Read more!
Next Page 
యువత నవత  పేజి 1

 

                        యువత - నవత

                                                                                     -పోల్కంపల్లి శాంతాదేవి

   ఆరోజు వనజాక్షికి పెళ్లిచూపులు. వరుడు బాగున్నాడా లేదా, ఈ సంబంధం చేసుకోవచ్చా లేదా సలహా ఇవ్వడానికి స్నేహితురాల్లు శాలిని, సుధలను పిలుచుకొంది వనజాక్షి.

     పెళ్లి చూపులకే పెళ్లికి పడినంత హైరానా, హడావిడీ పడిపోతున్నారు వనజాక్షి తలిదండ్రులు, అన్నగారూ, తమ్ముళ్ళూ, ఇల్లు నీటుగా సర్దడం దగ్గరనుండి వాళ్లకి చేసే మర్యాదల వరకూ యెలా వుండాలని తర్జన భర్జన పడుతున్నారు.
     "మినిస్టరో, గవర్నరో వస్తున్నట్టు ఇంత హడావుడి ఏమిటండీ?" ఆశ్చర్యంగా అడిగింది సుధ.

    "మగ పెళ్లి వాళ్లంటే అంతకంటే ఎక్కువేనమ్మా! మనం మర్యాదస్తులమని తెలిస్తేనే కదా మనతో సంబంధానికి వాళ్ళు యిష్టపడేది?" అంది వనజాక్షి తల్లి సుగుణమ్మ.

     పెళ్లికొడుకు తల్లిదండ్రులు ఉదయం పదిగంటలకల్లా  వస్తామని కబురు చేశారుగానీ ఒంటిగంటవరకూ రాలేదు.
     గదిలో స్నేహితురాళ్లు ముగ్గురూ కబుర్లలో పడిపోయారు.

      పెద్దలు చేసే వివాహం నయమా? ప్రేమ వివాహం నయమా? అన్న డిస్ కషన్ లోకి దారితీసింది సంభాషణ.

     "బాబోయ్! మగవాళ్లకేసి కన్నెత్తి చూడాలంటేనే చచ్చేంత భయం. ఇంక ప్రేమించి పెళ్లిచేసుకోవడం కూడానా?"అంది వనజాక్షి.

    "నువ్వేమంటావు?" శాలిని భుజం తట్టింది సుధ.

     "నా ఓటు పెద్దలుచేసే వివాహానికేగాని, సంబంధం సెటిల్ చేసేటప్పుడు నా అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాలంటాను! పూర్తిగా ఏకపక్ష నిర్ణయం కూడదన్నమాట!"

    "సంబంధం అన్ని విధాలా బాగుందని అనిపించాకే కదా సెటిలే చేసేది పెద్దలు? అప్పుడు నీ అభిప్రాయం వాళ్లేం చేసుకొంటారు?వాళ్లు చూడలేనివి నువ్వేం చూస్తావు?" అడిగింది సుధ.

     "పెద్దలు చూడనిది పెళ్లికొడుకు అందచందాలు!ముఖ్యంగారంగు! జీడిలా వున్నా ఒక అందమైన అమ్మాయికి మగడు కావడానికి అనర్హుడు కాదు కాని, నేను నేనేమిటి ప్రతి ఆడపిల్లా వరుడి అందం, పర్సనాలిటీ రంగు అన్నీ చూస్తుంది. పెద్దవాళ్లు చూడనిది ఇంకొకటికూడా చూస్తుంది. ఆడపిల్ల - అది వరుడి అభిరుచులు, వ్యక్తిత్వం."

    "అందం అంటే పెళ్లిచూపుల్లో తెలిసిపోతుంది. ఈ  రెండవది యెలా తెలుసుకొంటుంది ఏ ఆడపిల్లయినా?" సుధ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

    "అబ్బాయిని ఒకటి రెండుసార్లు కలిసి మాట్లాడితే అదే తెలిసిపోతుంది."

    "పెళ్లికి ముందే అబ్బాయితో మాట్లాడుతానూ అంటే అబ్బాయే కాదు, అబ్బాయ్ పెద్దలుకూడా "ఇదెక్కడో బరితెగించిన రకం! బాబోయ్  మాకొద్దు ఈ సంబంధం" అని దండం పెట్టి వెళ్లే ప్రమాదం వుంది. ఒకవేళ అలా అనకపోయినా, పెళ్లికిముందే అబ్బాయితో అమ్మాయి భేటీ అయితే తీరా ఆ సంబంధం కుదరదనుకో, "ఆ అబ్బాయితో కలిసి తిరిగింది! ఎంతవరకు పోయిందో ఆ సంబంధం" అనేస్తారు లోకులు. అందుకని యీ డొంకతిరుగుడంతా అనవసరం నన్నడిగితే!నచ్చినవాడిని ప్రేమించేస్తే ఈ బాధలన్నీ వుండవుకదా?" అంది సుధ.

    "ప్రేమ గుడ్డిదంటారు. ఆమైకంలో వరుడి మంచీచెడ్డలు ఏం చూస్తుంది?పై మెరుగులు చూసి భ్రమపడి,  తీరా పెళ్లయ్యాక తను మోసపోయానని తెలుసుకొంటే?"

    "ఈ పెద్దలు మాత్రం పై మెరుగులు చూడక లోపలేం చూస్తారని? వీళ్లు చూసేది పైకి కనిపించే కులం, గోత్రం, సంప్రదాయం.... అబ్బాయి యేం చదివాడు? ఎంత ఆస్తి వుంది? ఇవేకదా చూసేది? పిల్ల వాడి సంగతేమిటి? అభిరుచులేమిటి?  ఆదర్శాలేమిటి? ఇవన్నీ చూడరు కదా?  పిల్ల కాపురం చేసేది ఈ కులగోత్రాలు, సంప్రదాయం, చదువులతోకాదు అబ్బాయితో. అబ్బాయు గుణగణాలమీద ఆధారపుడుతుంది అమ్మాయి  భవిష్యత్తు అందుకని ప్రేమించి ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని వివాహం చేసుకోవడమే బెటరంటాను" అంది సుధ.

     "మాకు నీ అంత ధైర్యంలేదుగాని సుధా, నువ్వు  చీరకడితేనే బాగుంటావే! ఈ పంజాబీ డ్రెస్  ఏం బాగుండదు!" అంటూ దుస్తులమీదికి టాపిక్ మార్చింది వనజాక్షి.

     "బాగుండదు అంటే ఎలా బాగుండదు!"

    "ఏమిటో ఎబ్బెట్టుగా వుంటుంది! తెలుగమ్మాయికి చీరే అందం.  చీరలోని నిండుదనం మిగతా ఏ డ్రెస్ లోనూ రాదు!"

Next Page