English | Telugu
మెగా వార్.. చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్!
Updated : Aug 3, 2025
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నారా? వచ్చే సంక్రాంతి బరిలో వీరిద్దరి సినిమాలు నిలవబోతున్నాయా? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట వినిపిస్తోంది.
చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'మన శంకర్ వరప్రసాద్ గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడిదే సీజన్ పై పవన్ కళ్యాణ్ సినిమా కన్నేసినట్లు వినికిడి.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. ఆ సమయంలో రెండు, మూడు బడా హీరోల సినిమాలు విడుదలవ్వడం కామన్. అందుకే బరిలో అన్నయ్య చిరంజీవి మూవీ ఉన్నప్పటికీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాని రిలీజ్ చేయాలని 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ భావిస్తున్నారని టాక్. ఈ రెండు సినిమాల మధ్య రెండు మూడు రోజులు వ్యవధి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.