అభినయ్ పక్కనే కాదంబరి కూచొని ఉంది.
ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. కాదంబరిని అసలు విషయం అడిగితే, ఏది వినాల్సి వస్తుందేమోనన్న భయంతో ఏమీ అడగలేదు. అభినయ్.
విరజ ప్రస్తావన తెస్తే అతనెక్కడ బరస్టయి పోతాడేమోనన్న భయంతో నోరు విప్పలేదు కాదంబరి.
* * *
కారు స్టార్ హాస్పిటల్ ముందాగింది.
సరిగ్గా అదే సమయంలో, మరోకారు హాస్పిటల్ ప్రెమిసెస్ నుంచి బయటకు వెళ్తోంది. ఆ కారులో డాక్టర్ సిద్దార్ధ, మహాపతి, ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఉన్నారు. మరో మూడు నెలలపాటు హాస్పిటల్ కు రాకూడదన్న నిర్ణయంతో స్టాఫ్ కు సీరియస్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తున్నాడు డాక్టర్ సిద్దార్ధ.
ఆ వెనుకే అంబులెన్స్ లో ఎమర్జన్సీ ఎక్విప్ మెంట్ తో అద్వైతను తరలిస్తున్నారు.
ఆ క్షణం అద్వైత గుండె విచిత్రమైన ఉద్వేగానికి గురైంది. అద్వైతకు ఊపిరి పోసిన విరజ గుండె కదా అది మరి!
* * *
మార్చురీ డోర్ ఓపెన్ చేశాడు బాయ్.
తడబడే అడుగులతో, గుండెను చిక్కబట్టుకొని లోపలికి నడిచాడు అభినయ్. ఆ వెనుకే కాదంబరి.
బాడీ ఫ్రీజర్ లో విరజ డెడ్ బాడీ.
కన్నీటి భాష్పం ఉత్తుంగ కెరటమై, కల్లోల సాగరమైంది. ఆమె మృతదేహం....అతడి గుండెని తల్లడిల్లేలా చేసింది. దిగంతాలు దాటిన ఆమె ఊపిరి.... అతడ్ని దిగ్భ్రాంతున్ని చేసింది. ఆమె ముందు అతను మోకరిల్లేడు.
అతని రెండు చేతులూ విరజ మొహాన్ని స్పృశించాయి. హిమవత్పర్వతమే ఆమె శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు చల్లబడింది. చల్లదనాన్ని ఊపిరిగా పోసుకొని, తన ఊపిరిని ఆవిరిగా మార్చుకొని..... నిర్వీర్యమైన ప్రాణం.... నిర్జీవమైన దేహం....
ఆ కళ్ళు చిలిపిగా ఊసులాడ్డం లేదు.
ఆ పెదవులు అల్లరి చేయడం లేదు.
ఆ చేతులు శరీరాన్ని చుట్టేయడం లేదు.
మొత్తంగా ఆ శరీరమే పని చేయడం లేదు. అచేతనంగా ఉంది.
ఒక శరాఘాతం, అతని గుండెను రక్తసిక్తం చేసింది.
ఒక మృత్యు కరవాలం, అతని అమృతప్రాయ భావాలను తునాతునకలు చేసింది.
ఒక విషాద హస్తం అతని అనుభూతులను వెంటాడి, వెంటాడి నిర్వీర్య పరిచేయి.
* * *
'విరూ.... ఏయ్ విరూ.... ఏమిటే అలా పడుకుండి పోయావ్.... కామెడీనా....నవ్వు... ప్లీజ్.... నవ్వు విరూ.... నువ్విలా మౌనంగా ఉంటే నేను భరించలేను.....నేను ఏడ్చేస్తానంతే.'
అరె.... మాట్లాడవేంటి.... చూడు కాదంబరీ.... మీ మేడమ్ నన్నేడిపిస్తోంది. మాట్లాడమని చెప్పు. మేడమ్.... మీరు మాట్లాడకపోతే సార్ తట్టుకోలేరు, ప్లీజ్ మాట్లాడండి మేడమ్ అని చెప్పు...' విరజ చేతుల్ని తన చెంపకు ఆన్చుకుంటూ అన్నాడు అభినయ్.
ఆ చేయి ఎప్పుడో కట్టెలా బిగుసుకు పోయింది. అతికష్టమ్మీద ఆ చేతి దగ్గరికి తన తలను తీసుకువెళ్ళాడు. చల్లగా ఉన్న ఆ చేయి... ఏ భావాలనూ తర్జుమా చేయలేకపోతోంది.
విరజ శరీరం మరింత తెల్లబడి పాలిపోయింది. శరీరం ఉబ్బినట్టుగా అనిపిస్తోంది.
అభినయ్ అలానే విరజ మొహం వైపు చూస్తుండిపోయేడు. ఎప్పుడు విరజ కళ్ళు తెరుస్తుందోనన్న ఆశ...
'ఏయ్.... విరూ... మాట్లాడు విరూ.... నీ అభిని వచ్చాను విరూ... అలా టాంక్ బండ్ వరకూ వెళ్ళొద్దామా? పోనీ, నీకిష్టమైన మిరపకాయ బజ్జీలు తీసుకురానా? ఎంతసేపలా పడుకుండి పోతావ్....'
'సార్...' కాదంబరికి ఏడుపును ఆపుకోవడం కష్టమై పోతోంది. అభినయ్ మానసిక పరిస్థితి ఆమెకు అర్ధమవుతూ ఉంది.
వాస్తవాన్ని అంగీకరించలేని పరిస్థితిలో భ్రమతో రాజీ పడుతున్నాడు.
విరజ బ్రతికి ఉన్నట్టే అనిపిస్తోంది. ఆ మొహం ఎంత ప్రశాంతంగా ఉంది. కానీ, ఆ మొగం పరీక్షించి చూస్తే, ఏదో విచారం... దిగులు.... బహుశ తన కిష్టమైన వ్యక్తిని వదిలి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నందుకు కాబోలు...
* * *
'సార్.... మేడమ్ డెడ్ బాడీ ని తీసుకువెళ్దామా?'
ఒక్కసారిగా ఆమె చెంప చెళ్ళుమంది. అభినయ్ కళ్ళు ఎరుపెక్కాయ్.
'ఏమన్నావ్.... మేడమ్ డెడ్ బాడీనా... ఆర్యూ మాడ్ మేడమ్ చనిపోవడమేంటి? షీ ఈజ్ ఎలైవ్... చూడు... ఎలా పడుకుందో.... అలసిపోయి ఉంది.... ఆ చేతులు చూడు ఎలా పెట్టుకుంది.... చూడు.... పరీక్షగా చూడు కాదంబరీ... అప్పుడప్పుడు ఓ కన్ను తెరిచి దొంగలా చూస్తోంది....'
'సార్...' అభినయ్ భుజాలు పట్టి కుదుపుతూ అంది. తనని అభినయ్ కొట్టినందుకు ఆమెకు ఏ మాత్రం బాధలేదు. అభినయ్ భ్రమ నిజమైతే బావుండనిపిస్తోంది.
'సార్.... ప్లీజ్.... కళ్ళ ముందు కనిపించే నిజాన్ని నమ్మండి. మేడమ్ మనకిక లేరు సార్' కాదంబరి అనునయంగా అంది అభినయ్ తో.
'అంటే.... విరజ చ...ని....పోయిం....దా?' అభినయ్ గొంతులో అన్ని భావాలు ఏకకాలంలో పలికేయి.
వస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, అవునంటూ.... తలూపింది.
అభినయ్ విరజ మొహం దగ్గరికి తన మొహాన్ని చేర్చాడు.
'విరూ.... నువ్వు చచ్చిపోయావా? చెప్పు విరూ....నన్ను వదిలేసి నువ్వు చావడమేంటి విరూ.... నువ్వు చచ్చిపోతే నేనెలా బ్రతుకుతాను.... ఆ సంగతి నీకు తెలియదా? పొద్దున్నే నాకు బ్రష్షెవరిస్తారు, నేను తల దువ్వుకుంటుంటే, నా జుట్టును అల్లరిగా ఎవరు చెరిపేస్తారు?'
కాదంబరికి భయమేస్తోంది..... ఇంకాసేపు ఇలానే వుంటే అభినయ్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవడం తప్పనిసరి.
వెంటనే హాస్పిటల్ సూపర్నెంట్ ని కలిసింది.
* * *
అభినయ్ ని ఆపడం చాలా కష్టమైంది.
విరజ అంత్యక్రియలు జరిగిపోయాయి.
అభినయ్ తనకు తలకొరివి పెట్టాలన్న విరజ చివరి కోరిక ప్రకారం అలా జరిగింది.
చితి మీద విరజను చూడ్లేక పోయేడు అభినయ్. విరజ శరీరం తగలబడుతున్నంతసేపూ నలుగురు వ్యక్తులు అభినయ్ ని ఒడిసి పట్టుకోవాల్సి వచ్చింది.
ఎప్పుడో తెల్లవారుఝామున విరజ శరీరం బూడిదగా అయ్యేవరకూ అలానే అక్కడ స్మశానంలో వున్నాడు అభినయ్.
కాదంబరి అభినయ్ ని కనిపెట్టుకొని అతనితో పాటే ఉంది. తెల్లవారబోతుండగా అభినయ్ ని ఒడిసిపట్టుకున్న నలుగురు వ్యక్తులు అతడిని విడిచిపెట్టారు.
విరజ చితి దగ్గరికి వెళ్ళాడు అభినయ్.
ఆమె శరీరం మొత్తం తగలబడిపోయింది.
'విరూ.... మొత్తంగా బూడిదగా మారావా? నన్ను వదిలి బూడిదై పోయావా?' అంటూ అతను ఆ బూడిదలో పడిపోయేడు. కాదంబరి వారించినా విన్లేదు.
ఒక విధమైన హెలూసినేషన్ లో ఉండిపోయాడు. అతని చేతులు ఆ బూడిదను తడుముతున్నాయి. బూడిద ఇంకా వేడిగానే ఉంది.
'విరూ.... ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తూ వుండే నీ మెదడు చిట్లిపోయింది కదూ.... నన్ను చుట్టేసే నీ చేతులు ఎముకలుగా మిగిలి, విరిగిపోయేయి కదూ....పాపిష్టివాణ్ని నిన్ను బూడిదగా మార్చేసాను నిర్దయగా....' అతను ట్రాన్స్ లో ఉన్నట్టు ఏడుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు.
అభినయ్ ను ఊరడించడంలో అమ్మే అయింది కాదంబరి.