నిశ్శబ్దంగా వున్న ఈ రాత్రివేళ నిద్రమత్తుగా వున్న కళ్ళు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. ఆమె ముఖంలోకే రెప్పవాల్చకుండా చూస్తున్న అరవింద్, "నిజం చెప్పు! ఓడిపోతే దాసీగా వస్తానని వేసిన పందెం వెనుక ఏదో గూడుపుఠాణీ వుందని నా అనుమానం. జయంతి మాటలు, అమ్మ నీమీద కురిపిస్తున్న అభిమాన వర్షం-నాకేదో అనుమానం కలిగిస్తున్నాయి. అందరూ కలిసి నామీదికి సుమబాణం ఎక్కు పెట్టలేదుకదా?" అనడిగాడు.
అరుణోదయ ఉలిపాటును దాచుకొంటూ, 'దేనికోసం గూడుపుఠాణీ?' అంది.
"భార్యస్థానాన్ని భర్తీ చేద్దామని."
"ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సింది మీరు. భర్తీ చెయ్యడానికి నాకేం పట్టింది?"
"కాని నాకిప్పుడు అనిపిస్తూంది. ఆటలో నేనోడిపోతేనే బాగుండేదని."
"దేనికి?"
"అందమైన నీ బుగ్గమీద తొలిముద్దు తీయదనం తెలిసేది."
"ఆశ! ఆ ఛాన్స్ మీకివ్వకూడదనే నేనోడిపోయాను."
"ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఎంగిలిపడిన బుగ్గని భర్తకివ్వలేనుగా?"
"మరి అలాంటిపందెం ఎందుకు కాసినట్టో?"
"ఓడిపోవాలని ముందే నిర్ణయించుకోవడంవల్ల ఆ పందెం కాశాను."
"అయితే కావాలనే నాకా ఛాన్స్ లేకుండా చేశావన్నమాట. ఇప్పుడుమాత్రం ఏమయింది? నువ్వు దాసీనని ఒప్పుకొన్నావుకదా? నీనుండి ఏమైనా పొందగల హక్కు యజమానిగా నాకుంది" అన్నాడు కావాలనే కళ్ళలోకి మత్తు తెచ్చుకుని.
"మీ సంస్కారం మీద నాకు నమ్మకముంది."
"సంస్కారం అన్న కర్ర చూపించి నన్ను బెదిరిద్దామనుకున్నావా? ఉహుఁ హక్కుగా పొందేచోట సంస్కారం జోక్యం ఏముంది? దాసినని నువ్వే అన్నావు. అమ్మకి కోడలులేని లోటు తీరుస్తానన్నావు."
"అమ్మగారికి కోడలు లేనిలోటు తీరుస్తానన్నానుగాని మీకు భార్య లేని లోటు తీరుస్తాననలేదే. దాసి అంటే చెప్పిన పని చేసేది అని అర్ధం. మీరు మీకనుకూలంగా ఇంకేవో అర్ధాలు లాగితే దానికి నేనేం చేయను? మీ ఇంటికి వచ్చిన పిల్లను మర్యాదగా పంపడం మీ బాధ్యతకాదా?"
"జడలో విచ్చిన మల్లెలు. నిద్రమత్తు కళ్ళు..ఏకాంతం ప్చ్! నా స్వంతం చేసుకోకుండా మర్యాద అన్న అడ్డుగీత గీశావే! మొత్తానికి చాలా తెలివయినదానివి. చదరంగం ఆటలోనే కాదు జీవితంలో కూడా. ఎవరో నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడు" ఇంకా అతడి కళ్ళని మోహపారవశ్యం వదలడంలేదు.
నిద్రొస్తున్నట్టుగా ఆవలించి చిటిక వేసింది అరుణోదయ.
"ముప్పైఅయిదు దాటిన ముదిరిన బ్రహ్మచారిని ఒక్క ఊపువూపేశాననుకుంటున్నావా? అదేం లేదు. అంత తేలిగ్గా బోల్తాపడేవాడిని కాదులే. ఇదీ జయంతి చేసిన తమాషాలాంటిదే! ఉత్తినే."
"ఒక్క ఊపు వూపేశానని నేనేం అనుకోవడంలేదు. ఊపడానికి రంభలాగానో, ఊర్వశిలాగానో మీ ముందు హొయలు పోలేదు. అదంతా మీ చిత్తభ్రమ. దానికి నేనేం చేస్తాను" కొంచెం కోపంగానే లేచివెళ్ళి అరుంధతమ్మ మంచానికి కొంచెం దూరంలో క్రింద వేసుకున్న పడకమీద పడుకుంది.
* * * * *
"అరవింద్ గారంటే నాకు నిన్నటిదాకా మంచి అభిప్రాయముండేది ఆంటీ! ఇప్పుడది తప్పనిపిస్తోంది. తాను నిగ్రహపరుడినని ఆయనకి గర్వం వున్నట్టుంది. ఒక ఆడపిల్లను ప్రేమించదానికి కూడా ఆయనకీ అహం అడ్డువస్తూంది. మ్రోడుగా వుండిపోవాలని అంత ఇదిగా ఆయనకి ఉంటే అలాగే ఎండిపోనీ" కసిగా చెప్పింది అరుణోదయ.
"ఏం జరిగింది?" అడిగింది అర్చన.
"గిరిజాకళ్యాణంలో దేవతల కుట్ర శివుడికి తెలిసిపోలేదూ? ఇదీ అలాగే. ఇదేదో గూడుపుఠాణీ అని అతడికి అనుమానం వచ్చింది" అంటూ అతడన్న మాటలు చెప్పింది. అన్నీ చెప్పలేదు-కొన్ని చెప్పింది.
* * * * *
వారం రోజులు గడిచిపోయాయి. దసరా సెలవులుండడంతో అరుణోదయ తల్లీ, చెల్లెలు వచ్చారు సెలవులు ఇక్కడే గడిపిపోదామని.
వచ్చినప్పటినుండి పాపకి ఒక్కటే జ్వరం. రెండు రోజులు ఏవో టాబ్ లెట్లువాడి, తగ్గకపోయేసరికి తల్లి సలహామీద పావని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది అరుణోదయ.
ఆ సమయంలో సుజాతతో ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడు అరవింద్.
ఆ రోజు సుజాత తన వెడ్డింగ్ కార్డుతో పాటు రిజిగ్నియేషన్ లెటర్ కూడా యిచ్చింది సూపరింటెండెంట్ మూర్తిగారికి.
"అదేమిటి? ఎంతో కష్టపడితేగాని రాణి ఉద్యోగం పెళ్ళిచేసుకుంటే వదిలేయాలా?" అక్కడే వున్న అరవింద్ ఆశ్చర్యంగా అడిగాడు.


