Read more!

English | Telugu

సినిమా పేరు:7 to 4
బ్యానర్:మిల్క్ మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:Apr 1, 2016

 

రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమాతో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. సరిగ్గా ఇలాంటి జానర్ తోనే 7 టు 4 అనే క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు దర్శకుడు విజయ్ శేఖర్ సంక్రాంతి. అందరూ కొత్త వాళ్లతో, ఒకే రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది..? ఎంత మేరకు ఆకట్టుకుంటుంది..? చూద్దాం రండి.

 

కథ :


హైదరాబాద్ సిటీలో పెరిగిపోతున్న అత్యాచారాల్ని అరికట్టే ఉద్దేశ్యంతో, అలాంటి ఘోరాలు చేసే వాళ్లను పట్టుకుని శిక్ష విధిస్తుంటుంది వైట్ టైగర్స్ అనే పేరున్న ఒక టీం. ఆ టీం సభ్యులు నరసింహ(ఆనంద్ బచ్చు), రవి(రాజ్ బాలా), దుర్గ(లౌక్య) , లిల్లీ(రాధిక). నగరంలో అత్యాచారాలు చేయడానికి ముఠాలుగా ఏర్పడిన వాళ్లందరినీ ట్రేస్ చేస్తూ వాళ్లకు చిత్ర విచిత్రమైన ట్రీట్ మెంట్ ఇస్తుంటుంది. ఒక రాత్రిలో ఏడింటి నుంచి నాలుగింటి వరకూ, ఈ టీం చేసిన ప్రయాణమే 7 టు 4. ఇంతమందిని కిడ్నాప్ చేస్తున్న ఈ టీం ను పోలీసులు పట్టుకున్నారా..? అసలు ఆ ముఠాలను టార్గెట్ చేయాల్సిన అవసరం వైట్ టైగర్ టీం కు ఎందుకొచ్చింది..? వీరి ప్రయత్నంలో ఎలాంటి ఒడిదుడుకులెదుర్కున్నారు అన్నది తెరపై చూడాల్సిందే..


ఎనాలసిస్ :

ప్లస్ పాయింట్స్ :


7 టు 4 కు ప్రధాన బలం కథ. ఈ మధ్య కాలంలో సమాజానికి నీతులు చెప్పే సినిమాల్లో, ఆ పేరుతోనే అశ్లీలతను చూపిస్తున్నారు. ఈ సినిమాలో కేవలం కథ మీద, వైట్ టైగర్స్ ఎంచుకున్న మిషన్ మీదే కథ సాగుతుంది. అత్యాచారాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్న ఈ కాన్సెప్ట్ ను అభినందించాలి. ఒకే రోజు రాత్రిలో జరిగే కథలా చూపిస్తూ, ఆ టైంలో వివిధ సంఘటనలకు ముడిపెడుతూ కథ చెప్పిన విధానం కూడా బాగుంది. చాలా తక్కువ రన్ టైం ఉండటం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. నటీనటులందరూ కథకు తగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

మైనస్ పాయింట్స్ :


క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఎక్కడా కామెడీ కనిపించదు. సినిమా అంతా ట్రేసింగ్ అండ్ ఛేజింగ్ లా అనిపిస్తుంది. వయొలెన్స్ ఎక్కువగా ఉండటం మైనస్. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గానే గడిచినా, ఇంటర్వెల్ తర్వాతి నుంచీ సినిమా స్లో అవుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వచ్చే వరకూ, స్లో నెరేషన్ బోర్ కొట్టిస్తుంది.

టెక్నికల్ :


క్రైమ్ జానర్ కు చాలా కీలక విభాగాలు సంగీతం, సినిమాటోగ్రఫీ. ఈ రెండూ కూడా టెక్నికల్ గా బాగున్నాయి. ఉషా ఉతుప్ పాడిన మొదటి పాట ప్రేక్షకుడిని సినిమాలోకి తీసుకెళ్తుంది. శ్రీమతి స్నేహలత అందించిన పాటలు సినిమా థీమ్ కు తగ్గట్టుగా సాగుతాయి. కేమేరా యాంగిల్స్ లో కొన్ని చోట్ల వర్మ సినిమాలా అనిపిస్తుంటుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడు విజయ్ శేఖర్ తొలి ప్రయత్నంతో మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కానీ తొలి ప్రయత్నం అనే విషయం సినిమాలో కనిపిస్తుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

క్రైమ్ జానర్లో తొలి సినిమా తీసే సాహసం చేసిన దర్శకుడు విజయ్ శేఖర్ ప్రయత్నం అభినందించదగ్గదే. సినిమా కోసం ఐటెం సాంగ్స్ లాంటివి యాడ్ చేయకపోవడం, ఉన్నది ఉన్నట్టుగా, తాను చెప్పాలనుకున్నది తెరమీద చూపించడంతో రెగులర్ సినిమాలకు భిన్నంగా అనిపిస్తుంది. హింస కాస్త ఎక్కువగానే ఉండటం ప్రధాన మైనస్. రొటీన్ కు భిన్నంగా సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.