English | Telugu

చిరంజీవి మూవీ.. ఇండస్ట్రీకి షాక్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడి!

చిరంజీవి మూవీ.. ఇండస్ట్రీకి షాక్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడి!

సినిమా బిజినెస్‌ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వస్తోంది. ఒకప్పుడు థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రమే ఉండేది. స్టార్‌ హీరోలైనా, చిన్న హీరోలైనా థియేటర్ల ద్వారా జరిగే వ్యాపారమే ప్రధానంగా ఉండేది. కానీ, పెరుగుతున్న మాధ్యమాల దృష్ట్యా సినిమాలకు రకరకాలుగా బిజినెస్‌ జరుగుతోంది. కొంతకాలం శాటిలైట్‌ ద్వారా జరిగే బిజినెస్‌ ప్రధానంగా నడిచింది. ఆ తర్వాత డిజిటల్‌ మీడియా కూడా వచ్చి చేరడంతో ఆ రూపంలో కూడా నిర్మాతకు లాభం చేకూరేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా తోడైంది. దీంతో థియేట్రికల్‌ షేర్‌ కంటే ఓటీటీ ద్వారా అమౌంట్‌పైనే నిర్మాతల దృష్టి పడింది. ఓటీటీని దృష్టిలో ఉంచుకొని ప్రతి సినిమాను భారీ రేంజ్‌లో చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీలు ఇప్పుడు అంత ఈజీగా సినిమాలను తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. స్టార్‌ హీరో అయినా, ఎంత బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా ఓటీటీ సంస్థలు సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదు. సినిమాను చూసిన తర్వాతే డీల్‌ ఓకే చేసుకునే స్థితికి ఓటీటీ సంస్థలు వచ్చేశాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ దశలో ఉండగానే మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవ్వడం అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. 2023లో చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య పెద్ద విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన భోళాశంకర్‌ డిజాస్టర్‌ అయింది. దాంతో చిరంజీవి సినిమాకి బిజినెస్‌పరంగా, ఓటీటీ పరంగా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. చిరంజీవి లేటెస్ట్‌ మూవీ విశ్వంభర ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్‌ ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. చిరంజీవి 157వ సినిమాగా అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్‌ మాత్రం చాలా ఫాస్ట్‌గా క్లోజ్‌ అవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను 55 నుంచి 60 కోట్ల మధ్యలో క్లోజ్‌ చేయబోతోందనేది అందుతున్న సమాచారం. 

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్‌ రావిపూడి.. చిరంజీవితో చేస్తున్న సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా.. షూటింగ్‌ దశలో ఉంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. టీజర్‌ కూడా రిలీజ్‌ అవ్వకముందే.. కాంబినేషన్‌ని బట్టి ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ సినిమాలో వెంకటేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సంగీత దర్శకుడు భీమ్స్‌ తొలిసారి చిరంజీవి సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టుమీద..’ సాంగ్‌ సూపర్‌హిట్‌ అవ్వడంతో చిరంజీవి సినిమాలో కూడా అతనితో ఒక పాటను రికార్డ్‌ చేశారు.