"ఊఁ అమ్మగారిని అడిగి వస్తానుండు."
"అత్తగారు అను."
అరుంధతమ్మ పర్మిషన్ తీసుకుని డాబామీదికి వెళ్ళారు.
డాబామీద కుండీలలో చేమంతులు, గులాబీలు చక్కగా విరగబూశాయి. వచ్చేది శరత్ పూర్ణిమ. పిండారబోస్తున్నట్టు తెల్లని వెన్నెల కురిపిస్తున్నాడు చంద్రుడు. కొద్దిగా మంచు కూడా పడుతోంది.
జయంతికీ, అరుణోదయకీ వయసు తేడా చాలా వున్నా, ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒకటి కావడంవల్ల చక్కని స్నేహం కుదిరింది. డాబా పిట్టగోడమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
గ్లాసుల్లో నీళ్ళు, ప్లేట్లలో ఏదో తినడానికి తెచ్చాడు నౌఖరు. "అమ్మగారు పంపించారు" అంటూ. వాళ్ళు కూర్చోవడానికి చిరిచాప కూడా తెచ్చివేశాడు.
ఆ రోజు తొందరగానే వచ్చాడు అరవింద్ హాస్పిటల్ నుండి.
"జయంతి వచ్చిందిరా! అరుణోదయా, ఆ పిల్లా డాబామీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు" అని తల్లి చెప్పడంతో డాబా పైకి వచ్చాడు.
ఏదో క్రొత్త ప్రంపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది.
పిండారబోసినట్టు వెన్నెల, దూదిపింజల్లాంటి మేఘాలతో దోబూచులాడుతున్న చంద్రుడు. వెన్నెల్లో తళతళలాడుతూ, రెపరెపలాడుతున్న కొబ్బరాకులు. వెన్నెల్లో చిరిచాపమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ముద్దబంతిపువ్వుల్లాంటి ఇద్దరమ్మాయిలు. ఆ ఇద్దరికీ పోటీగా పక్కన కుండీలలో విరబూసిన చేమంతులు, గులాబీలు.
అక్కడ వాతావరణంలో ఏదో మత్తు, ఏవో హాయి అలుముకొని మనసును మామూలు ప్రపంచం నుండి ఇంకెక్కడికొ తీసుకుపోతున్నట్టుగా వుంది.
"మీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు అంకుల్! ఇంత చక్కని వాతావరణంలో అంకుల్ కూడా వుంటే బాగుండేదని అనుకుంటూండగా వచ్చేశారు."
ఈ డాబా, ఈ వెన్నెల, ఈ పువ్వులు, నీలాకాశం ఎప్పుడూ వుండేవే. వీటిలో ఇంత అందముంటుందని ఈ రోజే తెలిసినట్టుగా అయింది అరవింద్ కి.
"ఏమిటి సంగతులు?" పిట్టగోడ మీద కూర్చుని అడిగాడు.
"సంగతులు చాలానే వున్నాయి. ముఖ్యంగా మా అరుణక్క పెళ్ళి. ఈ సంవత్సరం చేసేసుకుంటుందట. 'జాబ్ దొరికింది. ఇక జీవితంలో సెటిలై పోతాను' అంటోంది. వరుడు ఎలాంటివాడు కావాలని అడిగాను. మీ అరవింద్ అంకుల్ లా వుండాలంది."
"ఏయ్. జయంతీ! తంతాను నిన్ను. అన్నీ అబద్దాలు డాక్టరుబాబూ! ఈ పిల్ల మాటలు నమ్మకండి" అరుణోదయ కంగారుగా అరిచింది. "అసలు పెళ్ళి గురించి మాట్లాదందే."
"మీ ముందు సిగ్గుపడి అలా అంటూంది గానీ.....నిజం అంకుల్! మీ మీదొట్టు. ఇందాక నాతో చెప్పింది మిమ్మల్ని ప్రేమిస్తున్నానని."
"ఏయ్, దెయ్యం! ఎన్నెన్ని అబద్దాలాడుతున్నావు. ఉండు నీ పని పడతాను."
అరుణోదయ కొట్టబోతే జయంతి లేచి పరిగెత్తింది.
లేడిపిల్లల్లా డాబానిండా పరుగులు.
తిప్పి తిప్పి చివరికి అరవింద్ వెనుక దాక్కుంటున్నట్టుగా నిలబడి 'వెవ్వెవ్వె' అంటూ నాలికతో వెక్కిరించింది జయంతి.
"అంకుల్ వెనుక దాక్కుంటే వదులుతాననుకోకు" అతడి పక్కనుండి దాడి చేయబోయింది అరుణోదయ.
చేతులు బారచాపి అడ్డుగా నిలబడ్డాడు అరవింద్. "నేనుండగా మా జయంతిని కొట్టగలనని ఎలా అనుకొన్నావు?"
అతి దగ్గరగా, ధీరోదాత్తంగా నిలబడిన అతడు.
"ప్లీజ్! జరగండి పక్కకు. ఈరోజు జయంతి పనిపట్టిగాని వదలను. ఎన్నెన్ని అబద్దాలు నా మీద. అసలు ఏమిటి ఆమె ఉద్దేశ్యం?" అతడి భుజాల క్రిందినుండి, పైనుండి జయంతిని అందుకునే ప్రయత్నం చేసింది.
ఆమెకు అందీ అందకుండా నవ్వసాగింది జయంతి.
ఇద్దరు అతివల మధ్య ఇరికినట్టుగా అయింది అరవింద్ పని. జయంతిని అందుకునే ప్రయత్నంలో అరుణోదయ ముఖం అతడికి చాలా దగ్గరగా వచ్చేసింది. ఆమె జడలో్ విచ్చిన చమేలీపువ్వుల గుభాళింపు అరవింద్ నాసికాపుటల్ని ఘాటుగా సోకి ఎక్కడెక్కడికో తీసికెళ్ళసాగింది మనసును. ఇంతకుముందు తెలియదు, మల్లెలకింత అందముంటుందని, వాటికింత హాయి అయినా సువాసన వుంటుందని.
జయంతిని అందుకొనే ప్రయత్నంలో అరుణోదయ చేతులు, భుజాలు, చుబుకం అతడికి తాకుతున్నాయి. వెన్నెల్లో ఆమె ముఖం చాలా చాలా అందంగా వుంది. వెన్నెల కాంతిపడి ఆమె పళ్ళు ముత్యాల్లా తెల్లగా మెరుస్తున్నాయి. అరుణోదయ నవ్వు చాలా బాగుంటుంది.
పది నిమిషాలు కష్టపడ్డా అరుణోదయ చేతికి జయంతిని అందనివ్వలేదు అరవింద్.