Read more!
Next Page 
రాగోదయం పేజి 1

                                 


                            రాగోదయం
                                                                      - యామినీ సరస్వతి


                                            


    "శుభం!"
    కొడుకు నుదుట, గిత్తల నుదుట కుంకుమ దిద్ది చిరునవ్వుతో ఎదురొచ్చి అంది చంద్రమ్మ.
    "తూర్పు పొలం దున్నితే యీ సంవత్సరం తెల్ల ధాన్యం తెగపండుతుందన్నాడు పంతులుగారు. పేరు బలం కూడా నీ పేరా బాగుందన్నాడు. ముందుగా మడికాడికెళ్ళగానే కాడి యిడిచి కోడేరేసుకుని ఎద్దుల్ని తూర్పు దిక్కు మలిపి దున్ను. మాపటేలదాకా దున్నక్కర్లేదులే! మద్దె నేలకు యింటికి రా!" కొడుక్కి వివరం చెప్పేడు జానయ్య.
    తండ్రి కాళ్ళకు తల్లి కాళ్ళకు మొక్కి ఎద్ధులకు కూడా మొక్కి కాడికదిల్చాడు సోము. కొద్ది దూరం నడవగానే అతని చెల్లెలు రాములన్న పసుపు కుంకుమలు పట్టుకుని ఎదురుగా వచ్చింది. పొట్లాల్లో వున్న పసుపు కుంకుమలు విప్పి గిత్తల నుదుట చల్లింది. అవి ఆనందంగా రంకె వేశాయి.
    చిరునవ్వు నవ్వేడు సోము.
    "ఇదిగో! ఈ సంవత్సరం బాగా పండాల! నాకు స్టీలు గొలుసులు తెచ్చియ్యాల చూడు!" అంది రాములమ్మ.
    "అట్లాగే!"
    ఏరు వాకకి సాగేడు, రాములమ్మ చూస్తూ వుండి పోయింది.
    ఆ ఊరుకి కొద్ది దూరంలో వుంది మాల గూడెం ఊరు నాశ్రయించుకుని బ్రతుకుతున్నారంతా. పొలాల్లో, యిళ్ళల్లో, కళ్ళాల్లో పనులు చేసి ఆ సాములు యిచ్చిన కూలీ నాలీ తీసుకుని, వాళ్ళు దయతలచి యిచ్చిన చిరుగులు కట్టుకుని, పండుగా పబ్బం వస్తే వాళ్ళు వదిల్చిన తీపీ, కారం తిని, అదే పండుగ అనుకుని బ్రతుకుతున్నారు ఆ జనం.
    వాళ్ళకి భూములు లేవు కళ్ళాలు గట్రాలేవు. ఒకటో రెండో పాడి పశువులు, ఒకటో ఆరో వ్యవసాయం ఎడ్లు నాలుగైదు కుటుంబాలకి వున్నాయి. మిగతా అంత కూలీపై ఆధారపడి బ్రతికేవాళ్ళే.
    జానయ్యకి ఎకరం మాగాణి వుంది వాళ్ళ తాతతో ముత్తాతతో ఆ వూరి కరణం గారిప్పించిన బంజరు సాగుచేసుకుంటే, అది ఎకరం మెట్ట అయింది. అప్పుడు దాదాపు ఒక దశాబ్దం పాటు ఆ చేలో రాళ్ళు ఏరి, చెట్లు నరికి, గట్లు నరికి, గట్లు నరికి, పుట్టలు త్రవ్వి, భూమి చదును చేసుకున్నారు. అదిప్పుడు మిరప, ప్రత్తి శనక్కాయ లాంటి వ్యాపార పంటలు పండుతోంది.
    ఆ గూడెంలో ప్రతి కుటుంబానికి మరో కుటుంబం వుంది. ఊరిలోని వాళ్ళు ఈ గూడెంలోని వ్యక్తుల్ని తమ మనుషులుగా చెప్పుకుంటారు. మా ఓబిగాడు, మా సుబ్బిగాడు, మా రామన్న, మా జానయ్య అంటూ చెప్పుకుంటారు.
    అది ఆత్మీయత కాదు. ఆప్యాయత అంతకంటే కాదు. అదంతా కేవలం గూడెంలోని ప్రతి వ్యక్తీ వూరిలోని ఈ కుటుంబానికి సేవ చేయటానికే. కేవలం వీళ్ళ అవసరాలు తీర్చటానికి వీళ్ళకి వుపయోగ పడటానికి మాత్రమే అంతే!
    పొలాలకి నీళ్ళు పెట్టటానికి ఊడ్పులప్పుడు, నూర్పిళ్ళప్పుడు వాళ్ళొచ్చి గొడ్డుచాకిరి చేసేందుకు అవసరమైతే ఆసాముల తరపున చిత్తుగా త్రాగి ఒకర్నొకరు కొట్టుకోవటానికి గూడెంవాళ్ళు ఊళ్ళోవాళ్ళకి అవసరం అవుతారు.
    గొడ్డు నొచ్చినా, బిడ్డనొచ్చినా గూడెంలోని జనులు ఊళ్లోకి పరిగెడతారు ఊళ్ళో పశువులకీ మనుషులకీ కూడా ప్రాధమిక చికిత్స మొదలువ్యాధులు కుదిర్చేందుకు అవతారం గారున్నారు. ఆయన ఔషధం "జాహ్నవీ తోయం" ఆయన ధన్వంతరి. ఆయన వైద్య నారాయణుడు.
    జబ్బు కుదిరితే గూడెం వాళ్ళది అదృష్టం! అవతారం గారిది అమృత హస్తం! జబ్బు ముదరబెట్టి పట్నం వెళ్ళాలో, వెళ్ళే దారిలోనే పశువులు, శిశువులు, పెద్దలు హరీమంటే అది వాళ్ళ ఖర్మం! అవతారం గారి చేతికి మించే అలా పంపేరు. ఆయన చేయిదాటితేవైతరణి దాటాల్సిందే అనుకుంటారు.

Next Page