Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 39


    కానీ, పునర్జన్మలున్నట్టు కొన్ని దాఖలాలు ఉన్నాయి. వాటికి సైన్సు పరమైన ఆధారాలు, సకారణాలు వున్నా, లేకపోయినా పునర్జన్మల గురించి చెప్పుకుంటున్నాం..... నమ్ముకుంటున్నాం.... ఇప్పుడు అద్వైత విషయంలో కూడా ఇదే మనం నమ్మాలి.
    విరజ గుండె అభినయ్ కోసం కొట్టుకుంటోంది. అద్వైత శరీరంలో అమర్చిన ఆ గుండె అభినయ్ నే కోరుకుంటోంది. ఒక శరీరంలో, మరో గుండె కలిసి, ఓ మనిషి ప్రేమ కోసం తపిస్తోంది.... నా అంచనా నిజమైతే.... అద్వైత అభినయ్ ని గుర్తిస్తుంది..... ఇదో అద్బుతం' చెప్పాడు వివరంగా ప్రొఫెసర్ రాబిన్ మార్క్.
    అతని మాట, అతని విశ్లేషణ.... అతని వూహ ఆ క్షణం నిజమై....ప్రపంచంలోనే సరికొత్త ప్రేమకు విరజ గుండె.... ఓ అద్బుతమైన నిలుస్తుందని ఆ క్షణం ఈ ప్రపంచమే వూహించలేదు.
    సైన్స్ కు అందని, వూహకు అంతుపట్టని..... ప్రపంచం నివ్వెరపోయే.... విధాత సృష్టించని సరికొత్త ప్రాణి.... వి....రజ.... గుం....డె...
    
                                                                    * * *
    
    కాదంబరి క్యారీజీలో అన్నీ సర్దింది.
    గంటసేపట్నుంచీ బామ్మ కాదంబరిని గమనిస్తూనే ఉంది. రకరకాల వంటలు చేసింది. అన్నీ క్యారేజీలో సర్దుతూ ఉంది.
    'ఎక్కడికి వెళ్తున్నావు కాదంబరీ' అడిగింది బామ్మ.
    'అభినయ్ గారింటికి' చెప్పింది కాదంబరి.
    బామ్మ ఒక్క క్షణం మౌనంగా ఉండి, ఆ తర్వాత 'కాదంబరీ నీతో ఒక మాట చెప్పనా?' అంది.
    'చెప్పు బామ్మా' అంది కాదంబరి.
    'నువ్విలా అర్ధరాత్రి, ఆపరాత్రీ అభినయ్ అంటూ వెళ్తే ఏం బావుంటుంది చెప్పు..... ఆ అమ్మాయి చనిపోయినప్పుడు వెళ్ళావు. కొన్ని రోజులు ఆ ఇంట్లో వున్నావు. నువ్వు కేవలం అతని ఆఫీసులో ఉద్యోగివి. నీకూ,

అభినయ్ కు మధ్య వున్న సంబంధం ఏమిటి?'
    చురుగ్గా చూసింది బామ్మ వంక కాదంబరి.
    'ఈ మాట రేపు చుట్టుపక్కల వాళ్ళు అంటారమ్మా..... నువ్వు పెళ్ళి కావలసిన దానివి...'    
    'బామ్మా.... నీ భయం నాకు అర్ధమైంది. ఎవరో మనల్ని మాటలతో భయపెడతారని, మనమెందుకు భయపడాలి. విరజగారు దూరమై అభినయ్ గారు కుమిలిపోతున్నారు. వేళకు అన్నం తినడంలేదు. తన మీద తనకే మాత్రం ధ్యాస లేదు. మనిషి చిక్కి శల్యమయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో మనం ఆయన్ని వదిలేస్తామా?'
    'అలా అని మనల్ని ఈ సమాజం ప్రశ్నించే పరిస్థితికి రాకూడదు కదమ్మా...'
    'బామ్మా, ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆలోచించకూడదు. ఒకప్పుడు మనకు ఆశ్రయమిచ్చి, ఉద్యోగమిచ్చి ఆదుకున్నారు. విరజ మేడమ్ నన్ను తోబట్టువులా చూసుకుంది. ఆ ఋణం తీర్చుకోవడం నా బాధ్యత. ఈ ప్రయత్నంలో నాకే ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఫర్వాలేదు' స్థిరంగా చెప్పింది కాదంబరి.
    'పోనీ ఓ పని చేయరాదంటే కాదంబరీ....'
    'ఏంటి బామ్మా?'
    'ఇప్పుడా బాబుకు ఎవరూ లేరు. ఆ దేవుడు విరజను దూరం చేశాడు. ఈ పరిస్థితిలో నువ్వెందుకు ఆ అబ్బాయికి దగ్గరవ్వకూడదూ...?'
    కాదంబరి బామ్మ మొహంలోకి చూసింది.
    'నేనేం తప్పుగా మాట్లాడ్డంలేదు. అతను జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతాడా? కాలంతోపాటు మనిషీ మారాలి... అతని గాయమూ మానుతుంది. ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకోక తప్పదు. ఆ ఎవరో ఒకరు నువ్వే ఎందుక్కాకూడదూ?'
    'అభినయ్ విరజ గారిని తప్ప మరెవర్నీ చేసుకోరు'
    'అది ఆ అమ్మాయి బ్రతికున్నప్పటి మాట....'
    కాదంబరి మాట్లాడలేదు. కానీ ఏ మూలో బితుకుబితుకుమంటోన్న ఆమె మనసులోని కోరిక ఆమె పెదాల మీదికి వచ్చి చిర్నవ్వుగా మారింది.
    
                                 * * *    
    
    అభినయ్ దగ్గరికి వచ్చింది కాదంబరి.
    పనివాళ్ళందరినీ పంపించేశాడు.
    ఇల్లంతా చీకటిగా ఉంది.
    విరజ లేని ఆ ఇల్లు బావురుమంటోంది.
    తన బెడ్ రూమ్ లో కార్పెట్ మీద కూచొని, ఎదురుగా గోడకు తగిలించి వున్న ఒక గుండె సవ్వడి బొమ్మ వంక చూస్తున్నాడు అభినయ్.
    ఆ చీకట్లో గుండె సవ్వడి బొమ్మ రంగుల వెలుతురు తప్ప, మరేమీ కనిపించటంలేదు. కాదంబరి ఆ గదిలోకి అడుగుపెట్టి చీకట్లో కూచొని వున్న అభినయ్ ని, ఒక గుండె సవ్వడి బొమ్మని మార్చిమార్చి చూసింది కాదంబరి.
    ఆ బొమ్మ గురించి క్రితంరోజే చెప్పాడు అభినయ్. స్విచ్ వేసింది కాదంబరి. లైటు వెలుతురు ఆ గదిని పరచుకుంది.
    ఆ వెలుతురు భరించలేనట్టు కళ్ళు మూసుకున్నాడు. 'కాదంబరీ లైటాఫ్ చెయ్. ఆ వెలుతురు భరించలేను. ఈ చీకట్లో మెరిసే నా విరజ గుండె సవ్వడి తప్ప, మరిదేన్నీ చూడ్డం నాకిష్టం లేదు...' అన్నాడు అభినయ్.
    'ఈ గదిలోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ మూల చూసినా మేడమే ఉంటారు. మీరు ఇలా ఎప్పడూ ఏదో కోల్పోయినట్టు ఉంటే, మేడమ్ ఆత్మ క్షోభిస్తుంది తెలుసా' బాధ నిండిన స్వరంతో అంది కాదంబరి.
    'కాదంబరీ.... ఏమిటి నువ్వంటున్నది?'
    'అవున్సార్.... మీరెప్పుడూ నవ్వుతూ వుండాలి.... మీరు స్టేట్స్ కు వెళ్ళేక ఓ రోజు మేడమ్ నాతో ఏమన్నారో తెలుసా సార్.... నా అభి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. లేకపోతే నేను భరించలేను' అన్నారు.... మేడమ్ ఆత్మ హేపీగా వుండాలంటే మీరు హేపీగా ఉండాలి'
    'నా విరజ ఆత్మ నిజంగా బాధపడుతుందా కాదంబరీ.... నో.... నో.... నా విరజ బాధ పడకూడదు' అన్నాడు అభినయ్.
    'దట్స్ గుడ్ సార్.... మేడమ్ ని మరిచిపొమ్మని నేనుగా కానీ, మేడమ్ కోసం మీరు ఎప్పుడూ హేపీగా ఉండాలి. మేడమ్ కు మనం అర్పించే ఘనమైన నివాళి అది...'
    అభినయ్ మాట్లాడలేదు. కానీ, విరజ కోసం తను బావుండాలి.... అనుకున్నాడు.
    కాదంబరి క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేటులో అన్నం వడ్డించింది.
    మొదటి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూంటే అతనికి విరజే గుర్తొచ్చింది.
    'ఏయ్... అభీ! మొదటి ముద్దయినా, ముద్దు అయినా నాకే...' అంటోన్న విరజే అతని కళ్ళ ముందు కదిలింది. అతని చేతిలోని అన్నం ముద్ద పళ్ళెంలోకి జారిపడింది.
    గొంతు నిండా విరజ మీద ప్రేమ వుంటే, ఆ గొంతులోకి అన్నం  ముద్ద ఎలా దిగుతుంది?
    
                                * * *
    
    కాన్వాసు కు అభిముఖంగా నిలబడి ఉంది అద్వైత.
    ఆమె కళ్ళు మూసుకొని ఉంది. చేతిలో బ్రష్ ఉంది. ఎదురుగా కాన్వాసు. పక్కనే కావలసిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి. కానీ తను బొమ్మ వేయగలదా? ఆమె మెదడు ఆలోచిస్తోంది.
    తను అభినయ్ బొమ్మే వేయాలి. అద్వైతలోని విరజ గుండె గాఢంగా వాంఛిస్తోంది.
    గుండెకూ, మెదడుకూ మధ్య అనుసంధానం కుదిరింది.
    ఆమె చేతిలోని బ్రష్ కదులుతోంది.... 'అభీ.... ఐ లవ్ యు.... నువ్వు లేకుండా నేను లేను. నా గుండె నిండా నువ్వె ఉన్నావు. కావాలంటే నా గుండెలో వున్న నిన్ను చిత్రిస్తాను చూడు'
    బ్రష్ వేగంగా కదులుతోంది. కళ్ళు తెరవకుండానే, ఆమె చేతిలోని బ్రష్ కాన్వాసు మీద కదులుతోంది.
    ఆ దృశ్యాన్ని డాక్టర్ సిద్దార్ధ, రాబిన్ మార్క్, మహాపతి అబ్బురంగా చూస్తున్నారు.
    ఒకట్రెండు, మూడ్నాలుగు, అయిదారు.... క్షణాలు.... నిమిషాలు గడుస్తున్నాయి.
    కాన్వాసు మీద బొమ్మ.... అభినయ్ బొమ్మ....
    'ఈ బొమ్మ ఎవరిది బేబీ?' డాక్టర్ సిద్దార్ధ అడిగాడు.

 Previous Page Next Page