Previous Page Next Page 
మణిదీపం పేజి 36

    అణువు అణువూ ఆనందతరంగితం చేస్తున్నట్టుగా వుంది అరుణోదయ ఆగమనం.

    అరవింద్ చూపు మరల్చుకొని వాచీ చూసుకొన్నాడు. హాస్పిటల్ కి టైం అయిపోయిందే అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి "టీ చేయమ్మా! హాస్పిటల్ కి వెళ్ళాలి" అన్నాడు.

    ఆవిడ చదువుతోన్న భాగవతంలోంచి తలెత్తి "ఈ రోజంతా నేను పొయ్యి దగ్గరికి వెళ్లకూడదని, పనేమీ చేయకూడదని ఆ పిల్ల ఒట్టు పెట్టిందిరా! ఒట్టి గడుసు పిల్ల. ఉండు_ టీ పెట్టివ్వమని పిలుస్తాను."

    "ఈ మాత్రం దానికి ఆ అమ్మాయిని పిలవడం దేనికిలే! నేను పెట్టుకుంటాను."

    అరవింద్ కిచెన్ లోకి వెళ్ళి స్టౌ వెలిగించి నీళ్ళు పెట్టాడు. అయిదు నిమిషాల్లో డికాక్షన్ తయారైంది. పాలు కలిపి కప్పులోకి ఫిల్టర్ చేసుకొంటుంటే పట్టుకారు జారి క్రిందపడి పాదం మీద టీ ఒలికి భగ్గుమంది.

    పరిగెత్తుకు వచ్చింది అరుణోదయ. "మీరు లేచారేమో టీ పెట్టిద్దామని వస్తూనే వున్నాను. అంతలోనే ఇంతపని చేసుకొన్నారా చిన్నయ్యగారూ?" అంటూ క్రిందికి వంగి గబుక్కున పాదం పట్టుకు చూసింది. "పచ్చటి పాదం ఎర్రగా ఎలా కందిపోయిందో! ఇంట్లో బర్నాల్ వుందా? పూస్తాను."

    "గదిలో వుంది. నేను రాసుకొంటాగానీ టీ చెయ్యి. తాగి హాస్పిటల్ కి వెళ్ళాలి" కొద్దిగా కుంటుతూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.

    అరుణోదయ టీ చేసి తెచ్చేసరికి అతడు బర్నాల్ పూసుకోవడం పూర్తిచేసి చెయ్యి కడిగేసుకొన్నాడు.

    టీ తాగి హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు అరవింద్.

    సంధ్యపడింది.

    అరుంధతమ్మ భాగవతం మూసిపెట్టి గదిలోంచి బయటికి వచ్చింది. ముఖం కడుక్కుని, నుదుట బొట్టు దిద్దుకుని కుంకుమభరిణ చేతిలోకి తీసుకుంది. వరండాలో ట్యూబ్ లైట్ స్విచ్ నొక్కి "దీపంజ్యోతి పరబ్రహ్మం" అంటూ శ్లోకం చదువుకుంటూ వీధి గడపకీ, పెరట్లో తులసికీ కుంకుమ పెట్టి, అదే చేత్తో అరుణోదయకి పెట్టింది.

    "ఇంట్లో ఒక ఆడపిల్ల తిరగాలని ఎన్నాళ్ళనుండో తపన. వాడిది అదో మతం. పెళ్ళంటే విముఖత. ఒకసారి రామకృష్ణ దంపతుల పోరుపడలేక పెళ్ళికి ఒప్పుకున్నాడు. దురదృష్టవశాత్తూ పీటలమీద పెళ్ళి చెడిపోయింది. మళ్ళీ వాడి దగ్గర పెళ్ళిమాట ఎత్తే ధైర్యం లేకపోయింది. అడవిలో ప్రొద్దు గ్రుంకినట్టుగా మా జీవితాలు గుబులు గుబులుగా గడిచిపోతున్నాయి. ఎలాగైనా వాడి మనసు గెలిచి ఈ ఇంటీ దీపానివి కావాలమ్మా" ఆవిడ గొంతు గాద్గదికమైపోయింది.

    "అంత గొప్ప డాక్టర్ని అందుకోగల అర్హత నాకుందంటారా? అందం తక్కువ. చదువు తక్కువ. మాది మధ్యతరగతి కుటుంబం. మా ఫామిలీలో డాక్టర్లు, ఆఫీసర్లు లేరు. మా అన్నయ్య ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు."

    "నీ అందానికి ఏం తక్కువ? లక్ష్మీ కళ వుంది ముఖంలో. ఆ పాలు వరసలో వుంది నీ అందమంతా. పిల్లను తెచ్చుకోవాల్సినచోట చూడాల్సింది అంతస్థు హోదాలు కాదు. మంచి సంస్కారం, మర్యాద. నువ్వు ఆ విషయంలో ఏం తక్కువకాదు,"

    "మీకు నచ్చడం నా అదృష్టం. ఆయనకీ నచ్చాలి కదా?"

    "నచ్చేలా చేసుకో! నీకు నా పూర్తి సహకారం వుంటుంది."

    "హాయ్ అరుణక్కా!" అంటూ వచ్చింది జయంతి. "నువ్వు  ప్రొద్దుటి నుండి ఒక్కసారైనా రాలేదేమిటాని చూస్తున్నాను. డ్యూటీకి వెళ్ళావేమో అనుకున్నాను! అమ్మ చెప్పింది ఇప్పుడే అరవింద్ అంకుల్ ఇంటికి వెళ్ళింది అని. సరే! ఏం విశేషాలో తెలుసుకుందామని వచ్చాను."

    "విశేషాలు ఏమున్నాయి? పందెంలో అనుకున్న ప్రకారం ఇక్కడ పనిచేయడానికి వచ్చాను."

    "ఏమంటున్నాడు మా అంకుల్?" కన్నుకొట్టి అడిగింది.

    "ఆయనేమంటాడు?"

    "ఏయ్, దొంగా! నాకు చెప్పవా?"

    "నిజం! చెప్పడానికి ఏం లేవు."

    "మరి వచ్చి ఏం చేశావు?"

    "చెప్పాకదా? పనిచేశాను, వంట చేశాను."

    "అంతేనా? అంకుల్ ఏమీ ఇంటరెస్ట్ చూపలేదా నువ్వంటే?"

    "అంత తేలిగ్గా ఇంటరెస్ట్ చూపే మనిషైతే ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళి కాకుండా రాయిలా ఎందుకుంటాడు?"

    "అయితే అంకుల్ సంగతేమిటో ఇవాళ నేనే తేల్చుకుంటాను. చూస్తుండు. అంకుల్ ని ఒక ఆట పట్టిస్తాను."

    దశమి రాత్రి.

    కిటికీలోంచి వెన్నెల కిరణాలు గదిలో పడుతున్నాయి. కొబ్బరాకుల వెనుక చందమామ మేఘాలతో దోబూచులాడుతూ అందంగా కనిపిస్తున్నాడు. "డాబామీద కూర్చుందామా అరుణక్కా? వెన్నెల బాగుంది."   

 Previous Page Next Page