'నా అభినయ్ ది' చెప్పింది కళ్ళు మూసుకొని అద్వైత.
'నువ్వతన్ని చూసేనా?'
'చూశావా ఏంటి... అతను నా గుండెలోనే కదా ఉంది'
'అతనెక్కడుంటాడు?'
రెండు చేతులతో కణతలు నొక్కుకుంటూ అంది 'అదే తెలియడంలేదు'
డాక్టర్ సిద్దార్ధ ఇంకా ఏదో అనబోయేడు. ప్రొఫెసర్ రాబిన్ మార్క్ వారించడంతో ఆగిపోయేడు.
'బేబీ.... ప్లీజ్ టేక్ రెస్ట్' అన్నాడు రాబిన్ మార్క్ అద్వైతను.
అద్వైత మంచం మీద పడుకుంది. ఆమె గుండెలో ఏదో తెలియని అలజడి.....
* * *
"ఏమిటది ప్రొఫెసర్..... హౌ ఈజిట్ పాజిబుల్?' ఆశ్చర్యంతో అడిగాడు డాక్టర్ సిద్దార్ధ.
'ఈ సృష్టిలో గొప్పదనం ఇదే మిస్టర్ సిద్దార్దా.... నేను ఇంతక్రితమే చెప్పాను. అద్వైత శరీరంలో వున్నది విరజ గుండె..... ఆమె గుండె నిండా అభినయ్ ఉన్నాడు.....ఆమె మెదడును ఆ గుండె సవ్వడి డిస్ట్రబ్ చేస్తుంది. ఇలా నేను మాట్లాడ్డం మీకు నవ్వు పుట్టించొచ్చు. ఇది నా వూహ మాత్రమే....'
'కానీ, సైన్స్ దీన్ని ఒప్పుకోదు'
'అవును.... ఓ ప్రొఫెసర్ గా నేనూ ఒప్పుకోను. మీకో విషయం తెలుసనుకుంటాను. కొంతమంది డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు దేవుణ్ణి ప్రార్ధిస్తారు'
'అది వాళ్ళ నమ్మకం'
'అఫ్ కోర్స్.... పునర్జన్మని మీరు నమ్ముతారా?'
'నమ్మినా, నమ్మకపోయినా, పునర్జన్మ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. పునర్జన్మ వుందన్న దాఖలాలు కొందరు చూపించారు'
ఓ డాక్టర్ గా చెప్పండి. మనిషి మరణించాక, అతన్ని దహనం చేస్తారు. అంటే అతని శరీరం.... శరీరంలోని కిడ్నీలు, కాలేయం, మెదడు, ఫేషియల్స్, రక్తనాళాలు.... అన్నీ.... చితి మీద కాలి బూడిదై పోతాయి....'
'యస్.... అయితే....'
'శరీరం మొత్తం బూడిద అయ్యేక, ఎక్కడో.... ఎప్పుడో.... ఎవరి కడుపులోనో.....ఆ వ్యక్తి పుట్టడమేమిటి.... నేను గత జన్మలో ఫలానా అని చెప్పడమేమిటి.... ఇది కొందరికి నాన్ సెన్స్ గా, మరి కొందరికి పునర్జన్మగా, ఇంకొందరికి కర్మఫలంగా అనిపిస్తోంది వారి వారి ఆలోచనా ధోరణులనుబట్టి'
'అవును... కానీ.... దానికీ....'
'అక్కడికే వస్తున్నాను డాక్టర్.... ఓ శరీరం తన ఉనికిని మొత్తం కోల్పోయి, బూడిదగా మారేక కూడా మరో జన్మ ఆ ప్రాణికి ఉందని మనం.... లేదా మనలో కొందరు నమ్మినప్పుడు..... ఓ వ్యక్తి గుండె.... దాని తాలూకు ఉనికి మన కళ్ళ ముందే కనిపించి, మరో వ్యక్తి శరీరంలో జీవించి ఉన్నప్పుడు.... ఆ గుండె తన మనిషి కోసం కొట్టుకుంటే.... కొట్టుకుంటుందని మనం ఒప్పుకుంటే తప్పేమిటి?'
డాక్టర్ సిద్దార్ధ తల విదిలించాడు.
'చూడండి డాక్టర్.... ఈ భారతదేశం అంటే నాకు చెప్పలేనంత గౌరవం, ఇష్టం, భక్తీ, ప్రేమ, అభిమానం..... ఎన్నో అద్భుతాలకు, సెంటిమెంట్లకు, ప్రేమ తత్వానికి నెలవైన దేశం ఇది.
ప్రపంచంలో ఏ దేశంలోలేని దేవుళ్ళు మీ దేశంలో కనిపిస్తారు. ఎన్నో పురాణాలు, కథలు, శౌర్య పరాక్రమ కథలు, ఇక్కడే ఈ గడ్డ మీదే కనిపిస్తాయి.
మీ దేశంలో రుషులు తపస్సు చేసి, దేవుడ్ని ప్రత్యక్షం చేసుకున్నారన్న కథలు విన్నాను. దేవుడే కరుణించి, వరాలు అనుగ్రహించిన ఘట్టాలు చదివాను. ఈ పవిత్రభూమిలో ఓ ప్రేమికురాలి ప్రేమకు ఇలాంటి అతీతమైన శక్తి ఉందని ఎందుకనుకోకూడదు..... అన్నింటికీ లాజిక్కులూ, రీజనింగులూ వెతకాలా? ఆలోచించండి...'
ఓ వ్యక్తి తీక్షణంగా చూస్తే ఎదురుగా వున్నది భస్మమై పోతుందని... దీన్ని ఆర్యతుంగ విద్య అంటారని ఎక్కడో చదివాను. కానీ సైన్సుపరంగా ఆలోచిస్తే భూతద్దం పెట్టి, ఎండుగడ్డిని సూర్యకిరణాల ద్వారా కాల్చవచ్చు. సైన్స్ లేదా సూడో సైన్స్, ఇవన్నీమనం వెతుకుతూ పోతే ఎలా?'
డాక్టర్ సిద్దార్ధ కాసేపు లాజిక్కులు, రీజనింగులు పక్కన పెట్టేడు. అతనాలోచిస్తూంది లాజిక్ కు అందని ఆ విషయం గురించి కాదు.
తన బిడ్డ బావుంటే చాలు....అంతకన్నా ఆ కన్నతండ్రి ఇంకేమీ కోరుకోవడం లేదు.
* * *
కారు స్పీడుగా వెళ్తోంది.
అభినయ్ కు చాలా టెన్షన్ గా ఉంది. అతని పక్కనే కాదంబరి ఉంది.
'డ్రైవర్ స్పీడ్ గా పోనీ' చెప్పాడు అభినయ్.
సరిగ్గా ఐదు నిమిషాల క్రితమే, హాస్పిటల్ లో విరజ చివరిసారిగా మాట్లాడిన ఆడియో కేసెట్ విన్నాడు అభినయ్.
విరజ చనిపోయిన బాధలో కేసెట్ గురించే మరిచిపోయేడు. కాదంబరి ఆ గదిని నీట్ గా సర్దుతుండగా ఆ ఆడియో కేసెట్ కనిపించింది. ప్లే చేసి చూస్తే విరజ మాటలు వినిపించాయి.
విరజ మాటలు వింటున్నంతసేపూ, అభినయ్ గుండెవేగం రెట్టింపయింది. విరజే తన ఎదురుగా కూచొని మాట్లాడుతున్నట్టు అనిపించింది. తన కోసం విరజ ఎంతగా తపించిందో మరోసారి అర్ధమై, అతని మనసు ఆర్ద్రమైంది. తనకోసం, తన గుండెలో వున్న ప్రేమను కలకాలం నిలుపుకోవడం కోసం, మరెవరికో విరజ తన గుండెను దానం చేసిందని తెలిసి.... తల్లడిల్లిపోయేడు.
తన విరజ గుండెను ఎవరికి అమర్చాలో తెలుసుకోవాలన్న తపన మొదలైంది. తన విరజ గుండెను ధరించిన ఆ వ్యక్తిని తను చూడాలి.
ఆ ఆలోచన రావడంతోనే హాస్పిటల్ కు బయల్దేరాడు. కారు స్టార్ హాస్పిటల్ ముందాగింది.
సరసారి సూపర్నెంట్ దగ్గరికి వెళ్ళాడు.
* * *
'సారీ మిస్టర్ అభినయ్.... ఈ కేసును డీల్ చేసింది డాక్టర్ సిద్దార్ధ. అతను మూడు నెలలు లాంగ్ లీవ్ మీద వెళ్ళారు' సూపర్నెంట్ చెప్పడంతో, షాకయ్యాడు అభినయ్.
'పోనీ, మీ రికార్డ్స్ లో...'
'మా రికార్డ్స్ లో దీనికి సంబంధించిన వివరాల్లేవు. ఈ విషయంలో మేము వివరణ కోరడానికి డాక్టర్ సిద్దార్ధ కూడా అందుబాటులో లేరు. అయాం వెరీసారీ మిస్టర్ అభినయ్.... డాక్టర్ సిద్దార్ధ వచ్చేక మీకు ఇన్ ఫాం చేస్తాం....' చెప్పాడు సూపర్నెంట్.
'సిద్దార్ధగారి అడ్రస్ ఇవ్వగలరా?'
సూపర్నెంట్ సిద్దార్ధ రెసిడెన్స్ అడ్రస్ అయిష్టంగానే ఇచ్చాడు.
అభినయ్, కాదంబరి బయటకు నడిచారు.
'సారీ మిస్టర్ అభినయ్.... మా ఎథిక్స్ ని కూడా కాలదన్నడానికి ఓ బలమైన కారణం ఉంది. పేషంట్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, చిన్న అబద్దం ఆడవలసి వచ్చింది' అనుకున్నాడు మనసులోనే ఆ సూపర్నెంట్.
* * *
అభినయ్ డాక్టర్ సిద్దార్ధ ఇంటికి వెళ్ళాడు.
వాచ్ మేన్ డాక్టర్ సిద్దార్ధ ఢిల్లీ వెళ్ళారని చెప్పాడు. ఢిల్లీలో కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కోసం ట్రై చేసినా దొరకలేదు.
డాక్టర్ సిద్దార్ధ ఇంట్లో నుంచి అభినయ్, కాదంబరి బయటకు కారులో వెళ్ళిపోతుండగా, డాక్టర్ సిద్దార్ధ కారు ఎదురొచ్చింది.
డాక్టర్ సిద్దార్ధ కారు రివర్స్ చేసుకున్నాడు. అభినయ్ కారు ముందుకు కదిలింది.
ఆ కారులో వున్న వ్యక్తి డాక్టర్ సిద్దార్ధ అని అభినయ్ కు తెలియపోవడం వల్ల ఆ విధంగా డాక్టర్ సిద్దార్ధను మిస్సయ్యాడు అభినయ్.
* * *
తన కోసం అభినయ్ వచ్చి వెళ్ళాడని, ఇందాక కారులో తన కారుకు ఎదురొచ్చింది అభినయే అని తెలిసింది సిద్దార్ధకు. ఒక్క క్షణం గిల్టీగా ఫీలయ్యేడు డాక్టర్ సిద్దార్ధ.
* * *
'ఇప్పుడెలా కాదంబరీ?' ఎగ్జయిట్ అయిపోతూ అడిగాడు అభినయ్.
'డోంట్ వర్రీ సార్.... మూడు నెలల్లో డాక్టర్ సిద్దార్ధ వచ్చేస్తారుగా. ఈలోగా ఆ హాస్పిటల్ లో వున్న మిగతా డాక్టర్ల ద్వారా డాక్టర్ సిద్దార్ధ ఢిల్లీ నెంబర్ కోసం ట్రై చేస్తాను'