ఆమె నిర్ణయానికి తిరుగులేదు.
మధుకి కూడా అదే వుద్దేశ్యం వుండటంతో మరో రెండు రోజుల్లో విడిగా కాపురం పెట్టారు వాళ్ళు.
పాపయ్య ఫాక్టరీలో చాలా రిజర్వడ్ గా వుంటున్నాడు. మామూలు ఇతర వ్యక్తులతో వ్యవహరించి నట్టుగా చూస్తున్నాడు.
* * *
"మామయ్యా! మామయ్యా! ఒక శుభవార్త!"
కనురెప్పలు తాటిస్తూ పెదవులపై చిరునవ్వు మెదలగా "ఏమిటి ప్రతాప్?" అని అడిగేరు సుందర్రావుగారు.
"అమెరికా నుంచి ఐ స్పెషలిస్టు మసు వస్తున్నారు వారం రోజుల్లో. మన డాక్టరుగారు చెప్పారు. ఆ డాక్టర్ కి మిమ్మల్ని చూపితే ఆపరేషన్ చేసి ఖచ్చితంగా చూపు తెప్పిస్తారట."
నిర్వికారంగా నవ్వాడు సుందర్రావుగారు.
"నాకింకా ఆ ఆశలు లేవు బాబూ! భగవంతుడెందుకో యీ శిక్ష విధించేడు. అనుభవిస్తున్నాను."
"ఈ అవకాశాన్ని కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు. మీరు కాదనకండి. అసలు కాదన్నా నేను వినననుకోండి అత్తయ్యా! మీరయినా చెప్పండి" అన్నాడతను అటుగా వచ్చిన పూర్ణతో.
"కానీ! డబ్బుతో వ్యవహారం ప్రతాప్! ఎన్నివేలో కావాలి,"
"అక్కర్లేదత్తయ్యా! మనకి రానుపోను ఖర్చులు వెంట వెళ్లేవారి పై ఖర్చులు అంతే! మద్రాస్ లయన్స్ క్లబ్ వాళ్ళు యీ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని."
"అలాగయినా ఒక వేయన్నా కావాలి. మనవద్ద ఎక్కడుంది. ప్రతాప్"
"నా వద్ద వుంది అత్తయ్యా!"
"ఇప్పటికే నీకు చాలా ఋణపడివున్నాం---"
"మామయ్యా! మనమధ్య ఇంకెప్పుడూ ఆ ప్రశక్తి తిసుకరాకండి నాన్నగారు పోయినపుడు మీరే నన్ను దగ్గరికి తీయకపోయి వుండినట్లయితే నా బతుకెంత హీనంగా వుండేదో నాకు తెలుసు.
పైగా ఇప్పుడు నేను మీ కుటుంబంలో వాడిని.
నన్ను ఋణమైనా తిర్చుకోనివ్వండి. లేదా ఇంట్లో వ్యక్తిగా నా బాధ్యత నిర్వర్తించనీయండి.
ఇక అడ్డు చెప్పలేకపోయారు వాళ్ళు.
మరో రెండు రోజుల్లో ప్రతాప్, సుందర్రావుగారు ప్రయాణమై వెళ్ళటానికి నిశ్చయమైనారు.
ఆ రోజు సాయంకాలం ఇంటి ముందు వాలు కుర్చీలో కూర్చుని భార్యతో మాటాడుతున్నారు సుందర్రావుగారు.
అక్కడ ఎంత జాగ్రతగా వుండవలసిందీ భర్తకి చెపుతుంది అన్నపూర్ణ కూతురికీ జడవేస్తూ.
తామిద్దరూ లేకుండా వెళుతున్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా వుండవలసిందీ చెపుతున్నారు సుందర్రావుగారు.
ప్రతాప్ ఇంకా అఫీసునుంచీ రాలేదు.
ఇంటి ముందు రిక్షా ఆగటం - అందులోంచి ఆ గర్భవతి దిగటం చూశారు అన్నపూర్ణ జయప్రద.
"ఎవరా?" అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఆ శబ్దం విని "ఎవరది?" అని అడిగాడు భార్యని సుందర్రావుగారు.
"ఏమో!" మెల్లిగా అందామె భర్తతో.
గేటు తీసుకుని వచ్చిన ఆ అమ్మాయి "ఏమండీ! ఇది సుందర్రావుగారిల్లే కదా!" అని అడిగింది.
"అవునమ్మా!"
"ఆయన---"
"ఆయనే నమ్మా"
ఆ అమ్మాయి వచ్చి అన్నపూర్ణ పాదాలపై వాలిపోయింది.
గాబరా పడింది అన్నపూర్ణ.
"ఏమిటమ్మా? ఏమైంది? ఎవరునువ్వు? నీవేం దిగులు పడకమ్మా, నేనున్నాను. నిన్ను అవసరమైతే కడుపులో దాచుకుంటాను" అంది అన్నపూర్ణ.
అర్ధంకాక ఏమి సమాధానం చెపుతుందో ఆ కొత్త వ్యక్తి అని ఎదురు చూడసాగారు సుందర్రావుగారు.
"మామగారూ!" అంటూ సుందర్రావుగారి పాదాలపై వాలిపోయింది ఆ కొత్త అమ్మాయి.
"ఏమిటిదమ్మా? ఎవరు నీవు. మామగారూ అంటున్నావేం నీవు మధు భార్యవా?" గాబరాగా అడిగారు.
"కాదు-కాదు-!" అంది త్వరత్వరగా.
"ఎవరమ్మా నీవు"
జవాబు చెప్పలేదు.
"చెప్పమ్మా! నీవు నా కోడలివే అయితే నీకు తగిన ఆదరణ లభిస్తుంది" అన్నారాయన.
అత్తగారూ- మామగారూ అలా అనటంతో ఆమెకి ధైర్యం వచ్చింది! వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ - కలిగిన ఆయాసాన్ని తగ్గించుకుని సేదతీరుతూ అంది.
"నా పేరు వసంత!"
మీ చిన్నబ్బాయి సుధాకర్ నేనూ ఒకే కాలేజీలో చదివాం- ఆయనతో స్నేహం చేశాను. ఆకర్షణకి లొంగిపోయాను.