సుందర్రావు గారితో కూడా మాటాడి వెళ్ళిపోయింది సుధామయి. బస్ స్టాపు దాకా ఇద్దరూ వెళ్ళి బస్సెక్కించి వచ్చారు.
తిరిగి ఇంటికివస్తూ "అన్నయ్యా! నీవు ఆమెగారి ఆశలన్నీ వ్యర్ధం చేశావు" అంది జయప్రద.
"ఏం?"
"నీవు బి.ఏ. పాసై తీరతావని నాతో పందెం కాసింది."
"చదవందేనా?"
"ఏమో మరి?"
"ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు"
"అదేమో కానీ ఆమె ఆశలన్నీ ఖూనీ చేశావు నువ్వు."
విచిత్రంగా చూశాడతను.
"అవును! ఆవిడ నిన్ను పెళ్ళి చేసుకునే వుద్దేశ్యంలో వుండింది."
"జయా!"
"నిజం నిన్ను ఎం.ఏ. చేయించాలన్నది అందుకే.
సుధాకర్ మొఖం మాడిపోయింది.
"జయా! ఈ విషయం ముందుగా తెలియక చాలా ఘోరం జరిగిపోయింది."
"ఇప్పటికైనా ఏం మించిపోయింది?"
"లాభం లేదు జయా! ఇక ఆ అవకాశం తిరిగి రాదు"
నిస్పృహ నిండిన అతని ముఖాన్ని చూసి "ఏమిటా?" అనుకుందామె. అంతలో ఇల్లు సమీపించటంతో సంభాషణ ఆగిపోయింది.
"ఇల్లు అద్దె కిచ్చారా?"
"అవును. ఏం?"
"ఆ యింట్లో"
"ఇదిగో మధూ! ఈ రోజుల్లో కులాల ప్రసక్తి లేదు. మతాల ప్రసక్తి లేదు. మనకు అద్దె ఎక్కువ యిచ్చేవాళ్ళు కావాలి. అంతే!"
"కానీ ఆ యింట్లో ఒకానొక దేవుడూ-దైవమూ పూజా పునస్కరమూ అనుకునే మనుషులు జీవించారు. ఈ రోజు అందులో వుచ్ఛ నీచము తెలియని మనుషుల్ని వుంచటం---"
చిరాకేసింది పాపయ్యకి.
"అయినా పెద్దవాడిని నాకామాత్రం మంచీ చెడూ తెలియదంటావా?" అని అడిగేడు పాపయ్య.
"ఎందుకండి నాన్నగారితో వాదన?"
"ఏం లేదు మనింటికి మనం వెళ్ళిపోదాం"
"విడిగా వుంటావటోయ్ మధూ?"
"అనుకుంట
"లక్షణంగా వెళ్ళిరండి. మీకూ బరువూ బాధ్యతలు తెలిసొస్తాయ్"
"ఏమిటి నాన్నా?"
"నాన్నా లేదూ ఏం లేదు. మీ రాయింట్లో వుంటానంటే ఇప్పుడు వాళ్ళిస్తున్న బడుగ యిచ్చి వుండండి"
"మావయ్యా!"
"ఓర్నీ! ఎందుకంత ఆశ్చర్యం అల్లుడి దగ్గర యింటి అద్దె తీసుకుటాననా? ఇలాంటిచోట నో అల్లుడు- నో ములాఛా మనలో మనకేం అనేది నాకు కుదరదు-అయినా యిదంతా చివరి కెవరికి?"
"వెళ్ళమంటారా అయితే?"
"ఇదిగో మధూ! యీ నాన్పుడు వ్యవహారం నాకు నచ్చదు. నేనూ వెళ్ళమన్లేదు. నీవే కాపరం అన్నావు. ఇప్పుడు మళ్ళీ నన్నే వెళ్ళమంటారా అని అడిగితే ఏం చెప్పేది?"
"ఇదిగో నాన్నా? ఆయనదంతా అదో తరహా? మేము ఎక్కడికీ వెళ్ళం" అంది మణి.
"లక్షణంగా వుండండి నేను వద్దంటున్నానా? ఇదిగో అమ్మాయ్. నా బాల్యం ఎలా గడిచిపోయిందో నా కయితే గుర్తులేదు. కానీ బుద్ధి తెలిసిన రోజునుంచీ నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే కూడుబెట్టటం. అది ఎలా? అనేది నాకు అక్కర్లేదు."
పాపయ్య బయటికి వెళ్ళిపోయేడు.
మధు ముఖం వేలాడేసుకుని కూర్చున్నాడు.
"ఏమండీ! అలా వున్నారేం?" అని ప్రశ్నించింది మణి.
"మణీ మనకిప్పుడు హాయిగా జరిగిపోతూ వుందనుకో కాదనను కాని అన్ని రోజులూ ఒక్కలాగే వుండవు. చూడు! మా నాన్న సంసారం ఎలా అయిపోయిందో?"
"అయితే ఏం చేద్దామంటారు?"
"నెల నెలా జీతం మొత్తం అయన చేతికిచ్చేస్తున్నాం. పాకెట్ ఖర్చులకీ - అవసరాలకీ ఆయన యిస్తున్నాడు. కాదనను. కాని మనదంటూ స్వంతానికేం వుంది?"