"అహఁ నా విషయమే కాదు. లోకంలో అందరి విషయమూ అడిగాను నేను."
"మీరు సంఘ సంస్కర్తలా?"
"ఏం? ఎందుకలా అడిగారు?" కంగారుగా ప్రశ్నించాడతను.
"ఏం లేదు- మీ విషయమే కాకుండా లోకం విషయం అంతా ఆలోచిస్తూ వుంటే---" అని బిందె చంక కెత్తుకుంది.
"మళ్ళీ వస్తారా?"
"మీకోసం కాకున్నా మాకింకా నీళ్ళు కావాలికదా?"
"చమత్కారులే!" అన్నాడతను.
బిందె నెత్తుకుని వెళ్ళిపోయింది జయప్రద.
మళ్ళీ తిరిగి వచ్చేవరకూ అలాగే ముఖం కడుగుతున్నాడు అతను.
అతన్ని చూసి నవ్విందామె.
"బ్రహ్మ శౌచం అన్నమాట విన్నారా?"
"ఉహుఁ అదేమిటి" కుతూహలంగా అడిగేడు.
"రావణుడు పుట్టినపుడు అశౌచానికి వెళుతున్నాడట బ్రహ్మ" మునిమనవడు పుట్టాడు అని చెప్పేరట. తిరిగి నివృత్తి చేసుకుని వస్తున్నాడు. బ్రహ్మ అప్పుడెవరో ఎదురై రావణుడు చనిపోయాడు అన్నారట. అల్పయుష్కుడు అన్నాడట ఆయన రావణుడు కొన్నివేల ఏళ్ళుపరిపాలించాడు. అంతకాలమూ బ్రహ్మ దృష్టిలో అల్పమే ఐంది. నిజానిజాల ప్రసక్తి మనకక్కర్లేకపోయినా ఏదైనా ఆలస్యంగా చేసేవాళ్ళని ఎత్తి పొడుస్తున్నట్టుగా అంటారు. అలా వుంది మీరింకా ముఖం కడుగుతూ వుండటం"
నవ్వేడతను.
"ఒకమాట చెప్పనా?"
"ఇప్పుడు చెప్పేవన్నీ అడిగే చెపుతున్నారా?"
"నేనింతసేపు ముఖం కడుగుతుండగా నుంచోటానికి కారణం మీరు. ఈ సాకుతో నయినా కొద్దిసేపు మాటాడుతూ వుండొచ్చని"
మనస్సులో అసహ్యించుకున్నా మరేమీ అన్లేదు.
"ఒక చిన్న కోరిక"
"చిన్నదయితే ఫరవాలేదు"
"హమ్మయ్య! బ్రతికించారు అసలు వీల్లేదంటారేమోనని గుండె పగిలాను"
"ఎందుకో!"
"అందమైన అమ్మాయి కనిపించటమే అరుదు. కనిపించినా మాటాడటం కష్టం. ఇక కోరిక కోరుకో అనటం జై పాతాళభైరవీ! అంటే నరుడా ఏమి నీ కోరిక అన్నట్టే"
జయప్రద పలకలేదు.
"నాతో ఓసారి సినిమాకి వస్తారా?"
ఆమె కళ్ళు ఎర్రనయ్యాయి.
"మిస్టర్ ఏమనుకుంటున్నావ్ నువ్వు. ఎదురెదురిల్ల వాళ్ళం కదాని పిలిస్తే పలుకుతున్నాను. అంత మాత్రం చేత సినిమాకి తోడుగా రమ్మంటావా? ఏమిటి నీ వుద్దేశ్యం? పెళ్ళికాని అమ్మాయి అలా ఇతర్లతో తిరగొచ్చా? తిరుగుతుందా? ఇంకెప్పుడూ ఇలా మాటాడొద్దు"
చక చకా నీళ్ళ బిందె తీసుకుని వెళ్ళిపోయింది.
కుళాయి ముందు గబగబా ముఖం కడుక్కున్నాడతను.
మనసులో "ఒకటి ప్లస్ ఒకటి రెండవుతుంది. లేదా ఒకటి ఇంటూ ఒకటికూడా ఒకటే అవుతుంది" అనుకున్నాడు.
* * *
పాపయ్య ప్రవర్తన మదుకే కాదు మణికి కూడా కొంత కష్టంగానే వుంది, బోర్డింగులో భోజనం చేసి లాడ్జింగులో పడుకున్నట్టుగా వుంది సంసారం అంతేకాని తమ ఇల్లు తమ సంసారం అన్న భావన రావటంలేదు.
నెలనెలా జీతం అంతా ఆయనకివ్వాలి- ఖర్చులకి అంతో ఇంతో అలా విసిరేస్తాడు.
"హ! హ! ఇదంతా మీదే కదమ్మాయ్? ఎంత దాచుకుంటే అంత సుఖం, వెర్రిగా ఖర్చు చేసేవాళ్ళు అవివేకులు, డబ్బు! మణీ! డబ్బు! మనిషివిలువ నిర్ణయించేది అదే!" అంటడు ఏమన్నా అంటే.
ఆరోజు ఒకటవ తారీఖు.
ఫ్యాక్టరీలో జీతాలిచ్చేడు పాపయ్యే.
మధ్యాహ్నం కాఫీలకి ఇంటికి వచ్చారు ముగ్గురూ.
వంటింట్లో కాఫీ పెడుతోంది మణీ. మధు అమెవద్దే వున్నాడు.
కేకేశాడు పాపయ్య కూతుర్ని.
"వస్తున్నా నాన్నా" అని భర్త ముఖంలోకి చూసింది ఆమె "అడిగెయ్" అన్నట్టుగా చూశాడతను.
"రామ్మ నేను బీరువా ముందు నుంచున్నాను"
గది బయట నుంచుంది మణి.
"లోపలికి రామ్మా!"
"ఎందుకు నాన్నా!"
"ఎందుకేమిటి పిచ్చితల్లీ! ఆ జీతం డబ్బులిచ్చేస్తే దాచేస్తాను కదా! అసలు అక్కడే సంతకాలు తీసుకుని డబ్బు అట్టిపెట్టుకోవచ్చు.