English | Telugu

హీరోలు కళ్ళు తెరవాలి.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

హీరోలు కళ్ళు తెరవాలి.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

 

సినిమా విడుదల తేదీ అనేది ఇప్పుడు ఓటీటీల చేతికి వెళ్ళిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన నిర్మించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. ఓటీటీల ప్రభావం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

"ఇప్పుడు అంతా ఓటీటీ అయిపోయింది. తమ్ముడు సినిమాని ముందు విడుదల చేయగల కెపాసిటీ మాకు ఉంది. కానీ, ఓటీటీ డేట్ ని బట్టి రిలీజ్ చేయాల్సి వస్తుంది. హరి హర వీరమల్లు, కింగ్ డమ్, తమ్ముడు అన్నీ వరుసగా వస్తున్నాయి. ఎందుకంటే ఓటీటీల చేతిలోకి వెళ్ళిపోయాము. కంటెంట్ రెడీ చేసుకున్నా ఉపయోగం లేదు." అంటూ విడుదల తేదీపై ఓటీటీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో దిల్ రాజు చెప్పారు.

 

అలాగే థియేటర్లను బతికించుకోకపోతే సినీ పరిశ్రమ దారుణ స్థితిలోకి వెళ్ళిపోతుందని అభిప్రాయపడ్డారు. "ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోగలగాలి. లేదంటే ఇండస్ట్రీ వరస్ట్ ఫేస్ లోకి వెళ్ళిపోతుంది. ధరలు అందుబాటులో ఉండాలి, థియేటర్ల దగ్గర సరైన సదుపాయాలు కల్పించాలి, అన్నింటికంటే ముఖ్యంగా కంటెంట్ బాగుండాలి, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, ప్రతివారం ఏదో ఒక సినిమా విడుదలవుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది." అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

 

ఫేక్ కలెక్షన్స్, ఫేక్ వ్యూస్ పై గతంలోనే నిర్మొహమాటంగా మాట్లాడిన దిల్ రాజు.. మరోసారి కుండబద్దలు కొట్టారు. "హీరోలు ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతుకుతున్నారు. ఒరిజినల్ నెంబర్స్ తెలియట్లేదు. నిజమైన నెంబర్స్ తెలియనప్పుడు.. అసలు సినిమాపై ఎంత హైప్ ఉంది? ఇది నిజామా కదా? అని ఎలా తెలుస్తుంది. కంటెంట్ బాగుంటే ఫేక్ ప్రమోషన్స్ అక్కర్లేదు. గోదారి గట్టు సాంగ్ కి ఫేక్ అవసరంలేదని చెప్పాను. సాంగ్ బాగుంది. అది జెన్యూన్ గా హిట్ అయింది. అలాగే కోర్ట్ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ చేస్తే.. సూపర్ హిట్టయ్యి జనాల్లోకి వెళ్ళిపోయింది. రియాలిటీలో ఉండాలి. రియాలిటీ వదిలేసి ఫాల్స్ లో బ్రతికితే మన సినిమా పరిస్థితి ఏంటో మనకే అర్థమవ్వట్లేదు. చెక్కులు రాసేటప్పుడు ఫాల్స్ దానికి రాస్తున్నా అని నాకు తెలుసు. కానీ, ఆ విషయం చుట్టుపక్కన వాళ్ళకి తెలియట్లేదు. ఎన్ని వ్యూస్ ఒరిజినల్ అని నేను ఫోన్ చేసి కనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పేది కూడా రైటో రాంగో నాకు తెలియదు." అంటూ ఇండస్ట్రీలో తమకి తెలియకుండానే అందరూ ఫాల్స్ ప్రెస్టేజ్ లో ఎలా ఉండిపోతున్నారో దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.