Previous Page Next Page 
మధుకీల పేజి 36

    ఇంజన్ దాటి వెళ్ళి నుంచున్నాడు సుధాకర్,
    ఆ వ్యక్తి సుధాకర్ వద్దకి వచ్చాడు.
    అటూ ఇటూ చూశాడు,
    "మనిషి విలువ ఎంత?"
    "పెంచుకో గలిగినంత?"
    "ఆకాశం మండుతోంది"
    "నేనే మండిస్తున్నది"
    అలవాటయిన మాటలు! వారాని కొక్కసారి కంఠపాఠంలా వప్పగించే చిలుక పలుకులు,
    ఇద్దరి చేతుల్లోని సూట్ కేసులు మారాయి,
    "బై!"
    "బై"
    రెండడుగులు వేశాడు సుధాకర్.
    అంతలో హఠాత్తుగా అనుకోని సంఘటన జరిగిపోయింది. ఐదారుగురు వ్యక్తులు వాళ్ళని చుట్టుముట్టారు,
    "ఎవరు మీరు?"
    "మీ రెవరు?"
    "ఆ ప్రశ్న నీ కనవసరం"
    "ఇదీ అంతే!"
    "అందులో ఏముంది?"
    "దుస్తులు"
    "తెరవండి చూడాలి!?"
    "అవసరమా?"
    "మిస్టర్ కాలయాపన అనవసరం - పదండి స్టేషన్ కి" అని ఇద్దర్నీ తీసుకుని స్టేషన్ కి వెళ్ళి చెక్ చేసి అరెస్ట్ చేశారు, వస్తోన్న కేస్ లో బంగారం వుంది. వెళుతున్న దాన్లో డబ్బుంది, మీసా కింద మూసేశారుఇద్దర్నీ.
                                                                      *        *        *
    "మీరు పిల్లలకి ట్యూషన్ చెపుతారా?"
    నీళ్ళకోసం వెళ్ళిన జయప్రద ఆ పలకరింపువిని తలెత్తింది. ఎవరో కొత్త యువకుడు - ఆ ఇంట్లో ఎప్పుడూ కనిపించలేదు.
    తత్తరపాటు చెందింది జయప్రద.
    "మీరు టీచరా?"
    అందమైన తన కళ్ళని ఇంకా వశాలంచేసి ఆశ్చర్యంగా అడిగాడు. "అరె! మీరు టీచరు కాదా? ట్యూషన్స్ చెపుతున్నారన్నార
    దీర్ఘమైన అందమైన అతని నాసక కనిపించిందామెకు. "ఫరవాలేదు, స్థిర నిశ్చయాభిప్రాయాలున్నవాడే" అనుకుంది. జవాబివ్వకుండా నీరు నింపుకోసాగింది.
    ముఖంపై వాలుతున్న ముంగురుల్ని అలవోకగా ఎగరేసి "మీకు మాటలురావా అని అడిగాడు.
    నవ్వొచ్చింది జయప్రదకు.
    "ఆఁ ఆఁ దొంగలాగా వున్నారు మీరు కావాలనే మాటాడటంలేదు" అని ఎదురింట్లోనే కదూ మీరుండటం" అని అడిగాడు.
    నీళ్ళబిందె చంక నెత్తుకుని "తెలిసి అడిగే ప్రశ్నలకి సమాధానాలుంటాయా" అని వెళ్ళిపోయింది జయప్రద.
    పెదవి కొరుక్కున్నాడా కుర్రాడు.
    బ్యాంక్ ఎసిస్టెంట్ మేనేజరుగారికి గోత్రదాయాది ఆ కుర్రాడు ఏదో రాయి విసిరినట్టుగా వచ్చాడు.
    "అందమైన ఆడపిల్ల అందుబాటులో వుంటే అడగవలసిన నాలుగూ అడగకుంటే తప్పుకదా" అనే సిద్ధాంతం అతనిది.
    తిరిగి వాళ్ళింటినుంచి వస్తున్న జయప్రదని చూసి అతను అక్కడనుంచి కదలి దగ్గరలోవున్న చెట్టుచాటుకి తప్పుకున్నాడు.
    ఐయిదు నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళకొచ్చిన జయప్రద కళ్ళు అతనికోసం వెదికాయి
    "పాపం! వెళ్ళిపోయాడు కాబోలు" అనుకుంది.
    ఆమె పెదవులపై చిరుదరహాసం వెలిసింది.
    కళ్ళు అటూ ఇటూ వెదికాయ్.
    "ఫరవాలేదు ఈమాత్రం రెస్పాన్స్ చాలు, పిట్టని లొంగదీయొచ్చు" అనుకున్నాడు.
    నీళ్ళబిందె చంక నెత్తుకుని కదిలింది ఆమె.
    "మళ్ళీ వస్తావుగా అప్పుడు కనిపిస్తాలే" అనుకున్నాడు తనలో తనే తిరిగి చూసిన జయప్రదని గమనించి.
    రోడ్డుని దాటబోతున్న ఆమెకి ఓ గజం దూరలో ఆగింది సైకిల్. సైకిల్ పై కూర్చున్న యువకుడు "ఏమండీ సుందర్రావుగారిల్లు ఎక్కడో చెపుతారా" అని ప్రశ్నించాడు.
    "ఎవరా యీ కొత్తబంధువు?" అనుకుని తలెత్తి చూసింది.
    "జయా!"
    అతనెవరో గుర్తుకురాలేదామెకి.
    జవాబు చెప్పకుండా కదిలింది ఇంటికి.
    వెనుకే వెళ్ళాడతను.
    "అమ్మా! ఎవరో వచ్చారు చూడు" అంది నీళ్ళబిందె దించుతూ జయప్రద.
    "ఎవరమ్మా" అని మిషన్ ముందునుంచి లేచి బయటికి రాబోతున్న అన్నపూర్ణకి యెదురుగా ప్రతాప్.
    "అత్తయ్యా!"

 Previous Page Next Page