Previous Page Next Page 
మధుకీల పేజి 40

    జవాబివ్వలేదు,
    తిరిగి చూశాడతను.
    "నాన్నా! ఒక్క సంతోషం లేదు. ఒక్క సుఖం లేదు. ఒక వూరని లేదు. తినటం, ఆఫీసుకు వెళ్లటం తిరిగి రావటం అంతే! గాడిలో పడ్డ జీవితం అయింది. ఈ పర్యాయం మేం తిరుపతి వెళ్లొద్దామనుకుంటున్నాం."
    "వెళ్ళి రండమ్మా! తిరుపతి వెంకన్నని చూసయినా నేర్చుకుందురుగాని, పైసకి పైసకి జత చేసి ఆయన ఏడుకొండలు బంగారు పర్వతాలయ్యాయి. అయిదార్రోజుల్లో టూరిస్ట్ బస్ వెడుతుందట. అందులో వెళుదురుగానీ"
    "అలాకాదు. మేం ఇద్దరమే వెళ్ళాలి"
    "ఏమిటమ్మా మణీ! వూరకే డబ్బు ఖర్చు చెయ్యాలని వుందా?"
    "ఊహూఁ మేం మద్రాస్-కంచి-కాళహస్తి, ఇంకా మధుర చిదంబరం శ్రీరంగం..."
    "రామేశ్వరం వరకు వెళ్ళి దక్షిణ యాత్రలు చేసుకుని రండి. తర్వాత ఉత్తర దేశ యాత్రలు వెళ్ళండి" కోపంగా అన్నాడు పాపయ్య.
    "వెళతాం నాన్నా"
    "నా వద్ద డబ్బులేదు. వున్నా ఇవ్వను"
    "మా జీతం డబ్బులున్నాయిగా"
    "అంతా ఖర్చు చేసుకుంటే తిండికో"
    "నాన్నా"
    "అవును దాస్తే తెలుస్తుంది ఖర్చు చేయాలంటే ఎంత బాధో!"
    "నాన్నా! సిల్లీగా మాటాడకండి, మీ కంటే ఆ ఫ్యాక్టరీ, ఇల్లు తప్ప మరొకటి అవసరం లేదు, కానీ మేం ఇంకా ముసలాళ్ళం కాలేదు"
    "అయితే---"
    "మాకూ కొన్ని ఖర్చులుంటాయ్. వాటికల్లా మిమ్మల్ని అడగాలంటే ఎలాగో వుంటుంది"
    బీరువాకి తాళం వేసి తాపీగా వచ్చి కుర్చీలో కూర్చుని "మధూ" అని కేకేశాడు పాపయ్య. మణికి ఆయనేం అలోచిస్తున్నాడో బోధపడలేదు.
    మధు వచ్చాడు.
    "మీ వుద్దేశాలు నా కర్ధమయ్యాయి. నా వుద్దేశమూ వినండి. ఇలా ఎదిరించటం నాకు సరిపడదు. అసలు మిమ్మల్ని తొలినుంచీ వేరుగా వుంచవలసింది. పొరపడ్డాను. ఇదంతా నాది కేవలం నా స్వార్జితం. చాలా చిన్న స్థాయినుంచి యీ స్థితికి ఎదిగాను.
    నాకు దుబారా గిట్టదు.
    సినిమాల పేరుతో వారానికొక 'పడవని' తగలెయ్యటం నా కిష్టం లేదు.
    పేషన్ పేరుతో గుడ్డకి వేలు తగలెయ్యటమూ నే సహించలేను.
    మీ అభిప్రాయాలు వేరుగా వున్నాయ్.
    వెళ్ళండి మీ బ్రతుకులు మీరు బ్రతకండి. డబ్బు విలువ తెలుసుకోండి. నా ప్రాణాలు కాస్తా వెళ్ళిపోయాక ఇదంతా మీదే... ఆ తర్వాత మీరు నోట్లతో కాఫీ కాచుకున్న చూడటానికి నే నుండను.
    రేపే ఎక్కడన్నా ఇల్లుచూసుకుని చేరండి"
    భుజంపై టవలు వేసుకుని కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడు పాపయ్య.
    "మా నాన్నకి కోపం వచ్చింది. రానీ, ఈ బానిసబతుకు కంటే అదే మేలు"
    "ఛ! తప్పు చేస్తున్నామేమో మణీ!"
    "తప్పులేదు. ఒప్పులేదు. వెళ్ళి ఎక్కడైనా ఇల్లు చూడండి" అంది మణి.

 Previous Page Next Page