Read more!

English | Telugu

సినిమా పేరు:2018
బ్యానర్:కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్
Rating:3.00
విడుదలయిన తేది:May 26, 2023

సినిమా పేరు: 2018
తారాగణం: టోవినో థామ‌స్, వినీత్ శ్రీనివాస‌న్, కుంచ‌కోబోబ‌న్‌, అప‌ర్ణ బాల‌మురళి, తన్వి రామ్, లాల్, నరైన్, ఆసిఫ్ అలీ, అజు వర్గీస్, కలైయరసన్, ఇంద్రాన్స్
సంగీతం: నోబిన్ పాల్
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
ఎడిటర్: చమన్ చకో
రచన, దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
బ్యానర్స్: కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్
విడుదల తేదీ: మే 26, 2023

మలయాళ సినీ చరిత్రలో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మూడో సినిమాగా '2018' సంచలనం సృష్టించింది. 2018 లో కేరళను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ మే 5న విడుదలై సంచలన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టోవినో థామ‌స్, వినీత్ శ్రీనివాస‌న్, అప‌ర్ణ బాల‌మురళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? మలయాళం తరహాలోనే తెలుగులోనూ మెప్పించేలా ఉందా?...

కథ:

ఇండియన్ ఆర్మీ లో కొంతకాలం పని చేసి, అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసిన అనూప్(టోవినో థామ‌స్) విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే అతను ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడని ఊరిలో వాళ్ళు చులకనగా చూస్తుంటారు. అనూప్ మాత్రం అందరితో మంచిగా ఉంటూ కొన్ని కుటుంబాలకు బాగా దగ్గరవుతాడు. అతను ఆ ఊరికి టీచర్ గా పని చేయడానికి వచ్చిన మంజు(తన్వి రామ్)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. మరోవైపు కుటుంబానికి దూరంగా దుబాయ్ లో ఐటీ జాబ్ చేస్తున్న రమేశన్(వినీత్ శ్రీనివాస‌న్)కి తన భార్యతో మనస్పర్థలు రావడంతో.. అటు పని మీద శ్రద్ధ పెట్టలేడు, ఇతరులతో మునుపటిలా మంచిగా మాట్లాడలేడు. దానికితోడు తన తల్లికి ప్రమాదం జరిగి ఆస్పత్రిపాలు కావడంతో ఇండియాకి బయల్దేరుతాడు. పని పట్ల నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ కలిగిన ప్రభుత్వ అధికారి షాజీ పున్నూస్‌(కుంచాకో బోబన్), కొందరు పైఅధికారులు తనకు సహకరించకపోయినా.. తన కుటుంబం కంటే కూడా ప్రజల క్షేమం గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. టీవీ రిపోర్టర్ గా పనిచేసే నూరా(అప‌ర్ణ బాల‌మురళి) కుటుంబంతో కొంచెం సమయం కూడా కేటాయించలేనంత బిజీగా ప్రజా సమస్యలు, వార్తలు అంటూ తిరుగుతుంటుంది. తమిళనాడుకి చెందిన లారీ డ్రైవర్, ఆవేశపరుడైన సేతుపతి(కలైయరసన్) డబ్బుల కోసం పేలుడు పదార్థాలను కేరళకు తరలించడానికి సిద్ధమవతుతాడు. మత్స్యకారుల కుటుంబానికి చెందిన నిక్సన్, మోడల్ కావాలని కలలు కంటూ.. తన తండ్రి, అన్న కొనసాగిస్తున్న సముద్రంలో చేపలు పట్టే వృత్తి పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఉంటాడు. టాక్సీ డ్రైవర్ గా పనిచేసే కోశి(అజు వర్గీస్) వృత్తిలో భాగంగా కొన్నిరోజులు కుటుంబానికి దూరంగా ఉంటూ ఓ విదేశీ జంటకు కేరళలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ లను తిప్పిచూపించే బాధ్యతను తీసుకుంటాడు. ఇలా ఎన్నో కుటుంబాలు, ఎందరో మనుషులు. ఒక్కో కుటుంబానిది, ఒక్కో మనిషిది ఒక్కో కథ. భారీ వరదల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ప్రాణాల మీదకు వచ్చేసరికి కొందరి జీవితాలు, వారి స్వభావాలు ఎలా మారిపోయాయి? తమ ప్రాణాలు కాపాడుకున్న వారు ఎందరు? ఇతరుల ప్రాణాలు కాపాడి హీరోలుగా నిలిచిన వారు ఎందరు? అనూప్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడా? రమేశన్ తన భార్యకు దగ్గరయ్యాడా? అసలే వరదల్లో అల్లాడుతున్న కేరళను సేతుపతి మరింత ప్రమాదంలోకి నెట్టాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే '2018' సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రజల జీవితాలు ఎలా తలకిందులవుతాయి అనే పాయింట్ తో వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది. పైగా ఇది ప్రాంతీయ చిత్రం. తమకున్న వనరుల్లోనే మంచి అవుట్ పుట్ ఇవ్వాలి. వీఎఫ్ఎక్స్ ఏమాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలవుతారు. అలాగే సన్నివేశాలు సహజంగా ఉండాలి, అదే సమయంలో బోర్ కొట్టకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. లేదంటే డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వాటన్నింటినీ తట్టుకొని నిలబడింది '2018'. తక్కువ బడ్జెట్ లోనే అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. ఆ విషయంలో దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ని ప్రత్యేకంగా అభినందించాలి.

ప్రథమార్థం మొత్తం పాత్రల పరిచయానికి తీసుకున్నాడు దర్శకుడు. పాత్రలు ఎక్కువగా ఉండటం, మనకి తెలిసిన ముఖాలు తక్కువ ఉండటంతో.. ఆ పాత్రలను అర్థం చేసుకోవడానికి, వాటితో కలిసి ప్రయాణం చేయడానికి మనకు కాస్త సమయం పడుతుంది. దాని వల్ల ప్రథమార్థం మనకు పూర్తి సంతృప్తిని కలిగించదు. ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. అలా అని మేకింగ్ పరంగా దర్శకుడు ఎక్కడా ఫెయిల్ కాలేదు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడు. అయితే పాత్రలు ఎక్కువగా ఉండటం వల్ల, కథనం రాసుకున్న తీరు వల్ల.. మనం సినిమాలో పూర్తిగా లీనమవ్వడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాం. 

ప్రథమార్థాన్ని సినిమాకి ఓ పునాదిలా భావించి, త్వరగానే ముగించిన దర్శకుడు.. అసలు సినిమాని ద్వితీయార్థంలో చూపించాడు. ద్వితీయార్థంలో పూర్తిగా సినిమాలో లీనమైపోతాం. ఒక అందమైన ఎమోషనల్ జర్నీని చూస్తాం. ఓ వైపు తర్వాత ఏం జరుగుతుందోనన్నఉత్కంఠ, మరోవైపు ఆ పాత్రలకు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కలిగించేలా ద్వితీయార్థాన్ని అద్భుతంగా మలిచారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడటానికి మత్స్యకారులు తమ సొంత పడవలు తీసుకొని రావడం, గర్భిణీ స్త్రీని హెలికాఫ్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించడం, తనకి తెలిసినవాళ్ళని కాపాడటం కోసం అనూప్(టోవినో థామ‌స్) ప్రాణాలకు తెగించి పోరాడటం వంటి సన్నివేశాలు కట్టిపడేశాయి. ద్వితీయార్థంలో వచ్చే పలు సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మనమో లేక మన వాళ్ళో ఆ వరదల్లో చిక్కుకున్నామనే భావన కూడా కలుగుతుంది. అంతలా మనం లీనమయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. 

ఈ సినిమాకి అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ, నోబిన్ పాల్ నేపథ్య సంగీతం ప్రధాన బలాలుగా నిలిచాయి. అఖిల్ జార్జ్ తన కెమెరా పనితనంతో సన్నివేశాలకు సహజత్వం తీసుకొచ్చి, మనం కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నామనే అనుభూతిని కలిగించేలా చేస్తే.. నోబిన్ పాల్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వీఎఫ్ఎక్స్ టీంని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. మంచి అవుట్ పుట్ ఇచ్చారు. చమన్ చకో కూర్పు బాగుంది. ఎక్కడా సినిమాకి అనవసరమైన సన్నివేశం చూశామనే భావన కలగదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఇది హీరో ప్రధానంగా సాగే చిత్రం కాదు. పూర్తిగా కథాకథనాల మీద ఆధారపడి సాగే చిత్రం. అందుకే సినిమాలో ముఖ్యపాత్రలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆ పాత్రల కోసం నటీనటుల ఎంపిక కూడా అద్భుతంగా కుదిరింది. ముఖ్యపాత్రలు పోషించిన నటీనటులంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మాజీ ఆర్మీ అధికారి అనూప్ పాత్రలో టోవినో థామ‌స్ ఒదిగిపోయాడు. అందరితో సరదాగా ఉంటూ, సాయం చేయడంలో ముందుండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక ఓ వైపు భార్యతో మనస్పర్థలు, మరోవైపు ఆస్పత్రిలో తల్లి.. వీటి మధ్య సతమతమయ్యే రమేశన్ పాత్రలో వినీత్ శ్రీనివాస‌న్ చక్కగా రాణించాడు. టీవీ రిపోర్టర్ నూరా పాత్రలో అప‌ర్ణ బాల‌మురళి, అనూప్ ప్రేయసి మంజుగా తన్వి రామ్, ప్రభుత్వ అధికారి షాజీ పున్నూస్‌ గా కుంచాకో బోబన్, లారీ డ్రైవర్ సేతుపతిగా కలైయరసన్, టాక్సీ డ్రైవర్ కోశిగా అజు వర్గీస్, అంధుడిగా ఇంద్రన్స్, మత్స్యకారుల కుటుంబంలో తండ్రిగా లాల్, పెద్ద కొడుకుగా నరైన్, చిన్నకొడుకుగా ఆసిఫ్ అలీ ఇలా అందరూ ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పాత్రలు ఎక్కువగా ఉండటం, మనకి తెలిసిన ముఖాలు తక్కువ ఉండటంతో మనం సినిమాలో లీనం కావడానికి కాస్త సమయం పట్టే అవకాశమున్నా.. ఒక్కసారి పాత్రలన్నీ పరిచయమై, సినిమాలో లీనమయ్యాక ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కేరళ వరదలను మనం ప్రత్యక్షంగా చూడనప్పటికీ.. మనమో, మన వాళ్ళో ఆ వరదల్లో చిక్కుకున్నామేమో అనే భావన కలిగించేలా చిత్రాన్ని చక్కగా మలిచారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు.

-గంగసాని