"మీకేమీ కాలేదు సుందర్రావుగారూ! ఏమీ భయపడకండి, పరీక్షచేసి మందులిస్తే బాగా చూడగలుగుతారు" అని థియేటరులోకి తీసికెళ్ళారు.
"భగవంతుడా! ఏమిటి నాకీ పరీక్ష! పెళ్ళిచూపులకి వెళ్ళటమేమిటి? తిరిగొస్తూ దెబ్బతినమేమిటి? అందునా చూపు కనిపించకపోవటం ఏమిటి? ఏడుకొండలవాడా! వెంకటరమణా! తండ్రీ అన్నిటికీ నీవేదిక్కు! ఈ సంసారానికి అంతా ఏడుగడ ఆయనే! ఆయన కేదయినా అయితే యీ సంసారం బాధ్యతలన్నీ నేనే! నే జీవించలేను బ్రతికి యీ పాట్లు పడలేను, తండ్రీ! సర్వేస్వరా! ఆయనకేమీ జరగకుండా కాపాడు" అని మనసారా ప్రార్ధించింది అన్నపూర్ణ.
అయితే భగవంతుడు ఆమె మొర ఆలకించలేదు.
ఎక్కడో ఏడు పర్వతాలమీద ఏడు ప్రాకారాలమధ్య ఏడువాకిళ్ళ వెనుక గర్భగుడిలో కూచుని సతతం పూజార్లు పెట్టే పూజాకలాపాది ఘోషలో ప్రతిక్షణమూ వందలూ వేలుగా స్వయంగావచ్చి దర్శించుకొని విన్నపాలు విన్నవించే భక్తుల రద్దీలో ఆయనకి ఆమె మొర వినిపించలేదు కాబోలు. సుందర్రావు శాశ్వతంగా గుడ్డివాడయ్యాడు.
తగిలిన చిన్న చిన్న దెబ్బలు నయం కావటంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారతన్ని. భార్య ఆసరాతో ఇంట్లో అడుగుపెట్టాడు మళ్ళా.
* * *
పదిహేనురోజులు గడిచాయి.
ప్రావిడెంటు ఫండూ? మూడునెలల జీతమూ ఇచ్చి ఉద్యోగంనించి తీసివేశారు సుందర్రావుని. సెక్షన్ పైకి వ్రాశారు ఏమిస్తుందో.
ఆయన చేసిన సేవలు - ఉద్యోగిగా ఆయన ధర్మనిర్వహణ-అంతా పొగిడారు. అలాటివాడికి వచ్చిన కష్టాలకు విచారించారు. ఆఫీసు తరపున ఓ నల్లకళ్ళజోడూ- ఓ శాలువా- ఓ కఱ్ఱా అందించారు.
సుందర్రావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్. దుఃఖాన్ని నిగ్రహించుకోలేక పోయాడు. జల జలా రాలుతున్న కన్నీటిని ఆపేందుకు ప్రయత్నించలేదు-అయినా ఆగే దుఃఖం కాదది.
"మిత్రులారా! అన్నాడే కానీ ఆ పైనీ అతనికి గొంతు పెగల్లేదు."
నాలుగు పదుల వయసులోనే జీవితం అంధకార బంధురమైతే ఎవరికిమాత్రం కష్టంగా వుండదు.
ఆఫీసర్ సుందర్రావు భుజంతట్టి ఓదార్చాడు. "నా సాధ్యమైనంత ప్రయత్నించి త్వరలో పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేస్తాను" అని చెప్పాడు.
ఇంటికి వచ్చి భార్య చేతికి ఇచ్చాడు ఎనిమిదివేలు!
"పూర్ణా! ఎనిమిది వేలయినా ఎనిమిది లక్షలయినా ఇక మన ఆస్తల్లా యిది! ఇక నీ భర్త ఒక్క కానీ కూడా సంపాదించలేడు. ముష్టెత్తటం తప్ప ఇకనాకు చేతనయింది లేదు. చూపు గుడ్డిదయినా కడుపు గుడ్డిది కాలేదు" అని ఇంకా ఏమో అనబోతున్న భర్త నోరు మూసింది మృదువుగా.
"ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని గాంధారికూడా తన కళ్ళకి గంతలు కట్టుకుంది. నేనలా చేయలేకపోయినా నా చూపు మీదే! మీకేమండీ! ముయ్యల్లాంటి ఇద్దరు కొడుకులు ఒక కూతురూ వున్నారు. మిమ్మల్ని మంచం దిగనివ్వకుండా అన్నీ అమర్చగలను. ఇక క్షణ క్షణానికీ మీకేం కావాలో కనుక్కోవటానికి నేనున్నాను, నాకింకేం పనుంది చెప్పండి."
"పూర్ణా! సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. ఎన్నివున్నా చూపులేకపోతే బ్రతుకంతా గుడ్డిదే! జన్మతః అంధులయిన వాళ్ల సంగతి వేరు పూర్ణా! లేనివాడికంటే వున్నది పోగొట్టుకుని లేనివాడయిన బ్రతుకు అధ్వాన్నం వీడికి వగపెక్కువ.
"పదే పదే గతస్మృతులు మనో యవనిక ముందు ఆడుతూ వుంటే ఆ బాధ చెప్పతరం కాదు"
"చూడండి! మీకు చెప్పతగిన దాన్ని కాను- అయినా ఒకమాట చెబుతాను వినండి జీవితంలో జారిపోయింది తిరిగి రాదు. గతించినదాన్ని గురించి దుఃఖించటం వల్ల ఫలంలేదు, మనస్సు శాంతింప చేసుకోండి."
నిట్టూర్చాడు సుందర్రావు.
అతనేదో అనబోతుండగా విశాలక్షీ వచ్చింది.
"ఎవరిదో కొత్తవాళ్ళ పద ధ్వనిలాగా వుందే" అనుకుని "ఎవరూ?" అన్నాడు సుందర్రావు.
అన్నగారివద్దకు వచ్చి నేలమీద కూర్చుని ఆయనపై చేయివేసి మెల్లిగా దుఃఖించసాగింది.
భర్తకీ ఆపద సంభవించాక అన్నపూర్ణ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. "ఎంత దుఃఖించినా ఫలితం శూన్యం. జరుగబోయేదాన్ని గురించి ఆలోచించాలి కానీ గతానికై వగచి లాభంలేదు."
"విశాలా" అంది అన్నపూర్ణ.
భార్య పిలుపువిని గుర్తించాడు సుందర్రావు.
"చూడమ్మా! ఇలా అయింది నా బ్రతుకు. కాలో చెయ్యో విరిగివుంటే ఏ బడ్డీ కొట్టుపెట్టుకొని అయినా బ్రతకవచ్చు. కానీ భగవంతుడు కళ్ళే పోగొట్టాడు. అది నా దురదృష్టం. నా బ్రతుకంతా ఇతర్లమీద ఆధారపడవలసిందే."
"అన్నయ్యా! అలా అనొద్దు. అది విషవేళ! నీవు పెళ్ళి ప్రయత్నంపై రావటమేమిటి? అంతా భగవంతుని లీల! లేకపోతే రోడ్డుపై రోజూ ఎన్ని లారీలు పోవు. నిమిష నిమిషానికీ ఎంతమంది నడుస్తూ వుండరు. అయినా మనఖర్మ కాలింది.
ఇంకా పదేళ్ళపాటు లక్షణంగా వుండి మనవలతో మనవరాళ్ళతో హాయిగా కులాసాగా కాలం గడపవలసిన వాడివి నీకీ దుర్గతి వచ్చింది."
విశాలి దుఃఖం అన్నపూర్ణని కూడా కదిలించింది.