే మొదట్లోనే రమ్య క్యారెక్టర్‌ని చనిపోయిందన్నట్టుగా చిత్రీకరించి చివరిదాకా సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయడంలో కూడా దర్శకుడు సఫలీకృతులయ్యాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: ఫ్యామెలీ, సెంటిమెంట్‌ కథలలో శ్రీకాంత్‌ ఇట్టే ఒదిగిపోతాడని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్‌ నటన బాగుంది. ముఖ్యంగా సెంటిమెంట్‌ సీన్లలో శ్రీకాంత్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లు మీరాజాస్మిన్‌, సదాలు కూడా బాగా చేసారు. ఈ చిత్రంలో భారతమ్మగా నటించిన తెలంగాణ శకుంతల పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. హీరో బామ్మగా, దేశభక్తిగల మహిళగా తెలంగాణ శకుంతల నటన అందరినీ అలరిస్తుంది. యాస భాషలో హాలు దద్ధరిల్లిపోయేలా చెప్పే డైలాగులతో విలనీయిజం ప్రదర్శించే శకుంతల ఈ చిత్రంలో చాలా సాఫ్ట్‌గా కనిపించింది. బామ్మపాత్రలో ఒదిగిపోయింది. డాక్టర్‌ బ్రహ్మానందం, కోవై సరళల మధ్యలో ఉన్న కామెడీ సీన్స్‌ అలరిస్తాయి. మిగతా పాత్రలలో అందరూ బాగానే నటించారు. కథ -: మాటలు -: గోళ్ళపాటి నాగేశ్వరరావు అందించిన కథ-మాటలు బావున్నాయి. సంగీతం -: ఎం.ఎం. శ్రీలేఖ అందించిన మ్యూజిక్‌ ఫర్వాలేదు. సాహిత్యం -: భాస్కరభట్ల అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకత్వం -: కామెడీతో ఖుషీ చేసే దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈచిత్రంతో కాస్తంత సెంటిమెంటుని కూడా అందించి సక్సెస్‌ సాధించారు. లాజిక్‌లని వెతకకుండా హాస్యాన్ని, సెంటిమెంటు సీన్లని చూసి ఎంజాయ్‌ చేయాలనుకునేవారు కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు.