ఆయన యింకా సందేహం తీరనట్టుగా భార్య దగ్గరికి వెళ్ళి, "ఆ అమ్మాయి అంత నాజూకుగా, నాగరీకంగా వుంది. పనేం చేస్తుంది? ఏమిటో ఆ పిల్లను చూస్తే నాకనుమానంగా వుంది. ఎలాంటిదో ఏమో! ఓ కంట కనిపెట్టి వుండు" అన్నాడు.
వరుసగా గదులు చిమ్ముతూ అరవింద్ గదిలోకి అడుగుపెట్టింది అరుణోదయ. అతడింకా నిద్రనుంచి లేవలేదు.
"రాత్రి ఎమర్జెన్సీ కేసు వచ్చిందని హాస్పిటల్ కి వెళ్ళి తెల్లవారు ఘామున వచ్చి పడుకున్నాడు. చప్పుడు చేయకుండా ఊడ్చి వచ్చెయ్యి" చెప్పింది అరుంధతమ్మ.
క్షణం క్రితమే ఎవరో సర్దినట్టుగా నీట్ గా వుంది గది. అద్దంలా వున్న ఆ గదినిబట్టి చెప్పొచ్చు అతడు ఎంత క్రమశిక్షణగల వ్యక్తో.
చెంపక్రింద చెయ్యి పెట్టుకొని ఒక ప్రక్కకు ఒత్తిగిలిపడుకొన్న అతడు మంచి నిద్రలో వున్నట్టుగా ప్రశాంతంగా వుంది ముఖం. నిద్రలో ఇనుమడించిన అందంలో కనిపిస్తున్న అతడిని రెప్పార్పకుండా చూసింది.
శబ్దం కాకుండా గది ఊడ్చి, ఫ్లవర్ వాజ్ లో వాడిపోయిన పువ్వులు తీసేసి తోటలో పూసిన రకరకాల పువ్వుల్ని ఆకుల్ని కోసుకొచ్చి ఫ్లవర్ వాజ్ లో చక్కగా అమర్చి కదిలేసరికి అతడు మంచంమీద లేచి కూర్చున్నాడు.
"సుప్రభాతం, డాక్టర్ బాబూ."
"తమరిక్కడ! ఓ వచ్చేశారన్నమాట! ఏమిటో....తమాషాగా పందెంకాస్తే."
"నేను మాత్రం తమాషాకి పందెం కాయలేదు."
"కాని, మాకు మాత్రం ఇబ్బంది మీతో పని చేయించుకోవాలంటే."
"అలా ఏమీ ఫీలవకండి. మీ పనులేమిటో నిస్సంకోచంగా చెప్పండి అయ్యగారూ! నన్ను 'మీరు' అని మన్నించక్కరలేదు. 'నువ్వు' అంటే చాలు. 'ఒసే' అన్నా పలుకుతాను. దాసీని కదా."
"ఎంతదృష్టం! ఇంగ్లీషు మాట్లాడే చదువుకొన్న పనిమనిషి దొరికింది" హాస్యంగా అన్నాడు. "నీతో చేయించుకోవాల్సిన పనులు ప్రత్యేకంగా నాకేముంటాయి."
"సత్తెమ్మ మీ బట్టలుతికి ఇస్త్రీ చేస్తుందని విన్నానే."
"ఈ ఒక్కరోజుకు ఉతక్కపోయినా ఫర్వాలేదు."
"అబ్బా! అలా తప్పించుకొందామనుకొన్నారా? అదేం కుదరదు. ఉతకాల్సిన బట్టలేమైనా వుంటే ఇటివ్వండి. అంట్లు తోమాక ఉతికి పెడతాను."
"బనీను, అడ్డపంచ...అదీ స్నానం చేశాక."
"సరే! స్నానం చేశాకే ఉతుకుతాను."
అరవింద్ ముఖప్రక్షాళనం, స్నానం ఒకేసారి ముగించి ఫ్రెష్ గా తయారయ్యాడు హాస్పటల్ కి వెళ్ళడానికి.
ప్లేట్ లో వేడివేడిగా ఇడ్లీలు, గ్లాసుతో నీళ్ళు తీసుకువచ్చి టేబిల్ మీద పెట్టి కుర్చీ సరిగ్గా జరిపింది అరుణోదయ.
"నువ్వెందుకు తెచ్చావు? నేనే వచ్చేవాడినికదా?"
"నేను తాకినవి తినరా ఏమిటి?"
"నీదేంకులమని నేనడిగానా?"
"కులం పట్టింపుకాక ఇంకేదైనా పట్టింపు వుందేమోనని."
"ఇంకేం పట్టింపు లేదుకాని రోజూ అమ్మపెట్టేది టిఫిను."
"ఈ రోజు అమ్మగారికి విశ్రాంతినిద్దామని. వంట కూడా నేనే చేస్తానని చెప్పాను అమ్మగారికి."
"హతోస్మి! నీకు వంట వస్తుందా?" గాబరాగా అడిగాడు.
"ఎందుకా సందేహం?"
"వచ్చిరాణి వంటచేసి మమ్మల్ని పస్తు పడుకోబెడతావేమోనని."
"మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఆడపిల్లవి. ఇంత వయసు వచ్చాక కూడా వంటరాదని ఎలా అనుకొన్నారు? నా చేతివంట వైకుంఠయాత్ర! చెప్పండి, మీకు ఏం తినాలని వుంది?"
"అప్పుడే వైకుంఠయాత్ర చేయాలని లేదు."
"ఏదో ప్రాసకోసం వాడానుగాని చెప్పండి మీకు ఏం తినాలని వుంది? మీకు ఏ వంటకాలంటే ఇష్టం?"
"మామూలు పప్పుచారు చాలు."
"మీకు నామీద అనుమానంగా వున్నట్టుంది వంటోచ్చో లేదోనని. నిజంగా నాకు వంటొచ్చు" సీరియస్ గా చెప్పింది.
"అమ్మని అడుగు! ఆమె చెప్పింది చెయ్యి."
"అలాగే, చిన్నయ్యగారూ" అరుణోదయ నవ్వుకొంటూ వేణుదిరిగింది.
"ఏయ్! నీకేమైనా పిచ్చా? అమ్మగారు, అయ్యగారు....ఏమిటీ పిలుపులు?"
"అదంతే, చిన్నయ్యగారూ."