Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 38


    మహాపతి ఆశ్చర్యంగా చూశాడు.
    కొద్దిపాటి కారం నాలికకు తగిలితేనే 'కారం కారం' అంటుంది. అలాంటిది.....
    'అలా టాంక్ బండ్ వరకూ వెళ్ళొద్దామా డాడీ....' ప్రొఫెసర్ రాబిన్ మార్క్ వంక చూశాడు డాక్టర్ సిద్దార్ధ.
    రాబిన్ మార్క్ అద్వైత ఏం మాట్లాడుతోందని అడిగాడు. డాక్టర్ సిద్దార్ధ ఇంగ్లీషులో అద్వైత ఏమన్నదో చెప్పాడు.
    'అలాగా.... మనమూ వెళ్దాం పదండి' అన్నాడు రాబిన్ మార్క్.
    మహాపతి, సిద్దార్ధ, రాబిన్ మార్క్, అద్వైత బయల్దేరారు.
    టాంక్ బండ్ దగ్గర కారాపాడు మహాపతి. బాగా కారంగా వుండే మిరపకాయ బజ్జీలు తెప్పించమని చెప్పాడు రాబిన్ మార్క్.
    మహాపతి అలాగే తెప్పించాడు.
    అద్వైత వాటిని గబగబా తినేసింది. బిత్తరపోయాడు మహాపతి.
    'చాలా బావున్నాయి.... మరో రెండు...' అంది అద్వైత.
    మహాపతి మిరపకాయ బజ్జీలు మరికొన్ని తీసుకురావడానికి వెళ్ళబోయేడు.
    'నేను తీసుకువస్తాను నాన్నా....' అంటూ అద్వైత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయల్దేరింది.
    మహాపతి ఏదో అనబోయేలోగా రాబిన్ మార్క్ వారించాడు. ఆమె వెనకే ముగ్గురూ ఫాలో అయ్యారు.
    
                                  * * *
    
    చలి నగరాన్ని చుట్టుముట్టేస్తోన్నా, అభినయ్ మాత్రం వణికిపోవడం లేదు.
    టాంక్ బండ్  చివర నడుస్తూ ఉన్నాడు.
    అతనికి తొలిసారిగా విరజ, తను కలుసుకున్న రోజు గుర్తొచ్చింది. ఆ తర్వాత తనూ, విరజా ఎన్నిసార్లు ఇక్కడికి కలిసి వచ్చారు. ముఖ్యంగా చలికాలపు సాయంకాలాలు తనెప్పుడూ విరజను మిస్సవ్వలేదు. కారు ఎక్కడో దూరంగా పార్క్ చేసి, తన పక్కనే నడుస్తూ, తన చేతిని పట్టుకుని తలను తన భుజం మీద ఆన్చి.... నడుస్తూ....
    అతని ఎదురుగా మిరపకాయ బజ్జీలు అమ్మే బండి కనిపించింది. విరజ బతికి వుంటే అక్కడికి పరుగెత్తుకెళ్ళి మిరపకాయ బజ్జీలు తీసుకునేది. అతని అడుగులు అటువైపు పడ్డాయి. వెంటనే అతని మనసు అతడ్ని వారించింది. 'నువ్వు అక్కడికి వెళితే విరజ జ్ఞాపకాలు మరింత గుర్తొస్తాయి' అంటూ.
    వెనుదిరిగాడు అభినయ్. సరిగ్గా అప్పుడే మిరపకాయ బజ్జీలు తీసుకొని, వెనక్కి తిరిగి వస్తోంది అద్వైత.
    అభినయ్ కారు ఎక్కుతున్నాడు. అతడ్ని ఒక్క క్షణం అలానే చూసింది కన్నార్పకుండా. వెంటనే 'అభీ' అని పిలిచింది. కానీ, అప్పటికే అభినయ్ కారు స్టార్ట్ చేశాడు. కారు ముందుకు కదిలింది.
    'అభీ....' అంటూ ముందుకు పరుగెత్తింది అద్వైత. మహాపతి, సిద్దార్ధ, రాబిన్ మార్క్ లు బలవంతంగా ఆపారు.
    'అభీ వెళ్ళిపోతున్నాడు డాడీ....' అంది అద్వైత గింజుకుంటూ.
    'అభీ ఎవరమ్మా?' అడిగాడు డాక్టర్ సిద్దార్ధ.
    'అభీ.... ఎవరంటారేంటి... అభీ....' అని ఒక్కక్షణం ఆగి, తనలో తనే అనుకుంది. అభి ఎవరు?
    
                                  * * *
    
    మంచమ్మీద పడుకుంది అద్వైత.
    ఆమెను ట్రాన్స్ లోకి తీసుకువెళ్తున్నాడు ప్రొఫెసర్ రాబిన్ మార్క్.
    'బేబీ.... నువ్వు.... నువ్వెవరు?'
    'నేను..... నేను అధ్వైతను'
    'అభి..... ఎవరు?'
    'అభీ నా ప్రాణం...'
    'అతనెవరో నీకు తెలుసా?'
    'తెలుసు'
    'అతనెవరు?'
    'చెప్పానుగా నా ప్రాణమని'
    'అతనెక్కడుంటాడు?'
    '... ...'
    'స్పీకవుట్ బేబీ.... అతనెక్కడుంటాడు'
    '... ...'
    'నా గుం...డె....లోనే... వు....న్నా.....డు'
    ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఉలిక్కిపడ్డాడు. అతనిలో చిన్న అనుమానం.... క్రమక్రమంగా పెరిగి పెద్దదవసాగింది. ఇంకా అద్వైతను ట్రాన్స్ లోనే ఉంచడం ఆమె ఆరోగ్యరీత్యా మంచిది కాదనుకున్నాడు రాబిన్ మార్క్.
    
                                * * *
    
    ఆ గదిలో మహాపతి, డాక్టర్ సిద్దార్ధ, ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఉన్నారు.
    'ప్రొఫెసర్.... మీరేమంటారు?' డాక్టర్ సిద్దార్ధ అడిగాడు.
    'టుబి ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇదో మిరాకిల్.... నాకు ఇప్పటికీ అర్ధం కావడంలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్. ఆమెకు మార్చిన గుండెలోని భావాలు ఆమె మెదడును చేరుతున్నాయి.
    ఓ ప్రొఫెసర్ గా నేను చెబితే, మీరే కాదు, కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా నవ్వొచ్చు. నాన్ సెన్స్ గా కనిపించనూ వచ్చు. మనకు నాన్ సెన్స్ గా కనిపించే చాలా విషయాలు కాలక్రమంలో సైన్స్ లో కనిపించి, సెన్షేషన్ సృష్టిస్తాయి. ఓ మనిషి రక్తాన్ని, మరో మనిషికి డొనేట్ చేయడం చాలా సంవత్సరాల క్రితం మనం వూహించామా? లేదు అతనిది ఏ గ్రూప్ రక్తమో, పాజిటివో, నెగెటివో తెలుసుకుని, అదే గ్రూప్ రక్తాన్ని మరో మనిషికి ఎక్కించి, మనిషికి ప్రాణదానం చేసే స్థాయికి సైన్స్ ఎదిగింది.
    అలానే కిడ్నీ మార్పిడి..... కృత్రిమ అవయవాల మార్పిడి.... చివరికి క్లోనింగ్ వచ్చేక, మనిషిని పోలిన మనిషే అవతరిస్తున్నాడు. ఇవన్నీ ఒకప్పుడు చాలా మందికి నాన్ సెన్స్ గా అనిపించవచ్చు'
    'కానీ ప్రొఫెసర్.... వాటికీ, అద్వైత కేసుకీ ఏమిటీ సంబంధం?' డాక్టర్ సిద్దార్ధ అడిగాడు.
    'అదే చెబుతున్నాను మిస్టర్ సిద్దార్ధా.... మనిషి చేసే ప్రతీ ప్రక్రియ మెదడు ద్వారానే జరుగుతుంది. మెదడు ఆదేశిస్తుంది. ఆలోచనల్నిస్తుంది..... నిప్పును మనం తాకకముందే.... అది కాలుతుందని మనకు తెలియచేస్తుంది.
    ఇది సృష్టి వైచిత్రి.... ఆ భగవంతుడే మెదడును సృష్టించాడు. మనిషిని శాసించేది, విచక్షణను చెప్పేది మెదడే.
    ఆ మెదడుని ఉపయోగించకపోతే వేరే విషయం. ఇక్కడ మనసు.... గుండె....అనే పదాల్లో... మనసు అనే అవయవం ఏదీ లేదు. గుండె మాత్రమే ఉంది. ఆ గుండెలో ధమనులు.... రక్తాన్ని పంప్ చేసే సిరలూ... అన్నీ ఉన్నాయి.
    యాభై సంవత్సరాల జీవితకాలంలో రెండువందల కోట్ల సార్లు కొట్టుకుని, పన్నెండు వేల కొట్ల మిల్లీలీటర్ల రక్తాన్ని శరీరానికి నిరంతరం, నిర్విరామంగా సరఫరా చేసే గుండె మాత్రమే ఉంది. ఆ గుండెనే మనం మననంటాం!
    మనం ఆపరేషన్ చేసి, ఓ అమ్మాయి మనసనే గుండెను అద్వైతకు అమర్చాం. ఆ అమ్మాయి గుండె లేదా మనసు నిండా ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ గుండె అతని కోసమే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఆ గుండెలో అతని మీద ప్రేమ మరణించలేదు. ఇది చాలా అరుదైన విషయం.
    'నీ గుండె నిండా నేనున్నాను. నా గుండెల నిండా నువ్వే వున్నావు. నీ కోసం నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది....' అన్న మాట ఇప్పుడు నిజమవుతోంది. విరజ గుండెల నిండా అభినయ్ అనే వ్యక్తి ఉన్నాడు. అందుకే ఆ గుండె అతని కోసం కొట్టుకుంటూ ఉంది.
    అద్వైత శరీరంలో ఉన్న విరజ గుండె అభినయ్ కోసం తపిస్తోంది. ఆ గుండెలోని బలమైన కోరిక, ఆమె మెదడును చేరింది. ఆ మెదడు ఆమె మనసులోకి చొచ్చుకువెళ్ళి అభినయ్ ని ప్రేమించమని చెబుతోంది.
    ఇది మెడికల్ హిస్టరీలో ఇంతవరకూ లేకపోవచ్చు. ఏ లాజిక్కుకూ అందకపోవచ్చు. పునర్జన్మే నిజమని మనం కచ్చితంగా నమ్ముతున్నాం. మనిషి మరణానంతరం, శరీరం అంత్యక్రియల ద్వారా కాలిబూడిదై గాలిలో కలిసిపోతుంది. మరో దేహంలోకి ప్రవేశించడమో.... ఆ వ్యక్తి మరో వ్యక్తిగా పుట్టడమో జరుగుతుందని చెబుతున్నారు.
    మనిషి మరణించేక, మనిషి గుండె, కిడ్నీ, మెదడు, ఇతర అవయవాలు అన్నీ కాలి బూడిదయ్యేక, మరో జన్మగా పుట్టడం ఎంత వరకు సైన్స్ ప్రకారం కరెక్టో ఎవరు చెప్పగలరు?

 Previous Page Next Page