Previous Page Next Page 
మధుకీల పేజి 6

    గేటుదాటి వెళుతున్న సుధామయికి యెదురయ్యాడు సుధాకర్.
    ఆశ్చర్యపోయి నిలుచున్న వాళ్ళిద్దరినీ పరస్పరం పరిచయం చేసింది అన్నపూర్ణ.
    నివ్వెరపోయాడు సుధాకర్!
                                             *            *            *
    అన్నగారిని చూడగానే ఆనందంగా ఆహ్వానించింది విశాలాక్షి.
    "అనకూడదుకానీ అన్నయ్యా! మామీదనిజంగా దయ తప్పవునీవు. నీవు యీవూరొచ్చి యెన్నాళ్ళయింది?" అని ప్రశ్నించింది కాఫీగ్లాసు అందిస్తూ.
    "అదికాదు విశాలా! కుటుంబం అన్నాక ఎన్నొయిబ్బందులు! ఎన్నో చిక్కులు! ప్రతిసారీ వద్దామనుకోవటం ఏదో ఇబ్బందులతో ఆగిపోవటం, అయినా ముఖ్యమైన కార్యక్రమాలకు దేనికిరాలేదు?"
    "నీవు రావాలంటే యీ ఇంట్లో యేదో పెళ్ళిసందడో జరగాలన్నమాట, అయితే ఇప్పుడూ అదేపనిమీద వచ్చావా?"
    ఆమెకై ఆమె తెచ్చిన ప్రస్తావనతో తనపని తేలికైనట్టుగా అనుకుని "అవునువిశాలా! ఆ విషయంమీదేవచ్చాను" అన్నాడతను.
    నవ్వింది విశాలాక్షి!
    "అల్లుళ్ళను వెతుకుతూవెళ్లే యీ రోజుల్లో కోడళ్ళను వెతుకుతూ రావటం చాలావిచిత్రంగా వుందన్నయ్యా! యేనాడో మధుని లతని చేసుకుంటానన్న నీవు ఆమాటే పట్టుకుని యిప్పుడు రావటం చాలా ఆనందంగా వుంది- కానీ మధు అమ్మాయిని ఒప్పుకుంటాడని నేను నమ్మటంలేదు" విచారంగా అంది విశాలాక్షి.
    ఆశ్చర్యపడటం ఈసారి సుందర్రావు వంతయింది!
    భార్య పోరుతో కూతుర్నివ్వాలని వచ్చాడుకానీ ఏనాడో విశాలభర్త పోయిన కొత్తల్లో మాటవరసగా లతను తన కోడల్ని చేసుకుంటానన్న ఆ మాట యిలా కంఠపాశమవుతుందనుకోలేదు నేను...."
    "నీ విషయం తెలుసన్నయ్యానాకు! యీ మధ్య జరిగిందే మీకు తెలీదు- లతకి రేచీకటి ప్రబలంగావుంది. సాయంకాలం ఆరుదాటితే ఇకదానికి అంతులేని అంధకారమే! ఎన్నిచోట్లకి తిరిగినా ఎందరు డాక్టర్లని సంప్రదించినా ఫలితంలేదు, దానిపెళ్లికి అదోపెద్ద అభ్యతరమై కూర్చుంది"
    నిర్ఘాంతపోయాడు సుందర్రావు.
    "ఇప్పుడు చెప్పు...మధు దాదాపు సగం గుడ్డిదైన లతని చేసుకుంటాడా?"
    "విశాలా!"
    "అవునన్నయ్యా! ఒకరేనేమాటే నేనంటున్నాను"
    "నేనొచ్చినందుకు కాదమ్మా?"
    ప్రశ్నార్ధకంగా చూసిందామె.
    "జయప్రదని ఫణికి ఇవ్వాలని వచ్చాను"
    "......"
    "నా సంసార విషయం కూడా నీకు బాగా తెలుసు - తినటానికి కట్టటానికి వున్న బ్రతుకులు ప్రావిడెంట్ ఫండ్ తప్ప మరో ఆస్తిలేదు, అదిచ్చి అమ్మాయిని యివ్వాలని అడగాలని వచ్చాను."
    "......"
    "నీవు వూఁ అంటే అబ్బాయమ్మాయి చూసుకుంటే"
    "అన్నయ్యా"
    "......"
    "నాదో మాట వింటావా?"
    "......"
    "నీవు అంగీకరిస్తే, లత నీ కోడలయితే జయ నా కోడలవుతుంది, ఫణి నామాట జవదాటడు."
   "విశాలా!"
    "కుండమార్పిడి పెళ్ళి నాకిష్టం లేదు కానీ, లతకి పెళ్ళి కావాలంటే యింతకన్నా గత్యంతరంలేదు. వేలు కుమ్మరించి కన్యాదానం చేసినా లతపై సానుభూతి లేనివాడితో దాని సంసారం నరకమే అవుతుంది- బాగా ఆలోచించన్నయ్యా- చెపితేకాని దానిలోటు అర్ధంకాదు."
    నిట్టూర్చాడు సుందర్రావు. "అలాగే విశాలా! నేను ఆలోచించేది ఏమీలేదు యిందులో. మధు నిర్ణయమే ఫైనల్ వాడికీ వీడి చెల్లెల బాధ్యత వుందికదా! ఫణిలాగా వాడూ బుద్ధిమంతుడయితే" ఆయనవాక్యం పూర్తి చేయలేదు-
    "భగవంతుడు నుదుట వ్రాసివుంటే తప్పదులే అన్నయ్యా!" అంది ఆమె.
    లేచాడు సుందర్రావు "ఇక వెళతానమ్మా! అతికితే కతకదని భయపడం కాదుగానీ ఎందుకో నా మనస్సు అంగీకరించటం లేదు" అన్నాడు.
    "అన్నయ్యా! నాది స్వార్ధమే కావచ్చు. కానీ కన్న కూతురి క్షేమం కోరుకోవాలంటే యింతకంటే మరోమార్గం లేదు నాకు" అందామె.
    "విచారించకు విశాలా! దూరదూరంగా వున్నా మన మనసుల్లో ఆర్ద్రత నశించలేదు, ఈ సంబంధాల విషయమై మనసుల్ని పాడుచేసుకోవటం ఎందుకు. భగవంతుని నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది" అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సుందర్రావు.

 Previous Page Next Page