English | Telugu
రామ్ చరణ్, నాగ్ అశ్విన్ కాంబోలో క్లాసిక్ ఫిల్మ్ సీక్వెల్!
Updated : May 9, 2025
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ ఫిల్మ్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' (JVAS). రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ.. 1990 మే 9న విడుదలై సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
'జగదేకవీరుడు అతిలోకసుందరి' విడుదలై 35 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సినిమాని రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ తో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి.. సీక్వెల్ గురించి తన మనసులోని మాట బయటపెట్టారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ లో రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ నటిస్తే బాగుంటుందని అన్నారు. అంతేకాదు, రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి చెప్పినట్టుగా నిజంగానే రామ్ చరణ్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ రూపొందితే అదిరిపోతోంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. పైగా 'కల్కి'తో తాను భారీ చిత్రాలను డీల్ చేయగలనని నాగ్ అశ్విన్ రుజువు చేసుకున్నాడు. సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని నాగ్ అశ్విన్ బాగా డీల్ చేయగలడు. మరి ఈ కాంబోలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి-2' నిజంగా సాధ్యమవుతుందేమో చూడాలి.
