English | Telugu

ఆరేళ్ళ నిరీక్షణకు తెర.. విజయ్ తో రష్మిక..!

ఆరేళ్ళ నిరీక్షణకు తెర.. విజయ్ తో రష్మిక..!

 

కలిసి నటించింది రెండు సినిమాలే అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మొదటిసారి వీరు 'గీత గోవిందం' కోసం జత కట్టగా, అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'లో కలిసి నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ, వీరి పెయిర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 'డియర్ కామ్రేడ్' వచ్చి ఆరేళ్లవుతోంది. కానీ, వీరి కాంబోలో మూడో సినిమాకి ముహూర్తం కుదరలేదు. దీంతో విజయ్-రష్మిక కలయికలో మూడో చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించనున్నాయి.

 

త్వరలో 'కింగ్ డమ్'తో ప్రేక్షకులను పలకరించనున్న విజయ్.. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ మూవీ, డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయనున్నాడు. వీటిలో ముందుగా రాహుల్ సినిమా రానుంది. గతంలో విజయ్-రాహుల్ కాంబోలో 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది. ఇప్పుడిది రెండో చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా లాక్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. విజయ్-రష్మిక కలయికలో వచ్చిన గత చిత్రం 'డియర్ కామ్రేడ్' కూడా మైత్రి బ్యానర్ లోనే రూపొందడం విశేషం.