క్షణకాలం గుర్తుపట్టలేదు.
"నేనత్తయ్యా ప్రతాప్ ని" అన్నాడతను మళ్ళీ.
గుర్తుకొచ్చిందామెకు.
సుందర్రావుగారు విజయనగరంలో పనిచేస్తున్నప్పుడు వల్ల ఆఫీసులో ఓ క్లర్క్ హఠాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. ఆ క్లర్క్ కి యెవరూలేరు అతడికి ఒక్కగానొక్క కొడుకు ప్రతాప్!
దిక్కూ మొక్కూలేని ఆ కుర్రాడినిచూసి జాలిపడ్డారు సుందర్రావుగారు.
అంతే!
అతని పోషణాభారం ఆయనే వహించారు.
ఆ క్లర్క్ కి రావలసిన గవర్నమెంటు డబ్బంతా తెప్పించారు. ఆ అబ్బాయిపేర బ్యాంక్ లో వేశారు.
ఎసెల్సీ చదువుతున్న ఆ కుర్రాడిని తమ ఇంట్లోనే వుంచుకున్నారా సంవత్సరం. పరీక్షలై పాసవగానే కాలేజిలో చేర్పించారు.
అనుకోకుండా సుందర్రావుగారికి గుంటూరు ట్రాన్స్ ఫర్ అయిందప్పుడు. అతడ్ని తమ వెంట రమ్మన్నారు, కానీ మిగతా స్టాప్ అందుకు అంగీకరించలేదు. వారాల భోజనం యేర్పాటు చేస్తామన్నారు అక్కడే చదువుకోనిమ్మన్నారు.
అందుకు సుందర్రావుగారు అంగీకరించలేదు.
అతని కాలేజీ చదువు కనీసం నాలుగైదేళ్లుంటుంది. ఇన్నేళ్ళు వారాలు చేసుకోవాలంటే అతనికీ కష్టమే- మనం భారీ బుద్ధితో ఏర్పాటు చేయొచ్చు, కానీ ఒక్కరోజుకాదు ఒక్కవారంకాదు నాలుగేళ్ళు అలా ఇంటింటా భోజనం చేయాలంటే అతడు ఎంతో మానసికంగా క్రుంగిపోతాడు. పైగా ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్లు ప్రీతితో చూస్తారని చెప్పలేం" అన్నారు.
"మరెలాగా" అని ప్రశ్నించారు వాళ్ళు.
"అతడ్ని హాస్టల్లో వుండి చదువుకోమందాం, నెల నెలా తలయింత యిద్దాం. ఫ్రీ స్కాలర్ షిప్ కి, ఫ్రీ బోర్డింగ్ ప్రయత్నం చేద్దాం."
అందరూ అంగీకరించారు.
అతడి మార్కులు స్కాలర్ షిప్ ని సంపాదించి పెట్టాయి.
అతని లేమి ఫ్రీ బోర్డింగ్ తెచ్చిపెట్టింది.
చేయూత యిచ్చినవాళ్ళకి బాధలేకుండా పోయింది.
తృప్తిపడిన మనస్సుతో గుంటూరుకి వచ్చేశారు వీళ్ళు.
తర్వాత తర్వాత ఉత్తరాలొస్తున్నాయ్. కానీ అతడు రాలేదు. మళ్ళీ యిన్నాళ్ళకు యిన్నేళ్ళకు తనకు తానుగా వచ్చాడతను.
గిర్రున కళ్ళముందు తిరిగిన గతాన్ని పక్కకు తోలి "రా ప్రతాప్!" అంది ఆమె.
ఆ ఇంటిని - ఆ వాతావరణాన్ని - ఆ మనుషుల్నీ చూసేసరికి అతడి కంట నీరు గిర్రున తిరిగింది.
'ఎలాంటివాళ్ళు ఎలా అయ్యారు?' అనుకున్నాడు.
'ప్రతాప్!'
'మామయ్యగారూ!'
సుందర్రావుగారిని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక పోయడతను.
"మీవంటి మంచివారికా యీ కష్టాలు! నాన్నగారు పోయినప్పుడు మీరు నన్ను ఆదుకుంటే భగవంతుడున్నాడనిపించింది. కానీ మీకు కష్టాలు వచ్చాక భగవంతుడు గుడ్డి వాడయ్యాడనిపిస్తుంది. మామయ్యా! ఇన్ని కష్టాల్లోకూడా మీకు నా చేదోడు లభించలేక పోయింది. చివరికి నాకు మీ విషయం తెలిసేసరికి చాలా జరిగిపోయాయ్."
"అవును ప్రతాప్!
నాకు బ్తుకే భారంగా వుందిప్పుడు.
పెద్ద కొడుకు ప్రేమ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు. వాడు మామగారి చేతిలో చిలక అయ్యాడు. పోనీ అక్కడైనా సుఖపడతాడనే నమ్మకంలేదు నాకు.
ఇక చిన్నవాడయినా నాయింటి దీపంగా కంటె మొగ్గుగా వుంటాడనుకుంటే అదీ నిరాశే అయిపోయింది.
చిన్నవాడు- చదువుకుని ఉద్యోగం సంపాదించి తలిదండ్రులకి అండదండగా నిలవవలసిన వాడు స్మగ్లర్స్ తో చేతులు కలపటమేమిటి? పిడుగులాగా వచ్చిపడింది ఆపద. ఇప్పుడువాడే జైల్లో వున్నాడో కూడా మాకు తెలీదు. ఏమి మాటాడటానికి ఎమర్జన్సీ.
ఏం చేయను చెప్పు?
ఇద్దరు కొడుకులూ అలా అయ్యారు.
కతురూ భార్యా సంపాదిస్తూవుంటే తింటూ భూమికి భారంగా బ్రతుకుతున్నాను."
అవిరళధారగా కారుతోన్న ఆయన కన్నీరు తుడిచాడు ప్రతాప్.
"ఏమండీ! అంతమాట అనకండి- నేను యే జన్మలోనో నోచిన తక్కువ నోముకి ఫలితంగా పుట్టారు వాళ్ళు. ఎవరి తలరాత ఎలవుంటే అలా జరగకతప్పదు- పోనీండి. వాళ్ళు చేసుకున్నంత వాళ్ళు అనుభవిస్తున్నారు.
మీరిలా బెంబేలు పడితే ఫలితం ఏముంది చెప్పండి.
బ్రతుకు బ్రతికినన్నాళ్ళూ సాగదీయవలసిందే!
దాన్ని బలవంతంగా అంతం చేసుకునే హక్కు మనకిలేదు.
పైగా జయప్రదని ఏం చేయాలి మనం?
దాన్నో ఇంటివాడికి ఇచ్చి బాధ్యత తీర్చుకునేవరకూ మన జీవితాలపై మనకు హక్కు లేదు."