Read more!

English | Telugu

సినిమా పేరు:18 పేజెస్
బ్యానర్:గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్
Rating:3.00
విడుదలయిన తేది:Dec 23, 2022

సినిమా పేరు: 18 పేజెస్
తారాగణం: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్, పోసాని కృష్ణ మురళి, అజయ్, శత్రు, గోపరాజు రమణ
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: ఎ. వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
కథ: సుకుమార్
దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్స్: గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.. ఈ ఏడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే అతని తాజా చిత్రం '18 పేజెస్'పై అందరి దృష్టి పడింది. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించడంతో పాటు.. 'కార్తికేయ-2' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. అలాగే గతంలో సుకుమార్ కథతో 'కుమారి 21ఎఫ్' వంటి సూపర్ హిట్ అందుకున్న సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం విశేషం. మరి ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన '18 పేజెస్' నిఖిల్ కి మరో విజయాన్ని అందించేలా ఉందా?.

కథ:
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సిద్ధు(నిఖిల్) ఒకమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ప్రేమలో విఫలమై బాధపడుతున్న సిద్ధు చేతికి నందిని(అనుపమ) అనే అమ్మాయి రాసుకున్న డైరీ దొరుకుతుంది. కనీసం ఫోన్ కూడా వాడకుండా టెక్నాలజీకి దూరంగా, మనుషులకు దగ్గరగా ఉండే.. మంచి మనసున్న నందిని జీవితం పట్ల సిద్ధుకి ఆసక్తి కలుగుతుంది. ఒక్కో పేజీ చదివే కొద్దీ ఆమెకు దగ్గరవుతుంటాడు. తెలియకుండానే ఆమెలా బ్రతకడం మొదలుపెడతాడు. కేవలం ఆమె రాసుకున్న డైరీతోనే తన జీవితంపై ఇంతలా ప్రభావం చూపించిన నందినిని ఎలాగైనా కలవాలి అనుకుంటాడు. ఈ క్రమంలో సిద్ధు తెలుసుకున్న సంచలన విషయాలేంటి? తన తాతయ్య అప్పగించిన ముఖ్యమైన పని మీద హైదరాబాద్ కి వచ్చిన నందినికి ఏం జరిగింది? అసలు ఆమెకు హాని తలపెట్టింది ఎవరు? నందినిని సిద్ధు రక్షించగలిగాడా? అతను కోరుకున్నట్లు ఆమెను కలుసుకోగలిగాడా? అనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

సుకుమార్ అందించిన కథలో బలముంది. ఆ కథను దర్శకుడు సూర్య ప్రతాప్ మలిచిన తీరు బాగుంది. దూరంగా ఉంటే వీడియో కాల్స్, దగ్గరగా ఉంటే ఓయో రూమ్స్ అనుకునే ఈ కాలంలో.. ప్రేమించడానికి కారణాలు అవసరం లేదంటూ కొన్ని పేజీల డైరీ చదివి హీరో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరోయిన్ ని హీరో కలవడు.. వారి మధ్య ఒక్క మాట కూడా ఉండదు.. కానీ ఆ ప్రేమను మనం అనుభూతి చెందుతాం. హగ్ లు, కిస్ లు వంటి రొమాన్స్ లేకుండా హృదయానికి హత్తుకునేలా ప్రేమ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది.

సిద్ధు ప్రేమలో విఫలమవ్వడం, అదే సమయంలో అతని చేతికి నందిని డైరీ రావడంతో సినిమా మొదలవుతుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యి టెక్నాలజీ మధ్య బ్రతికే సిద్ధు.. నందిని గురించి చదివి ఆమెలా ప్రవర్తించే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ ఫ్రెండ్ లా సిద్ధు వెన్నంటే ఉండే కొలీగ్ భాగీ(సరయు) సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పారలాల్ గా వచ్చే నందిని సన్నివేశాలు కూడా భలే అనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్లుగా ఎంతో సరదాగా, హాయిగా సాగే ఫస్టాఫ్ ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో ముగుస్తుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త తడబాటు, సాగదీత అనిపించినా ఓవరాల్ గా మాత్రం బాగానే ఉంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా క్లైమాక్స్ ని డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. అయితే ఇంటర్ లో జాయిన్ చేసిన అమ్మాయి కొంతకాలానికే సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకోవడం వంటి సన్నివేశాలు సినిమాటిక్ గా ఉన్నా.. ఎమోషనల్ గా సాగే ఈ లవ్ జర్నీలో అలాంటి చిన్న చిన్న లాజిక్స్ గురించి ప్రేక్షకులు పెద్దగా ఆలోచించకపోవచ్చు.

ఈ చిత్రానికి సంభాషణలు, సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సన్నివేశాలకు తగ్గట్టు రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ప్రేమ సంభాషణలు హృదయాన్ని తాకేలా ఉంటే, హాస్య సంభాషణలు కడుపుబ్బా నవ్వించే ఉన్నాయి. ప్రేమ కథలకు సంగీతం ప్రధాన బలంగా నిలవాలి. ఆ విషయంలో గోపీసుందర్ పూర్తి న్యాయం చేశాడు. పాటలతో ఆకట్టుకున్నాడు.. అంతకుమించి నేపథ్య సంగీతంతో సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. వసంత్ కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాలకు అందం తీసుకొచ్చాడు. 

నటీనటుల పనితీరు:

సిద్ధు పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. భావోద్వేగాలు చక్కగా పలికించాడు. మొదట విఫల ప్రేమికుడిగా, తర్వాత నందిని ఆలోచనల్లో బ్రతుకుతూ తనకు తానే కొత్తగా పరిచయమయ్యే యువకుడిగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఈ చిత్రంలో అనుపమకు చాలా మంచి పాత్ర దక్కింది. ఆ పాత్రలోని స్వచ్ఛతను తన ముఖంలో చూపించింది. తన సహజ నటనతో నందిని పాత్రకు న్యాయం చేసింది. ఇక యూట్యూబర్ సరయుకి కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. ఆ అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకుంది. సినిమాలో చాలావరకు నిఖిల్ పాత్రతో ట్రావెల్ అవుతూ.. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించింది. పోసాని కృష్ణ మురళి, అజయ్, శత్రు, గోపరాజు రమణ తదితరులు పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'18 పేజెస్'లో లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. అక్కడక్కడా కాస్తా నెమ్మదిగా సాగినట్లు అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఆకట్టుకునేలా ఉంది. వెండితెరపై ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చూసిన అనుభూతి కలుగుతుంది.

-గంగసాని