మరేదో ఫీలింగ్...
ఎదురుగా సోఫాలో మహాపతి పడుకొని ఉన్నాడు.
పక్క గదిలో డా.సిద్దార్ధ, మరో గదిలో ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఉన్నారు. హాలులో ఇద్దరు నర్సులు, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్ మెంట్ అంతా ఉంది రెడీగా.
అద్వైతకు ఎప్పుడే విపత్తు కలిగినా, వెంటనే హాస్పిటల్ కు తరలించడానికి ఓ అంబులెన్స్ ఆ ఫామ్ హౌస్ లో రెడీగా ఉంది.
అద్వైత మెల్లిగా లేచింది. నీరసంగా అనిపించింది ఆమెకు. వారం రోజులుగా కళ్ళు తెరవడం.... బలవంతంగా ఏదో ఒకటి, తండ్రి తినిపిస్తే తినడం.... ఆ తర్వాత అలానే పడుకుండి పోవడం....
మంచం పక్కనే కాన్వాస్ ఉంది. అద్వైత కోసం కాన్వాస్ తెప్పించాడు మహాపతి.
అద్వైత కాన్వాస్ దగ్గరికి వెళ్ళింది.
కాన్వాసు వంక చూస్తోంది. పక్కనే వున్న బ్రష్ స్టాండులోని బ్రష్ ను తీసుకోబోయి, తూలింది ఓపిక లేక. బ్రష్ స్టాండ్ చిన్న శబ్దం చేస్తూ కింద పడింది.
మహాపతి లేచాడు.
'బేబీ... ఏమైందమ్మా....' అన్నాడు కూతురి దగ్గరికి వస్తూ.
అద్వైత కాన్వాసు వంక చూస్తోంది.
'ఇంటి తల్లీ.... ఈ వేళప్పుడు లేచావు? బొమ్మ వేస్తావా?" లాలనగా అడిగాడు మహాపతి.
'మీ.... మీరెవరు?'
షాక్ కొట్టినట్టు చూస్తూండిపోతూ అన్నాడు మహాపతి.
'బేబీ.... నేనమ్మా! నీ నాన్నను....'
'నా.....న్నా? నా .... న్నా?' అంది అస్పష్టంగా.
'అవును తల్లీ....'
అద్వైత మంచం దగ్గరికి వెళ్ళి, మంచం మీద కూచుంది.
'ఏమిట్రా చిట్టితల్లీ.... డాక్టర్ ని పిలవనా?' దిగాడు కూతురి తల నిమురుతూ.
'డాక్టరా.... డాక్టరెందుకు? వద్దు'
'పడుకోమ్మా....'
అద్వైత పడుకుంది. ఆమెకు ఏమీ అర్ధం కావడంలేదు. ఆమె కళ్ళు మూసుకుంది. 'అభీ.... నేనెక్కడున్నాను?' అనుకుంది. విరజ గుండె చేసే సవ్వడి అద్వైతను ఆసాంతం పట్టి కుదిపేస్తోంది.
* * *
ఎర్లీ మార్నింగ్.
అద్వైత లేచింది. ట్రాక్ సూట్ కోసం వెదికింది. ఎక్కడా కనిపించలేదు. ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. తలుపులు తెరుచుకుని బయటకు నడిచింది.
చిరుగాలి పరామర్శిస్తూంటే, చల్లగాలి అనుభూతినిస్తోంది.
ఆమె అడుగులు ముందుకు కదిలాయి.
తానెటు వెళ్తోందో తనకే తెలియడం లేదు. అయినా చిత్రంగా అడుగులు ముందుకు కదులుతున్నాయి. జాగింగ్ చేసే సమయంలో, చీరతో రోడ్డు మీదికి వచ్చిన అద్వైతను కొందరు విచిత్రంగా చూస్తున్నారు.
ఆమె న...డు....స్తూ....నే ఉంది. సరిగ్గా విరజ ఇంటి ముందాగింది. పెద్దగేటు ఓ పక్కన 'విరజ' అన్న పేరు, మరో పక్కన 'అభినయ్' అన్న పేరు. బంగళా మీద 'విరజాభినయ్' అన్న పెద్దపెద్ద రేడియం అక్షరాలు.
తదేకంగా ఆ బంగళానే చూస్తోంది.
ఆమె అభినయ్ బెడ్ రూమ్ కిటికీ వైపు చూసింది. పరదాలు మూసి ఉన్నాయి.
అభినయ్ ఎప్పటిలా బెడ్ రూమ్ కర్టెన్స్ పొద్దున్నే తీసి ఉంటే.... ఎదురుగా తననే గమనిస్తోన్న అద్వైత కనిపించేది.
అద్వైత ఆ బంగళా వైపు చూస్తూ అభినయ్ పడగ్గది వైపు చూస్తూండిపోయింది. ఆమె గుండె చిత్రమైన సవ్వడి చేస్తోంది.
* * *
ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
మహాపతి అద్వైత కనపడకపోవడంతో కంగారు పడిపోయాడు.
పనివాళ్ళను నలుమూలలకూ పంపించాడు. నర్సులు మరో పక్కకు వెళ్ళారు.
డాక్టర్ సిద్దార్ధ, మహాపతి ఓ కారులో బయల్దేరారు. అంతా అద్వైత కోసం వెతుకుతున్నారు. కొద్ది క్షణాల్లో మహాపతి నగరాన్నే అలర్ట్ చేసినంత హడావిడి చేశాడు.
సరిగ్గా విరజ ఇంటి ముందు నిలబడి, ఆ బంగళాను, అభినయ్ బెడ్ రూమ్ ను తదేకంగా చూస్తోన్న అద్వైతను గుర్తుపట్టి కారాపాడు మహాపతి.
'బేబీ..... వాటీజ్ దిస్. ఇక్కడేం చేస్తున్నావమ్మా....' అడిగాడు కంగారుగా మహాపతి.
'ఏమో.... నాకు తెలియదు డాడీ...' అంది సందిగ్ధంగా అద్వైత.
'పతీ.... ముందు అమ్మాయిని తీసుకువెళ్దాం పద' అన్నాడు డాక్టర్ సిద్దార్ధ.
'నాకు ఇక్కడే కాసేపు ఉండాలనిపిస్తోంది' అంది అద్వైత.
కానీ..... మహాపతి బలవంతంగా కూతుర్ని కారెక్కించాడు.
* * *
అభినయ్ కళ్ళు తెరిచాడు. ఏ అర్ధరాత్రో నిద్రపోవడం వల్ల కళ్ళు ఇంకా మండుతూనే ఉన్నాయి.
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తన చేతిలోనే వున్న ఒక గుండె సవ్వడి బొమ్మ రంగులు మారుతూ వుంటే అబ్బురంగా చూశాడు. విరజ వాయిస్ వినిపిస్తూనే ఉంది.
ఆ బొమ్మను తన మంచం ఎదురుగా గోడకు తగిలించాడు. తను ప్రతిరోజూ లేవగానే తన కోసం విరజ చివరిసారిగా కొన్న బొమ్మనే చూడాలి. విరజ మాటలే వినాలి.
విండో కర్టెన్స్ తొలగించడానికి వెళ్ళాడు. అతనికి మరోసారి విరజ గుర్తొచ్చింది. రోజూ విరజే లేవగానే ఈ కర్టెన్స్ తొలగించేది.... విండో గ్లాసులో నుండి అవతల ప్రకృతిని, నగరాన్ని తనతోపాటు చూసి ఎంజాయ్ చేసేది. మంచు కురుస్తోంటే.... గ్లాసుల్లో నుంచి చూస్తూ వుండేది. తనకు వేడివేడి కాఫీ తనే స్వయంగా చేసి తీసుకువచ్చి, తన పక్కనే కూచునేది. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ కాఫీ తాగేవారు.
ఆ సంఘటన గుర్తొచ్చి అతని గుండెని పట్టి కుదిపేసింది. విరజ తాలూకు ఏ జ్ఞాపకమూ తను మిస్సవ్వకూడదు. వెంటనే వెళ్ళి విండో కర్టెన్స్ తొలగించాడు.
సరిగ్గా అప్పుడే మహాపతి కారు స్టార్ట్ చేశాడు. కారులో నుంచి తల బయటకు పెట్టిన అద్వైత, అదే సమయంలో తన గదిలో విండో నుంచి తల బయటకు పెట్టిన అభినయ్ ని చూస్తోండగానే, కారు ముందుకు కదిలి, ఆ దృశ్యం కనుమరుగయ్యేలా చేసింది.
* * *
'ఎలా వున్నావమ్మా' డాక్టర్ సిద్దార్ధ అద్వైత తల మీద చేయివేసి అడిగాడు.
'అయామ్ ఫైనంకుల్' అంది అద్వైత.
'పొద్దున్నే ఎక్కడికెళ్ళావమ్మా....' అడిగాడు సిద్దార్ధ.
'ఎక్కడికో తెలియదంకుల్'
'మరి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావమ్మా?'
'బయటకు వెళ్ళాలని అనిపించిందంకుల్'
'అదే ఎక్కడికి?'
'అదే తెలియదంకుల్'
'ఆ బంగళా ముందు ఎందుకు నిలబడ్డావమ్మా...'
'అక్కడ నిలబడితే ప్రశాంతంగా ఉందంకుల్'
'ఎందుకు?'
'ఎందుకంటే.... ఏమో....' పెదవి విరిచింది అద్వైత. ప్రొఫెసర్ రాబిన్ మార్క్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అదే రోజు సాయంత్రం మరో సంఘటన జరిగింది.
* * *
అద్వైత చాలా నెమ్మది మనిషి వేగంగా నడవలేదు. అలాంటిది మేడ మెట్లు చకచకా వేగంగా రెండేసి చొప్పున దిగుతూ కిందికి వచ్చింది. కీ-చెయిన్ ని చూపుడు వేలితో గిరగిరా తిప్పుతోంది.
'డాడీ.... నాకు మిరపకాయ బజ్జీలు వేడివేడిగా తినాలనిపిస్తోంది' అంది అద్వైత.