చివరికి అరుణోదయ అలసిపోయినట్టుగా చాపమీద కూలబడింది ఒగర్చుతూ.
"హాయ్ అరుణక్కా! ఎలా వుంది మన దెబ్బ? అంకుల్ నమ్మేశాడు నా మాటలను. నమ్మారు కదూ అంకుల్?"
"ఊఁ!"
"ఉత్తినే చెప్పాను అరుణక్క అలా ఏం అనలేదు. నాకే అరుణక్క నీ భార్య అయితే బాగుంటుందనిపించి అలా చెప్పాను. చెప్పండి అంకుల్! అరుణక్క మీకు బాగాలేదా?"
"బాగుంది."
"మరింకేం పెళ్ళి చేసుకోండి."
"ఈ వెన్నెలా, ఈ పూలూ, ఆ ఆకాశం, చంద్రుడూ, చంద్రుడితో దోబూచులాడే మేఘాలు- అన్నీ బాగున్నాయి. అన్నిటినీ పెళ్ళాడేసెయ్య మంటావా?"
"వెన్నెలా, చంద్రుడూ, అరుణక్కా ఒక్కటేనా? తేడా లేదూ?"
"ఉహుఁ! నాకు వున్నట్టుగా అనిపించడంలేదు."
"మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు వట్టి బుద్దులా వున్నట్టున్నాడు. చెట్టంత మనిషిని పుట్టించి రవ్వంత మనసును పెట్టలేకపోయాడు ప్చ్!"
"బాబుగారూ! మీకు ఫోన్ హాస్పిటల్ నుండి" నౌఖరు వచ్చి చెప్పాడు.
"బుద్దూ బ్రహ్మకాదు. నువ్వు వట్టి బుద్దూవి" నవ్వుతూ జయంతి తలమీద ఒక మొట్టికాయ మొట్టి క్రిందికి వెళ్ళిపోయాడు అరవింద్.
"ఏయ్ పిల్లా! ఎందుకలా అబద్దాలు చెప్పావు?"
"రాతిలాంటి మనిషిలో చలనం తెప్పిద్దామని. శ్రీరాముడికి ఉడుత సాయంలా నీ పెళ్ళికి నా సాయం యిది."
అప్పుడు వెళ్ళినవాడు రాత్రి పదకొండుగంటలకు తిరిగివచ్చాడు అరవింద్.
అరుణోదయ తలుపు తెరిచింది.
"అమ్మ పడుకొందా?"
"పడుకొన్నారు. అన్నం నేను పెడతాను మీరు పడుకోండి అని నేనే చెప్పాను. లేటయిందేం? ఏదయినా సీరియస్ కేసు వచ్చిందా?"
"ఆఁ కాన్పు కేసు! బిడ్డ తల కొద్దిగా బయటికి వచ్చి నొప్పులు ఆగిపోయాయి. 'ఆపరేషన్ చెయ్యాలి- అయిదువేలు తెచ్చివ్వండి' అని చెప్పాడట వందన నర్సింగ్ హోం డాక్టరు. పాపం కూలి నాలి చేసుకొనేవాళ్ళు అంత డబ్బు ఎక్కడినుండి తేవాలనేసి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఆపరేషన్ అవసరం లేకుండానే నార్మల్ డెలివరీ చేశాను. తల్లిని, బిడ్డనీ క్షేమంగా బెడ్ మీద పడుకోబెట్టి వచ్చేసరికి ఈ టైం అయింది."
"ఆపరేషన్ అవసరం అన్న కేసును మీరెలా నార్మల్ డెలివరీ చేశారు?"
"డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న డాక్టర్ల చేతిలో పడితే నార్మల్ గా అయ్యే కేసులు కూడా ఆపరేషన్ అవుతాయి. వందన నర్సింగ్ హోం లో ప్రతి పది కేసులకీ ఎనిమిది ఆపరేషన్లు అవుతున్నాయంటే అర్ధంకావటంలేదా? కొందరు డాక్టర్లు వైద్యవృత్తికే ద్రోహం చెయ్యడం చూస్తుంటే ఒళ్ళు కంపరమెత్తుతుంది."
"వందన నర్సింగ్ హోమ్ డాక్టర్ మీద మరో కంప్లైట్ కూడా విన్నాను. పేషెంట్లనుండి కిడ్నీలు దొంగతనంగా తీసి ఏభై అరవై వేలకి అమ్ముతున్నాడట. మొన్న పోలీస్ రైడింగ్ లో అతడి హాస్పిటల్ నుండి రెండు కిడ్నీలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారట."
"చేస్తే ఏమైందట? మళ్ళీ ప్రజలను దోచుకొమ్మని వదిలేశారుకదా పోలీసువాళ్ళు లంచం తిని. అంతా అవినీతిమయం- సాక్ష్యాలతో పట్టుకున్నాక అతడికి పనిష్మెంట్ యివ్వొద్దు? అతడి డాక్టరు పట్టా లాగేసి మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యకుండా చేస్తే మరో డాక్టరు ఇలాంటి తప్పుచేసే సాహసం చేసేవాడు కాదుకదా?"
"భోజనం వడ్డించనా?"
"స్నానంచేసి వస్తాను."
"వేడినీళ్ళు పెట్టనా?"
"సాకు చన్నీళ్ళే అలవాటు. అన్నీ టేబుల్ మీద పెట్టి అళ్ళి పడుకో. నేను పెట్టికుతింటాను."
పది నిమిషాల తరువాత స్నానంచేసి తల తుడుచుకుంటూ వచ్చాడు అరవింద్ చందనపు గుబాళింపుతో.
అరుణోదయ ఇంకా అక్కడే వుంది.
"నేను పెట్టుకుతినేవాడిని కదా? నిద్ర పాడుచేసుకుని ఎందుకు కూర్చొన్నావు?"
"ఇరవైనాలుగు గంటలు దాసీగా నా డ్యూటీ. యజమానులకు ఏ కష్టం కలుగకుండా చూడడం నా బాధ్యత" అంటూ టేబుల్ మీద పళ్ళెంపెట్టి వడ్డించసాగింది.
భోజనం ఒంటరిగా కూర్చుని చెయ్యడంకంటే కబుర్లు చెప్పుకుంటూ చెయ్యడంలో ఎక్కువ తృప్తి.