మరణం అంటే ఓ వ్యక్తి నిశ్శబ్దంగా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడమే కదా!
కానీ నిశ్శబ్దం ఎంత విషాదకరం?
విరజ మరణం నుంచి కోలుకోలేక పోయాడు అభినయ్. హాస్పిటల్ వాళ్ళు, విరజ సెల్, ఆడియో కేసెట్ అభినయ్ కు అందజేశారు.
అభినయ్ ను అహర్నిశలూ కనిపెట్టుకు ఉంటోంది కాదంబరి. ఎప్పుడూ విరజ ఫోటో ముందు కూచొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నాడు అభినయ్.
అతనికి విరజ జ్ఞాపకాలు వ్యాపకాలయ్యేయి. ఓ రోజు సాయంత్రం అభినయ్ ఆలోచనలను డైవర్ట్ చేయడానికి అలా టాంక్ బండ్ దగ్గరికి తీసుకువెళ్ళింది కాదంబరి.
అక్కడ ఓ చోట పువ్వులు అమ్ముతున్నారు. అతనికి వైజాగ్ లో విరజ తనని పువ్వుల కోసం నాలుగు రూపాయలు అడగడం గుర్తొచ్చింది. వెంటనే అనాలోచితంగా, అప్రయత్నంగా పర్సులో నుంచి డబ్బులు తీసి పువ్వుల మాల కొన్నాడు.
కాదంబరి ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది.
'కాదంబరీ.... నీకు తెలుసా.... విరజకు పువ్వులంటే ఎంతో ఇష్టం. అందులోనూ నేను కొనిపెడితే మరింత ఇష్టం.... నేను వెళ్ళి విరజకు పువ్వులు ఇచ్చి రానా?' అనడిగాడు.
కాదంబరి మాట్లాడలేదు. అతని చేతులు గట్టిగా పట్టుకుంది.
* * *
అర్దరాత్రి సడెన్ గా లేచి 'విరజా!' అని అరుస్తాడు. తనలో తనే విరజతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతాడు. ఏ పనీ చేయాలని అనిపించడం లేదు.
ఎన్ని ఉషోదయాలు అందంగా మొదలయ్యేయి.
ఎన్ని సాయంత్రాలు తనతో కలిసి అడుగులు వేసింది.
ఎన్ని రాత్రిళ్ళు స్వీట్ నథింగ్స్ చెప్పుకున్నారు.
'పెళ్ళయ్యాక నిన్నెప్పుడూ విడిచిపెట్టను. నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను....' అంటూ తనను చిన్నపిల్లలా కరచుకుని పడుకునేది.
ఒకప్పుడు అమృతప్రాయమైన ఆమె జ్ఞాపకం ఇప్పుడేమిటి....స్మృతి ఘాతమై తన గుండెను గాయం చేసేస్తూంది.
ఆ ఇంట్లో ప్రతి మూల, ప్రతీ అంగుళం తనూ, విరజ కలిసి అడుగులు వేసిన జ్ఞాపకమే....
శిథిల జ్ఞాపకమా.... నీ స్మృతికే చితి పేర్చావా? వ్యాకుల హృదయమా.... నీ వ్యధనే ఎదకోతగా మిగుల్చుకున్నావా?
* * *
'సార్... మీ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు.... పేరు వేలాయుధమట' వాచ్ మేన్ వచ్చి చెప్పాడు అభినయ్ తో.
'పంపించు' అన్నాడు అభినయ్.... విరజ పటానికి పూల మాల వేస్తూ.
'నమస్తే సార్!' వేలాయుధం లోపలికి వచ్చి అన్నాడు.
'నమస్తే.... ఇంతకీ మీరు...?'
'నా పేరు వేలాయుధం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ని.... సెప్టెంబర్ పదకొండున, విరజ మేడమ్ రాంగ్ రూట్ లో వేగంగా వెళ్ళారు. తను అర్జంట్ గా ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలని, ఫైన్ కూడా ముందే కట్టి వెళ్ళారు. కానీ....' వేలాయుధం మొహంలో విచారం....
ముందుకు దూసుకువెళ్ళిన మేడమ్ కారు, యాక్సిడెంట్ కు గురైంది. నేనే హాస్పిటల్ కు ఫోన్ చేసి అంబులెన్స్ ని రప్పించాను. నేను చూస్తూండగానే ఆ ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత మా మామగారికి సీరియస్ గా ఉందంటే, మా వూరెళ్ళి... ఇవ్వాళే వచ్చాను. స్టార్ హాస్పిటల్ కు వెళ్తే తెలిసింది మేడమ్ గారు పోయారని...' అతని గొంతు గాద్గదికమైంది. ఆపైన మాట్లాడలేక పోయాడు.
అభినయ్ అతడ్ని కూచోమన్నాడు.
అతను కూచోలేదు. అతని భుజానికి ఓ సంచి వేలాడుతూ ఉంది. అందులో నుంచి 'ఒక గుండె సవ్వడి' బొమ్మ తీసి అభినయ్ కు అందించాడు.
'మేడమ్ కు యాక్సిడెంట్ అయినప్పుడు కారులో ఆమె సీటు పక్కనే ఉంది సార్ ఈ బొమ్మ.... నేనే తీసి పెట్టాను....'
అభినయ్ ఆ 'ఒక గుండె సవ్వడి' బొమ్మ వంక చూశాడు.
ఆ బొమ్మ రంగులు మారుతూ ఉంది. ఏడు రంగులు మారగానే గుండె బొమ్మకు ఉన్న షట్టర్స్ వాటంతటవే ఓపెన్ అయ్యాయి. లోపల 'ఒక గుండె సవ్వడి' అనే రేడియో అక్షరాలు మెరుస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఆ బొమ్మకు అమర్చిన చిప్ ద్వారా మాటలు వినిపిస్తున్నాయి.
'అభీ.... ఇది నా గుండె సవ్వడి.... ఇది ఒక గుండె సవ్వడి....'
విరజ గొంతులో నుంచి అమృతప్రాయమైన మాటలు ఒక గుండె సవ్వడి బొమ్మలో నుండి జీవం పోసుకున్నట్టు.....
'సార్.... ఇవి యాక్సిడెంట్ అయినచోట, కొద్దిదూరంలో వున్న షాపులో కొన్నారు.... నాకు బాగా గుర్తు. డిస్ ప్లే కోసం తెచ్చిపెట్టారు. ఇంకా మార్కెట్ లోకి కూడా రాలేదా పీస్.... మేడమ్ పెద్ద మొత్తం ఇచ్చి కొన్నారట...' వేలాయుధం చెబుతోంటే, అలానే వింటుండి పోయాడు అభినయ్.
ఆ 'ఒక గుండె సవ్వడి' బొమ్మను తను గుండెలకు హత్తుకున్నాడు. రక్తం ఎండిన మరకలున్నాయి ఆ బొమ్మ మీద.
'సార్.... నాకు సెలవిప్పించండి....' అంటూ జేబులో నుండి డబ్బు తీసి అభినయ్ చేతిలో పెట్టాడు.
'ఆ రోజు మేడమ్, తను రాంగ్ సైడ్ లో వెళ్తున్నందుకు ముందుగానే కట్టిన ఫైన్... నేనింకా రసీదు కూడా ఇవ్వలేదు.... ఆ దేవుడే రాంగ్ రూట్ లో మేడమ్ ని తీసుకువెళ్ళాడు సార్.... ఫైన్ కట్టాల్సింది మేడమ్ కాదు.... ఆ దేవుడు...'
అభినయ్ కు దుఃఖం పొంగుకు వచ్చింది. ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వంక అభిమానంగా చూసి, అతని చేయి అభిమాన పూర్వకంగా నొక్కి వదిలాడు.
'థాంక్యూ ఫ్రెండ్..... నా విరజను చివరిసారిగా చూసే అదృష్టం నీకు దక్కింది. కొద్ది క్షణాల పరిచయంలోనే నువ్వు ఇంతగా కదిలిపోయావు. నేను.....నేను మూడేళ్ళుగా రోజుకు ఇరవై నాలుగ్గంటల పర్యంతం తనతోనే ఉన్నాను. అయినా నన్ను వదిలేసి వెళ్ళింది.....'
'సార్.... మీకు నేను చెప్పగలిగేటంత వాడిని కాను..... మిమ్మల్ని ఓదార్చలేను కూడా.... కానీ, ఎందుకో నాకు ఒకటనిపిస్తోంది సార్.... ఆ మేడమ్ చావలేదు. ఎందుకో తెలుసా సార్.... చనిపోయే ముందు కూడా మిమ్మల్నే కలవరించారు. ఆ మేడమ్ గుండె మీ కోసమే తల్లడిల్లింది.' వేలాయుధం అంతకుమించి మాట్లాడలేక పోయాడు. అతని గొంతు బాధతో పూడుకుపోతోంది.
మౌనంగా అక్కడ్నుంచి కదిలాడు వేలాయుధం.
* * *
రాత్రి పది దాటింది.
తన గదిలో మౌనంగా విరజ ఫోతోవైపు చూస్తూ నేల మీద గోడకు ఆనుకొని కూచున్నాడు అభినయ్. అతని చేతిలో ఒక గుండె సవ్వడి బొమ్మ ఉంది. అది రంగులు మారుతూ ఉంది.
విరజే తన ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు ఉంది.
'విరూ.... నన్నెందుకే వదిలి వెళ్ళిపోయావు.... నేనేమై పోవాలనుకున్నావు..... చూడు.... నీ కోసం ఇలా పిచ్చివాడినయ్యాను. నాతో మాట్లాడాలని అనిపించడం లేదా? నన్ను ఓదార్చాలని అనిపించడం లేదా? నా కంట్లో నలక పడితేనే భరించలేక పోయేదానివి.... నా మనసుకి ఇంత పెద్ద గాయాన్ని ఎలా చేశావు?
అతని ప్రశ్నలు దేనికీ జవాబు చెప్పడానికి అక్కడ విరజ లేదు, రాదు.
అతని కళ్ళ వెంబడి గోరువెచ్చని నీళ్ళు అతనికి తెలియకుండానే జారిపోతున్నాయి. దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. అతను మౌనాన్ని ఆశ్రయించాడు. ఆ మౌనం అంతర్ఘర్షణతో భేటీ పడుతోంది.
అర్ధరాత్రి వరకూ అలానే ఉండిపోయి, విరజ ఆలోచనలతో మగతగా నిద్రలోకి జారుకున్నాడు. ఒక గుండె సవ్వడి బొమ్మ మాత్రం అతని చేతుల మధ్య, అతని గుండె దగ్గర బందీ అయి ఉంది పదిలంగా, అతి పదిలంగా తన గుండెకు అపురూపంగా అన్నట్టు అమర్చుకున్నాడు ఆ బొమ్మను.
తన గుండెను, ఒక గుండె సవ్వడి స్పృశిస్తోన్న ఫీలింగ్!
* * *
దిగ్గున లేచింది అద్వైత. తననెవరో గట్టిగా హత్తుకుంటున్న ఫీలింగ్ .
కళ్ళు తెరిచి చుట్టూ చూసింది.
ఏదో అలజడి....
ఏదో కదలిక....