Previous Page Next Page 
మధుకీల పేజి 35

    "ఇదంతా మనది కదూ?"
    "మనదే! ఎప్పుడు? ఆయనిచ్చినపుడు. రోజులు బాగ లేక ఆయన గెటౌట్ అంటే మనం బజార్లో నించోవాలి? ఆ ఇల్లయినా వుంటుందనుకుంటే అదీ తన పేర్న వ్రాయించుకున్నాడోయ్!"
    "ఆరోజు మీరే అన్నారుగా అలా చెయ్యమని"
    "అవుననుకో - ఏదో లీగల్ అబ్ జక్షన్ చెప్పాడు. తర్వాత ఐనా నీ పేర్న మార్చచ్చుగా"
    "బావుంది మీమాట, సమయమూ సందర్భమూ లేకుండా అలా ఎవ్వరూ చేయరు. ఐనా మీ పిచ్చిగానీ మానాన్న కెవరున్నారు. అంతా మనది! మీరు ఆలోచనలు మాని టిఫిన్ చేద్దురుగాని రండి" అని వెళ్ళింది.
    మధు భార్యని అనుసరించాడు.
                            *        *        *
    "వసంతా!"
    "అవును సుధాకర్! నిశ్చయంగా నీ నిర్ణయం నా కొరకు తెలియాలి. చెప్పు!"
    నిట్టూర్చేడతను. "తప్పదా?" అని అడిగేడు.
    "అవును!"
    "వసంతా నన్ను పెళ్ళి చేసుకుని సుఖపడలేవు."
    "ఏం? నీకేం లోపం?"
    "శారీరకంగా-మానసికంగా-ఆర్ధికంగా లోటు ఏమీలేదు"
    "మరి?"
    "సాంఘికంగా నేను పనికి రానివాడిని"
    "ఉద్యోగం లేదనా"
    "కాదు---"
    "ఇదిగో యీ ఇంటర్వ్యూ సంభాషణ మానేసి సూటిగా చెప్పు.ఇష్టం లేదా? నీకు"
    నీపై ముందు ప్రేమ లేకపోయినా తర్వాత తర్వాతనే పరిచయం ముదిరినకొద్దీ నిన్ను విడిచి జీవించ లేనన్నంతగా మారిపోయాను.
    "కానీ నీకు తెలీకుండా ఒక ఘోరం జరిగిపోయింది"
    "ఏమైంది?"
    "మనం యధేచ్చగా తిరిగిన తిరుగుళ్ళు కొందరికి తెలిశాయి"
    "తెలియనీ-భయమేం. మనం కాబోయే భార్య భర్తలం"
    "కావచ్చు కాని ఒకతను మన విహారాలు ఫోటోలు తీశాడు. నన్ను బెదరించి లొంగతీసుకున్నాడు. నాతో మా ఇంట్లో దొంగతనం చేయించాడు, డబ్బు పోతే పోయిందని ఇచ్చాను. అదీ ఫోటో తీశాడు.
    తర్వాత బ్లాక్ మెయిలింగ్ మొదలైంది.
    నన్ను పావుగా వినియోగించుకుంటున్నారు వాళ్ళు.
చేసే దొంగ వ్యాపారాలకి నన్ను వాడుకున్నారు.
    ప్రతీదీ రికార్డెడ్ గా చేశాడు.
    ఈరోజు ఏ క్షణంలో నేను దొరికినా నా కేసుకి విచారణ లేదు.
    ఏదైనా నేను కారాగార జీవితం గడపక తప్పదు.
    ఇప్పుడు చెప్పు. ఈ పరిస్థితులలో నేను నిన్ను పెళ్ళి చేసుకోగలనా? చేసుకుని నిన్ను బాధించటం ధర్మమా? నా వల్ల నీనిండు జీవితం నాశనం కావటానికి నేను సహించలేను. వసంతా! అందుకే హాయిగా నీకు మీవాళ్ళు చూసే సంబంధం చేసుకో-సుఖపడు.
    మీ వాళ్ళని కాదని సుఖమేముంది చెప్పు?"
    వసంతపై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయ్. భయం-దుఃఖం-ఆందోళన, ఆరాటం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయ్.
    "ఏడ్వనీ-మనస్సయినా శాంతిస్తుంది" అనుకుని లేచివెళ్ళాడు సుధాకర్.
    సాయంకాలం ఆరు గంటల సమయ
    రైల్వే ప్లాట్ ఫారంపై చిరాకుగా పచార్లు చేస్తున్నాడు సుధాకర్.
    లైట్లు వెలిగాయ్.
    గడియారం చూసుకుని 'మరోపది నిముషాలు' అనుకున్నాడతను. హిగన్ బాదమ్స్ వద్దకు వెళ్ళి పత్రికలు తిరగేశాడు. రంగురంగుల అట్టలతో అందమైన సినిమావాళ్ళ ముఖ చిత్రాలతో కన్నెపిల్లల్లా కలకల్లాడుతూ వున్నాయ్ పత్రికలు. ఏదైనా కొని ఓ వారగా కూర్చుని చదువుదామా అనుకున్నాడు.
    అంతలో బెల్లు ఐంది. తిరిగి ప్లాట్ ఫారం మీదికి వచ్చేడు. మరో రెండు నిమిషాల్లో ట్రైన్ వచ్చేసి ఆగింది. పరుగుపందెంలో వచ్చిన వాడిలా బుసలు కొడుతోంది ఇంజన్.
    ఇంజన్ ఆనుకునివున్న పెట్టె వద్దకి వెళ్ళాడతను,
    అదే సమయంలో సుధాకర్ ఎదురు చూస్తున్న వ్యక్తి దిగాడు,
    గుర్తుగా అతను కట్టుకున్నటై సుధాకర్ని గుర్తింపజేసింది.

 Previous Page Next Page