నన్ను పెళ్ళి చేసుకోమన్నాను.
ఆయన ఆ స్మగ్లర్స్ తో చిక్కుపడటం-తన భవిష్యత్తు ఎలా వుంటుందో భయపడటం అన్ని చెప్పి నన్ను అన్నిమరిచి ఎవర్నైనా పెళ్ళి చేసుకోమన్నారు.
కానీ నా గర్భంలోని శిశువు...
తర్వాత పూర్తి చేయలేక పోయిందామె.
స్థానువై పోయాడు సుందర్రావు.
"అమాయకులైన అమ్మాయిల జీవితాలతో ఇష్టం వచ్చినట్లుగా ఆడుకోటానికి ఎవరిచ్చారీ హక్కు ఈ వెధవలకి. ప్రేమంటే తెలీదు. కామమేదో ప్రేమ ఏదోకూడా తెలీదు వీళ్ళకి.
యవ్వనంచేసే చిత్ర చిత్రమైన చిందులకి లొంగిపోతున్నారు. ఇలాటి యువతరం చేతుల్లో దేశం ఎలా పురోగమిస్తుందా?" అనుకున్నారాయన.
"వసంతా! నా కొడుకు తాళికట్టినా కట్టకున్నా నీవు నా కోడలివే. పూర్వం గాంధర్వ వివాహాలని వుండేవిలే! అలాగే చేశారు మీరు. నీవు ఎప్పుడోవచ్చి వుండవలసింది. చాలా ఆలశ్యం చేశావు. అయినా ఫరవాలేదు, నా కొడుకెప్పటికైనా తిరిగొస్తాడు.
వాడు ఇంటికి వచ్చేసరికి కొడుకూ, భార్య సుఖంగా వుంటే సంతోషిస్తాడు... తప్పుచేసేవాళ్ళు కదమ్మా నా కొడుకులు పరిస్థితులే వాళ్ళని చెడు మార్గాలకి లాక్కున్నాయ్.
చెడు మార్గానికి వెళ్ళినా తిరిగి మంచి మార్గానికి వస్తారు వాళ్ళు. ఆ ధైర్యం వుంది నాకు" అంది అన్నపూర్ణ.
వసంత తృప్తిగా వూపిరి పీల్చుకుంది.
* * *
ఫేక్టరీ మేనేజింగ్ పార్టనర్ పార్ధసారధిరావు పిలుస్తున్నాడంటూ వచ్చాడు ప్యూన్.
తను సర్వీసులో చేరే రోజు తప్ప ఇంతవరకూ ఆయన ముఖం చూడలేదు మళ్ళీ. ఇప్పడు ఏ కారణంతో పిలుస్తున్నాడా అనుకుంటూ వెళ్ళాడు.
స్వింగ్ డోర్ తెరుచుకుని గదిలో అడుగు పెట్టేడు మధు.
"కూర్చోండి"
ఆశ్చర్యపోయాడు మధు. ఎంతెతవాళ్ళకో ఆయన సీటు ఆఫర్ చేయడు. ఇదీ చాలా చిత్రంగా వుందే అనుకున్నాడు.
"మీరు సర్వీసులో మీ పని చాలా తృప్తికరంగా వుండేది. మీ వంటి ఎఫిషియన్సీ వున్నవాళ్ళవల్లే ఫాక్టరీ నడిచింది ఇన్నాళ్ళు,
"థాంక్స్!" అంతకు మించి అనలేక పోయాడు.
"కానీ యీ మధ్య ఫాక్టరీ నిర్వహణలో చాలా గొడవలు వచ్చాయి. కంపల్సరీగా కొంతమంది స్టాఫ్ ని తగ్గించవలసి వస్తుంది. ఇది ఉద్యోగులకి బాధాకరమే. కానీ తప్పనిసరి యాజమాన్యం తను నష్టపోదుగా" ఆయన ఆగేడు,
"కానీ నే విన్నది--"
"కంపెనీ చాలా లాభాల్లో వుందని కదూ. ప్చ్! బయటవాళ్ళ కది మేడిపండు. కానీ మా ఇక్కట్లు మాకు తెలుసు"
పలకలేదు మధు.
"మీకు యీ నెల జీతం పూర్తిగా ఇస్తామని, రేపటి నుంచి ఫ్యాక్టరీకి రావక్కర్లేదు. లాండ్ సీలింగులూ-ఆదాయపు పన్నులూ మా బాధలు ఎన్నోలెండి, మూడునెలల జీతం ఇచినట్టుగా రిసీట్ రాసివ్వండి.
"సార్!"
"చెప్పండి"
"నేనూ నాభార్య కేవలం జీతంమీదే ఆధారపడి బ్రతుకుతున్నాం మీరిప్పుడిలా అమాంతరంగా పని నుంచి తొలగిస్తే మాకు బ్రతుకు తెరువులేదు."
"అదేం? పాపయ్య గారింట్లో వుండటంలేదా?"
"ఉహూఁ"
"చూడండి, స్వంతం మీ మామగారే మిమ్మల్ని ఇంటి నుంచి తరిమేశారంటే మీలో ఏదో తప్పిదం వుండాలి. మీపై కంప్లయింట్స్ వచ్చాయి. అయినా కేర్ చెయ్యలేదు- నిజమే నన్నమాట."
"సార్! నేనలాటి వాడిని కాదు.ఆయనే---"
"చెప్పొద్దు. పాపయ్యగారిని నేను ముఫ్పై ఏళ్లనుంచి ఎరుగుదును. ఆయనవల్లే ఫేక్టరీ యీ స్థితి కొచ్చింది. మిస్టర్ మధూ! మీరు ఇక వాదించనక్కర్లేదు ప్రాధేయ పడక్కర్లేదు. మీ తమ్ముడి గుణగణాలు విన్నప్పుడే నిన్ను తొలగించవలసింది కానీ పాపయ్యగారిని చూసి ఆగేం"
"పాపయ్య! పాపయ్య!" అని కళ్ళు కొరుక్కున్నాడు మధు.
ఇక మీరు వెళ్ళొచ్చు.
సంతకం చేసి డబ్బు తీసుకుని ఫేక్టరీ గేటు దాటాడు.
అతనికి ఆ జీతంకూడా వాళ్ళ ముఖాన్నే కొట్టాలనిపించింది. కానీ ఇంటివద్ద పరిస్ధితులు అతని పౌరుషాన్ని చంపేయ్.
మెటర్నిటీ లీవ్ అప్లయ్ చేసి ఇంటివద్దవున్న మణి మధురాకకి ఆశ్చర్యపోయింది. ముఖం వేలాడేసుకుని వస్తున్న అతన్ని చూసి పరిస్థితి తెలియక గాబరా పడింది. "ఏమైందండీ?" అంటూ ప్రశ్నించింది.


