"పాపం వాళ్ళనాన్నకి ఏక్సిడెంటు అయింది చాలా బాధల్లో వున్నాడు, ఏదో కుర్రాడు తప్పుచేశాడు! కుర్రాళ్ళదంతా అదో తరహా వాళ్ళనని లాభంలేదు? పోలోమని యేదిపడితే అదే. అర్ధంలేని ఆవేశంతో కూడుకున్న చర్య అది? క్షమించండి"
లెక్చరర్స్ అంతా కలిసి ప్రిన్సిపాల్ కి చెప్పి చూశారు ఆయన వినలేదు. లొంగివస్తే యింకా మితిమీరతారని పట్టుబట్టి అందరినీ సస్పెండ్ చేస్తానని. లొంగిరానివాళ్ళని టి.సీ, ఇచ్చి పంపిస్తానని నోటీసు తయారుచేశారు.
చినికి చినికి గాలి వాన అవుతుందన్నట్లుగా వుంది పరిస్థితి.
ఇక ఉపేక్షిస్తే ఈయన పట్టుదలకి తోడుగా కుర్రాళ్ళు చెలరేగితే ఏమవుతుందోనని భయపడసాగారు లెక్చరర్స్.
అప్పుడు చొరవ చేసుకున్నారు శర్మగారు? అంతా చెప్పగా నేరుగా ప్రిన్సిపాల్ రూంకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరు.
"ఇదిగో రావ్ నీకు బుద్ధలేదురా పిల్లవాళ్ళు స్ట్రయిక్ చేశారు. వాళ్ళకివాళ్ళే దిగివచ్చి తప్పయిపోయింది క్షమించమని అడిగే స్థితిలో వున్నారు నీవు సస్పెన్స్ ఉత్తర్వులు ఉపసంహరించుకుంటే వాళ్ళు క్లాసులకి హాజరవుతారు.
అనకూడదు కానీ మన అదృష్టంకొద్దీ ఆ సుందర్రావుకి ఏక్సిడెంటు అయిందా అనిపిస్తుంది? అదే జరక్కపోతే సమ్మె యింత తీవ్రంగా అయ్యేదో ఏమో!
మొండిపట్టు పట్టకు.
"నీవేం చెయ్యొద్దులే! కుర్రాళ్లని ఎలాగో సర్ది చెపుతాం నీవు మౌనంగా వుండు చాలు."
"మీకు తెలీదు మేస్టారు అడ్మినిస్ట్రేషన్ బాగా వుండాలంటే యిలాంటివి జరిగినప్పుడు జారిపడకూడదు? అలా చేస్తే మనం లోకువవుతాం."
ప్రిన్సిపాల్ ముఖంలోకి చూశారు శర్మగారు.
"నీతి వాక్యాలు నాకు వల్లిస్తావట్రా! చాలు చాల్లే ఏదీ ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఇలాతే" అని బలవంతంగా లాక్కునిచించి వేసి "ఇక నీవు రూము కదలకుండా కూర్చో? యూనియన్ ప్రెసిడెంటు వచ్చి మాటాడుతాడు" అని బయటికి కేకేశాడు శర్మగారు.
ప్రిన్సిపాల్ దిగివచ్చాడని అందరికీ అర్ధమైంది. అందరి ముఖాల్లో ఆనందం తాండవించింది. విద్యార్ధులూ చాలా మందికి ఇది సంతోషమే కలిగించింది.
సమ్మె ముగిసింది.
* * *
హాస్పటల్లో చేర్చారు సుందర్రావుని.
తనకి చాలా బలమైన దెబ్బలు తగిలాయ్. వెంటనే కుట్లు వేశారు. ఆరోజు దెబ్బతగిలినది మొదలుకొని నాలుగురోజులు కామాలు వున్నాడు సుందర్రావు.
స్పృహలేని భర్తని క్షణంకూడా వదలలేదు అన్నపూర్ణ రేయింబవళ్ళు భర్త మంచాన్ని అంటిపెట్టుకొని కూర్చుంది. మధు ఫేక్టరీకి సెలవు పెట్టాడు, సుధాకర్ కాలేజీకి సెలవుపెట్టాడు. జయప్రద ఇంట్లో పని చేసుకుంటూంది. ఎవరికీ మనసులో మనసులేదు.
అయిదోరోజు కళ్ళు తెరిచాడు సుందర్రావు.
"అమ్మా!"
భర్త మూలుగులాంటి పలుకు ఆరురోజుల తర్వాత అమృత సొనలా వినిపించింది అన్నపూర్ణకి.
"ఏమండీ!"
"పూర్ణా!"
బలవంతంగా కళ్ళు తెరవబోతూ పిలిచాడు సుందర్రావు.
"నేనేనండీ! నేనే!" అందామె.
కళ్లు తెరిచాడతను.
మసక మసకగా ఏమీ కనిపించకుండా వుంది.
"ఎక్కడ పూర్ణా?" ఆందోళనగా అడిగాడాతను.
"ఇక్కడేనండీ! ఇక్కడే!"
కళ్లు బాగా తెరిచాడు? అయినా ఆమె కనిపించలేదు. చాచిన భర్తచేతికి చేయి అందించి "ఏమిటండీ" అని గాబరాగా అడిగింది.
"నీ వెక్కడున్నావో నాకు కనిపించడం లేదు పూర్ణా!"
"ఏమండీ!" కేక వేసినట్టుగా అందామె.
అతని కళ్ళనుంచి నీరు కారుతోంది.
అన్నపూర్ణ కేక విని నర్సు పరుగెత్తుకొచ్చింది.
"స్పృహలోకి వచ్చారా?"
"సిస్టర్"
"ఉండండి డాక్టర్ గారిని తీసుకొస్తాను" అని వెళ్ళిపోయింది.
"పూర్ణా! నాకేమీ కనిపించటం లేదు. ఇంతకీ నా కేమయింది పూర్ణా! లారీ తగలటంవరకే గుర్తుంది నాకు"
నోట్లో గుడ్డ కుక్కుకుని ఏడవసాగిందామె.
హడావిడిగా వచ్చిన డాక్టర్ పరిస్థితి గమనించాడు. జరిగిన ఏక్సిడెంటులో ఆప్టిక్ సర్వ్స్ దెబ్బతినడం వలన దృష్టి లోపించిందని తెలుసుకున్నాడు. అయితే అది శాశ్వతమైన అంధకారమా? తాత్కాలికమైందా? అనేది పరీక్ష చేస్తే కాని తెలియదు.