Read more!

English | Telugu

'టాప్‌ గ‌న్: మావ‌రిక్' మూవీ రివ్యూ

 

తారాగ‌ణం: టామ్ క్రూయిస్‌, వాల్ కిల్మ‌ర్‌, జోన్ హామ్‌, జెన్నిఫ‌ర్ కానెల్లీ, మైల్స్ టెల్ల‌ర్‌, గ్లెన్ పావెల్‌, బ‌షీర్ స‌లాహుద్దీన్‌
ర‌చ‌న: ఎహ్రెన్ క్రూగ‌ర్‌, ఎరిక్ వారెన్ సింగ‌ర్‌, క్రిస్ట‌ఫ‌ర్ మెక్‌క్వారీ
డైరెక్ట‌ర్: జోసెఫ్ కొసిన్‌స్కీ

మే 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోన్న 'టాప్ గ‌న్: మావ‌రిక్' మూవీని హైద‌రాబాద్‌లో మూడు రోజుల ముందే ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ప్రెస్ వాళ్ల‌కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు డిస్ట్రిబ్యూట‌ర్స్‌. మావ‌రిక్ అనే నావ‌ల్ పైల‌ట్‌ మ‌న‌కు తొలిసారిగా 1986లో వ‌చ్చిన 'టాప్ గ‌న్' మూవీలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. 36 సంవ‌త్స‌రాల క్రితం న‌వ‌ యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు టామ్ క్రూయిస్‌ ఎలాంటి రిస్కీ సీన్ల‌లో న‌టించి, ఆక‌ట్టుకున్నాడో.. ఇప్పుడు ఆరు ప‌దుల వ‌య‌సుకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా అలాంటి ప్రాణాంత‌క రిస్కీ షాట్ల‌లో న‌టిస్తూ యాక్ష‌న్ ప్రియుల‌ను అల‌రిస్తూనే ఉన్నాడు. 'టాప్ గ‌న్: మావ‌రిక్' అందుకు మిన‌హాయింపు కాదు. డూప్స్‌ను వాడ‌టానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌కుండా అప్ప‌ట్నుంచీ ఇప్ప‌టికీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో స్వ‌యంగా న‌టిస్తూ ఎన్నిసార్లు ఎముక‌లు విర‌గ్గొట్టుకున్నాడో లెక్కే లేదు. ఆరు నిమిషాల సేపు శ్వాస‌ను ఎలా నిలిపి ఉంచాలో కూడా ఆయ‌న నేర్చుకున్నాడంటే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు.

'టాప్ గ‌న్: మావ‌రిక్‌'లో ఈ స్టంట్స్‌తో పాటు ఒక ఎమోష‌న్ కూడా సినిమా అంతా క్యారీ అవుతుంటుంది. ఆ ఎమోష‌న్‌.. తొలి సినిమాలో సంభ‌వించిన ఒక ప్ర‌మాదానికి సంబంధించిన‌ది. కొన్నేసి సార్లు పై అధికారుల ఆదేశాల‌ను కూడా ధిక్క‌రించి, త‌న ఇన్‌స్టింక్ట్స్ ప్ర‌కారం న‌డుచుకుంటూ వెళ్లే మావ‌రిక్‌కు స్వ‌చ్ఛందంగానైనా రిటైర్ అవ‌డ‌మో లేక ఒక గ్రూప్ యంగ్ పైల‌ట్స్‌కు ట్రైన‌ర్‌గానైనా వెళ్ల‌డ‌మో నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. శ‌త్రువుల‌కు చెందిన ఒక ర‌క్ష‌ణ స్థావ‌రంపై దాడిచేసి, దాన్ని తుద‌ముట్టించి తిరిగి రావ‌డ‌మ‌నే దాదాపు అసాధ్యం లాంటి ఒక కార్యాన్ని నెర‌వెర్చే బాధ్య‌త ఆ యువ పైల‌ట్ల‌ది. భిన్న మ‌న‌స్త‌త్వాల‌తో ఉండే ఆ యువ పైల‌ట్ల‌లో రూస్ట‌ర్ (మైల్స్ టెల్ల‌ర్‌) కూడా ఉంటాడు. అత‌నెవ‌రో కాదు.. గ‌తంలో ఒక మిష‌న్‌లో మావ‌రిక్ కోల్పోయిన స్నేహితుడు గూస్ బ్రాడ్‌షా (ఆంధోనీ ఎడ్వ‌ర్డ్స్‌) కొడుకు. 

రూస్ట‌ర్‌కు తోటి యంగ్ పైల‌ట్‌ హ్యాంగ్‌మ‌న్ (గ్లెన్ పావెల్‌)తో గొడ‌వ ఉంటుంది. తొలి సినిమా 'టాప్ గ‌న్‌'లో మావ‌రిక్‌-ఐస్‌మాన్ మ‌ధ్య గొడ‌వ లాంటిదే ఈ ఇద్ద‌రిదీ కూడా. అప్ప‌టి ఐస్‌మాన్ (వాల్ కిల్మ‌ర్‌) ఇప్పుడు జ‌బ్బుతో బాధ‌ప‌డుతూ చ‌నిపోతాడు. స్నేహితుడు గూస్ భార్య‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం నావ‌ల్ పైల‌ట్ ప్రోగ్రామ్‌లోకి రూస్ట‌ర్ రాకుండా చూడ్డానికి మావ‌రిక్ త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తుంది. అందుకే అత‌డంటే రూస్ట‌ర్‌కు ద్వేషం. పైగా త‌న తండ్రి చ‌నిపోవ‌డానికి మావ‌రిక్ కార‌ణ‌మ‌ని అత‌ను న‌మ్ముతుంటాడు. అలాంటి రూస్ట‌ర్ త‌మ మిష‌న్ ప్రారంభ‌మై, అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో చిక్కుకున్న‌ప్పుడు మావ‌రిక్ అంటే ఏమిటో తెలుసుకొని, అత‌డికి ద‌గ్గ‌ర‌య్యే స‌న్నివేశాలు ఎమోష‌న‌ల్‌గా న‌డిచి ఆక‌ట్టుకుంటాయి. యంగ్ పైల‌ట్లు అంద‌రిలో టీమ్ స్పిరిట్ క‌ల్పించ‌డానికి వారితో మావ‌రిక్ బీచ్ ఫుట్‌బాల్ ఆడించే సీన్లు అల‌రిస్తాయి. ఇవి ఫ‌స్ట్ ఫిల్మ్‌లోని వాలీబాల్ సీక్వెన్స్‌ను గుర్తుచేస్తాయి.

ఇందులో మావ‌రిక్‌కు ల‌వ్ యాంగిల్ కూడా పెట్టారు. అత‌ని మాజీ గాళ్‌ఫ్రెండ్ పెన్నీ బెంజ‌మిన్‌గా జెన్నిఫ‌ర్ కానెల్లీ ద‌ర్శ‌న‌మిచ్చింది. బార్ ఉమ‌న్‌గా ప‌నిచేసే ఆమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. సినిమా మొత్త‌మ్మీద ఉండే ఒకే ఒక్క బెడ్ సీన్ ఆ ఇద్ద‌రిదే. అయితే ఫ‌స్ట్ ఫిల్మ్‌లో కెల్లీ మెక్‌గిల్స్‌తో ఉండే ఎరోటిక్ సీన్‌తో పోలిస్తే.. ఇది చాలా హుందాగా అనిపిస్తుంది. ఆ ఇద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న టైమ్‌లో ఆ రాత్రికి ఇంటికి రాకుండా ఫ్రెండ్స్‌తో గ‌డ‌ప‌డానికి వెళ్తాన‌ని చెప్పిన పెన్నీ కూతురు వ‌చ్చేయ‌డం, మావ‌రిక్ గోడ‌దూకి ఆమెకు దొరికేయ‌డం ఓ స‌ర‌దా స‌న్నివేశం. 'ఈ సారైనా అమ్మ హృద‌యాన్ని గాయ‌ప‌ర‌చొద్ద‌'ని ఆ పిల్ల అంటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మావ‌రిక్ వంతు.

సినిమా అయ్యాక ఒక ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను చూసిన ఫీలింగ్‌తో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాం. మావ‌రిక్‌గా టామ్ క్రూయిజ్ న‌ట‌న‌, అత‌డి క‌రిష్మా ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌ల‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా! అటు యాక్ష‌న్ సీక్వెన్స్‌లలోనూ, ఇటు ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ అత‌ని ఉన్న‌త‌స్థాయి న‌ట‌న‌కు ఫిదా అవుతాం. రూస్ట‌ర్‌గా మైల్స్ టెల్ల‌ర్‌, హ్యాంగ్‌మ‌న్‌గా గ్లెన్ పావెల్‌, పెన్నీగా జెన్నిఫ‌ర్ కానెల్లీ ఆక‌ట్టుకున్నారు. ఒక యాక్ష‌న్ క్లాసిక్‌గా 'టాప్‌గ‌న్: మావ‌రిక్' రూపొంద‌డంలో డైరెక్ట‌ర్ జోసెఫ్ కొసెన్‌స్కీ పాత్ర ప్ర‌ధాన‌మైంది. 'ట్రాన్: లెగ‌సీ' (2010)ని ఫాద‌ర్‌-స‌న్ రిలేష‌న్‌షిప్ చుట్టూ న‌డిపి ఎలా ఆ మూవీని ఆక‌ర్ష‌ణీయంగా మ‌లిచాడో, 'టాప్‌గ‌న్: మావ‌రిక్‌'ను కూడా అదే త‌ర‌హాలో మావ‌రిక్‌-రూస్ట‌ర్ రిలేష‌న్‌షిప్‌పై ఎమోష‌న‌ల్‌గా న‌డిపి అనుకున్న‌ది సాధించాడు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి