Previous Page Next Page 
మణిదీపం పేజి 35

    చివ్వున వెనుదిరిగేసరికి బారెడు జడ పిరుదులమీద నృత్యం చేసింది.

    అక్క కూతురుతోనో, మామకూతురుతోనో మాట్లాడుతున్నంత సరదాగా వుంది. తన వయసునీ, హోదానీ మరిపిస్తున్న ఈ పిల్ల ఏక్ దిన్ కా రాజాలా ఏక్ దిన్ కా నౌకర్!

    మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు అరవింద్. బాగా ఆకలితో డైనింగ్ టేబిల్ ముందు కూర్చొన్న అతడికి అమృతతుల్యమైన వంటకాలతో స్వాగతం చెప్పింది అరుణోదయ.

    ఒక్కో డిష్ మూతతీసి వడ్డిస్తుంటే కమ్మటి వాసనలతో నోరూరిస్తున్నాయి వంటకాలు.

    "బాబోయ్! ఇన్ని వంటకాలా? ఇవన్నీ నువ్వే చేశావా?" సంభ్రమం వ్యక్తం చేశాడు.

    "నేనే చేశాను. అమ్మగారిని అస్సలు వంటింట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. హాయిగా విశ్రాంతి తీసుకోమన్నాను. పాపం, ఆవిడకి కోడలు లేదు. ఆ లోటు ఈ ఒక్క రోజు నేను తీరుస్తానని చెప్పాను. హాయిగా దేవుడికి వత్తులు చేసుకొంటూనొ, భాగవతం చదువుకొంటూనో వుందామన్నాను."

    "కోడలు లేని లోటు అమ్మకే తీరుస్తావా...."

    "ఇంకెవరికి తీర్చాలి?"

    "అమ్మకి కోడలు లేదంటే నాకు భార్య లేనట్టేకదా?"

    "మీరేదో జంటిల్ మేన్ అనుకొన్నానే! మగబుద్ది పోనిచ్చుకొన్నారుకాదు."

    "సారీ" ముఖం సీరియస్ గా పెట్టుకొని గబగబా తినడం మొదలుపెట్టాడు.

    "కోపం వచ్చిందా?" కప్పులో జామూస్ వేసిపెడుతూ అడిగింది.

    "నాకెందుకు కోపం? ఏదో మైకం కమ్మిన నాకు కొరడా చురక తగిలించి నేనేమిటో గుర్తుచేసినందుకు థాంక్స్."

    "మీరు ముఖం సీరియస్ గా పెట్టుకుంటే నాకెలాగో వుంది. ప్లీజ్, మామూలుగా వుండండి. ఇంతకీ వంట ఎలా వుందో చెప్పలేదు."

    "బాగుంది."

    "అదిగో! కోపం పోలేదు."

    "బాగుందన్నానుకదా?"

    "వట్టి బాగేనా?"

    "చాలా బాగున్నాయి. సరేనా?"

    "పుదీనా ఆకు మీకు నచ్చుతుందా? ఆలుబొండాలో వేశాను" ప్లేట్ లో నాలుగు బొండాలు వుంచి అన్నం పళ్ళెం దగ్గరగా జరిపింది.

    "నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు ఒక్క బోండా కూడా తినలేను. కడుపు నిండిపోయింది."

    "అప్పుడే హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తే ఎలా? పాయసం చేశాను."

    "వంటల్లో ప్రావీణ్యమంతా ఒక్కసారే చూపిస్తే ఎలా నలకుమారీ? జానెడు పొట్ట ఇది. బకాసురుడికి విందు చేస్తున్నట్టుగా ఇన్ని వంటకాలు. ఇప్పటికే భుక్తాయాసం వచ్చింది" అంటూ చెయ్యి కడిగేసుకొన్నాడు.

    మధ్యాహ్నంవేళ పడుకొనే అలవాటులేదు. కాని, కడుపునిండా తినేసరికి భుక్తాయాసం వచ్చినట్టుగా అయింది అరవింద్ కి. పక్కమీద వాలేసరికి నిద్రపట్టేసింది. మళ్ళీ నాలుగింటికిగాని మెలకువ రాలేదు.

    గబుక్కున లేచి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి టవల్ తో తుడుచుకొంటూ కిటికీ దగ్గర నిలబడ్డాడు.

    రోజూ ఆ సమయంలో చెట్లకి నీళ్ళుపెట్టే తండ్రి తోటలో ఓ పక్కన నిలబడి అరుణోదయతో కబుర్లు చెబుతున్నాడు. ఆయన చేతిలో వుండాల్సిన నీళ్ళ పైపు ఆమె చేతిలో వుంది. నడుముకి కొంగుచుట్టి, చీర కుచ్చిళ్ళు బొడ్డు దగ్గర దోపి చెట్లకి నీళ్ళు పడుతున్నది.

    పక్కవాటుగా చూస్తుంటే అచ్చు బాపూబొమ్మలా వుంది. నల్లనాగులా వీపున పొడవాటి జడ, చివర వంకీలు తిరిగి జాకెట్ కీ చీరకీ మధ్య ఆచ్చాదనలేని శరీరం నడుం దగ్గర కొద్దిగా వంపు తిరిగి మల్లెపువ్వులోని సుతిమెత్తదనాన్నీ, గులాబీలోని సొగసునీ సంతరించుకొన్నట్టుగా వుంది. మాట్లాడుతుంటే ఆమె చెవికున్న జూకా తమాషాగా ఊగుతోంది. పాదాలను ముద్దిడుతున్నట్టుగా పాంజీబులు.

    ఎవరితోటీ ఎక్కువ మాట్లాడని తండ్రి ఆమెతో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. చాలారోజుల తరువాత ఆయన ముఖంలో నవ్వు చూస్తున్నాడు.

    అరుణోదయలో ఏం మహత్తు వుంది?

    అమ్మ కళకళలాడుతోంది. నాన్న నవ్వుతూ మాట్లాడుతున్నాడు.

    తనూ ఆమెముందు కుర్రాడైపోతున్నాడు.

    నిశ్శబ్దంగా వుండే ఇంట్లోకి ఎక్కడినుండో ఒక సుమధురమైన పాట ప్రవేశించిన అనుభూతి.   

 Previous Page Next Page