కూతురిని గురించిన ఆలోచనలతో దిగాలు పడిపోయి కూర్చుండిపోయింది విశాలక్ష్మీ.
* * *
"ఒరే సుధాకర్, నీవు నిన్న క్లాసుకు వచ్చావట్రా"
తెలుగు లెక్చరర్ మాణిక్యశర్మ గారి దదోరకం తత్వం అయినా ఎవరయినా సరే ఒరే అనే అంటాడు. గవర్నరొచ్చినా తనకన్నా చిన్నవాడయితే ఒరే అనే పిలిచే సాహసం ఆయనకుంది! డి.ఇ.వో ఇన్ స్పెక్షన్ కొచ్చాడొకసారి డి.పి.ఐ. వెంట అప్పుడు "ఒరే అబ్బాయ్! ఎందుకురా యీ ఇన్ స్పెక్షన్ పేరుతో వేలకివేలు తగలేసిపోతారు" అన్నారాయన. తప్పు పట్టినందుకు కాకపోయినా ఒరే అన్నందుకు బాధపడి ఏమో అనబోతే తెలిసినవాళ్ళు ఆయనతత్వం విడమరిచి చెప్పారు. అలాటివాడు శర్మగారు.
"వచ్చాను మాష్టారూ!"
"నా కళ్లు కప్పాలనుకోకురా అబ్బాయ్. నిన్న నువ్వా బెంచీలో లేవు, పోన్లే అబద్ధం ఆడినా దక్కాలిఅది? నిన్న ఏం పాఠం చెప్పానో గుర్తుందా?"
నీళ్ళు నమిలాడు సుధాకర్ "ఇదేపాఠం మాష్టారూ"
"ఆఁ భడవా! నేనసలు నిన్న క్లాసుకి రాలేదు, మీ కొత్త మేడం క్లాసు తీసుకుంది?"
సిగ్గుపడ్డాడు సుధాకర్.
"ఒరే సుధా! ఎందుకురా మీరు కాలేజీల కొస్తారు? మీ వాళ్ళకి డబ్బెక్కువై మీ పోరు యింట్లో భరించలేక వస్తుంటే ఫరవాలేదు. కానీ మీ కుటుంబం గురించి నాకు తెలుసు."
సుధాకర్ ముఖం ఎర్రబడింది. ఆయన ధోరణికి నొచ్చుకున్నాడు. ఇక తను ఏమీ అనకపోతే ఆయన వాగ్ధాటి ఆగదు. అందుకని "మేష్టారూ" అని పిలిచాడు.
"ఏరా?"
"మీరుపాఠం చెపుతున్నందుకెంత పుచ్చుకుంటున్నారు. మాకు నీతి పాఠాలని చెప్పటానికెంత పుచ్చుకుంటారు? ఒరే అనటం మానుకోవటానికెంత? క్లాసులో మీ పని మీరు చేసుకపోవటానికెంత? మేము వచ్చామో చచ్చామో విచారించటం మానటానికెంత? అందరికీ ప్రజెంట్ వెయ్యటానికెంత? నీతి పాఠానికెంత? ఒరే అనటానికెంత? ప్రజెంటుకెంత? నిర్లిప్తత కెంత? మొత్తం ఎంత? నీతి పాఠానికి ఒరేకి కలిపెంత? ప్రశ్నలకీ ప్రజంటుకీ ఎంత? విడివిడిగా విద్యార్ధికెంత? టోకుగా ఎంత? విభాగాల కెంతెంత? మొత్తం ఎంత?"
నోరు తెరుచుకుని వుండిపోయాడు శర్మగారు.
"చెప్పండి మేష్టారూ? విడివిడిగా ఎంత? టోకుగా ఎంత? నీతికెంత? ప్రజెం---"
వెనుక బెంచిలో కూర్చున్న కుర్రాడెవరో "జూనియర్ మాడా" అన్నాడు.
తల తిప్పలేదు సుధాకర్.
"యస్. నేను ముగ్గురికి జూనియర్ ని రెండు సినిమాలూ చూశాను. శిష్యుడనైపోయాను. పురాణాలు కట్టిపెట్టండి. ఊ ఇక చెప్పండి మేష్టారూ పాఠాలకెంత? ప్రజెంటుకెంత?..."
"మిస్టర్ సుధాకర్?"
ద్వారంవేపు చూసేడు అతను.
ప్రిన్సిపాల్!
క్షణకాలం తబ్బిబ్బయ్యాడు.
"ఏమిటి దంచుతున్నావ్?"
జవాబు చెప్పలేదతను.
"బుద్ధిగా కాలేజికివచ్చి చదువుకుని వెళ్ళటం తెలీదా?"
తలూపేడు.
"ఏమిటి తెలుసనా? తెలీదనా-"
"తెలుసు."
"మరేమిటిది?"
జవాబు చెప్పలేదు.
"మారు కాలేజి చదువులపేరుతో సినిమాలు చూడటం ప్రారంభించారు. సినిమాలు చూడటం అనుకరించటం."
"సార్!"
"యస్! నీ సంగతి నాకు బాగా బోధపడింది. ఇంకోసారిలా జరిగితే కాలేజినుంచి సస్పెండ్ చేస్తాను."
"దయచేసి నా మాట వినండి. ముత్యాల ముగ్గు సినిమా చూశాక, ఆ పద్ధతి బాగా అలవాటైపోయింది."
"వాడు చాలాసార్లు చూశాడండి" వెనుక బెంచీ మళ్ళీ మ్రోగింది.
"ఎన్నిసార్లు చూశావు."
"లెక్క పెట్టుకోలేదండి. నేను ముందుగా రిలీజ్ డే చూశానండి. తర్వాత నేనూ మా అన్నయ్యా, తర్వాత మా అన్నయ్యా నేనూ మా చెల్లాయ్, ఇంకోసారి మా చెల్లాయ్ అమ్మా నేను- మరోసారి నేనూ మానాన్నా. మరోసారేమో మళ్లీ నేనొక్కడినేనండి. ఇంకోసారి నా బెస్ట్ ఫ్రెండ్ రమ్మంటే వాడి ఖర్చుమీద వెళ్ళేనండి. మళ్ళీ నేనూ మా అన్నయ్యా వెళ్ళేమంజి, ముళ్ళపూడి మాటలకి నేనూ మా చెల్లాయి వెళ్ళేమండి, ముత్తెమంతా పసుపు పాటకి నేనూ మా అమ్మా ఓసారి వెళ్ళేమండి. మా పక్కంటి వాళ్ళ అబ్బాయిలు ఆంజనేయస్వామిని చూడాలంటే ఇంకోసారండి. మా ఫ్రెండు ఒకడు పల్లెటూరినుండి వచ్చి హలండాన్సు కోసం అంటే మళ్ళీనండి. ఇంకోసారి కేవలం జయమాలిని కోరకండే... మొత్తం ఎన్ని సార్లయిందండి..."
"షటప్! నేను లెక్కెట్టలేదు."