'మిస్టర్ సిద్దర్దా! మహాపతి చెప్పింది ఒక విధంగా కరెక్ట్. ఓ డాక్టర్ గా ఓ పేషెంట్ ని కాపాడవల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మోరల్ గా మీరు అబద్దం చెప్పకూడదు. బట్, పేషంట్ ని కాపాడుకోవడానికి ఈ మాత్రం తప్పదు. ఈ పరిస్థితిలో తన ప్రియురాలి గుండెను అమర్చింది అద్వైతకు అని తెలిస్తే, అతను అద్వైత ముందు ఖచ్చితంగా ఎక్సయిట్ అయ్యే అవకాశం ఉంది; ప్రొఫెసర్ రాబిన్ మార్క్ అన్నాడు.
డాక్టర్ సిద్దర్ధకు వాళ్ళిద్దరూ చెప్పింది సబబే అనిపించింది.
అప్పుడే, నర్స్ సెల్ ఫోన్ తీసుకువచ్చి డాక్టర్ సిద్దర్ధకు ఇస్తూ, అభినయ్ ఫోన్ చేసిన విషయం చెప్పింది.
ఒక్క క్షణం చిన్న గిల్టీ ఫీలింగ్ లాంటిది కలిగింది. అద్వైతను కాపాడుకునే ప్రయత్నంలో అతను తన గిల్టీ ఫీలింగ్ ని తనలోనే నొక్కి పెట్టుకున్నాడు.
* * *
అతని మకాం మహాపతి ఫామ్ హౌస్ కు మారింది. రాబిన్ మాస్క్ అద్వైతను అబ్జర్వ్ చేయడానికి, మహాపతి ఫామ్ హౌస్ లో గెస్ట్ గా ఓ వారం రోజులపాటు వుండడానికి ఒప్పుకున్నాడు.
* * *
అర్ధరాత్రి వేళ పిచ్చి పట్టినట్టు నగరం అంతా తిరిగాడు కారులో అభినయ్.
విరజ ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అతను టాంక్ బండ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఓ లారీ అడ్డుగా వచ్చింది. లేకపోతే లారీకి అవతలి వైపు వున్న నుజ్జునుజ్జయిన విరజ కారును చూసేవాడే....
అర్దరాత్రి రెండు దాటుతుండగా, కారును తన ఇంటి గేటు దగ్గరకు తీసుకువచ్చి, గేటు కూడా తీయకుండా, గేటు ముందే వుంచేసి, అలాగే స్టీరింగ్ మీద తలపెట్టి అలసటగా కళ్ళు మూసుకున్నాడు.
* * *
కాదంబరి ఆలోచిస్తూ ఉంది. ఆమెకు నిద్ర రావడంలేదు. అర్ధరాత్రి రెండు దాటింది. విరజ, అభినయ్ ల పెళ్ళి కోసం తీసుకువచ్చిన దండలు టేబుల్ మీద ఉన్నాయి. మేడమ్ ను ఏ హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు? అన్న ఆలోచన ఆమెను వెంటాడుతూ వుంది.
మనవరాలి గదిలో ఇంకా లైటు వెలుగుతూనే ఉండటంతో, బామ్మ కాదంబరి దగ్గరికి వచ్చింది.
'ఏంటమ్మా? నిద్ర పట్టడంలేదా?'
'లేదు బామ్మా... మా మేడమ్ ఏమై పోయారో తెలీడంలేదు. సిటీలోని హాస్పిటల్స్ అన్నింటికీ ఫోన్ చేసి చూశాను'
'మరి, మీ చైర్మన్ అదే, అభినయ్ కు ఫోన్ చచేయక పోయావా?'
తల మీద బండరాయితో బాదుకోవాలన్నంత కోపం వచ్చింది. ఛ.... తనకసలు బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. ఇంత చిన్న ఆలోచన తనకెందుకు రాలేదు?
వెంటనే ఫోన్ చేయడానికి టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకు అభినయ్ సెల్ నెంబర్ తెలుసు. వెంటనే అభినయ్ సెల్ కు రింగ్ చేసింది. ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. మరోసశ్రి రింగ్ చేసింది. ఆమె చాలా టెన్షన్ ఫీలవుతూ ఉంది. క్షణక్షణానికి ఆమెలో టెన్షన్ ఎక్కువవుతూ వుంది.
అలా కంటిన్యూగా రింగ్ చేస్తూ, టేబుల్ మీద వున్న డైలీ పేపర్ పై ఆమె దృష్టి పడింది. హాస్పిటల్ కి సంబంధించిన ఆఫ్ పేజీ యాడ్ అది.
కృతజ్ఞతాభివందనాలు....
మా స్టార్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మా శ్రేయోభిలాషులకు...
ఇంక ఆమె పూర్తి మేటర్ చదవలేదు. కాదంబరిలో ఓ ఐడియా ఫ్లాష్ అయింది.
స్టార్ హాస్పిటల్....
ఈ హాస్పిటల్ పేరు టెలిఫోన్ డైరెక్టరీలో తను చూడ్లేదు. వెంటనే, ఆ హాస్పిటల్ టెలిఫోన్ నెంబర్ చూసింది. అభినయ్ కు చేస్తోన్న ఫోన్ కాల్ కట్ చేసి స్టార్ హాస్పిటల్ నెంబర్ డయల్ చేసింది.
* * *
'స్టార్ హాస్పిటల్' రిసెప్షన్ లో రిసెప్షనిస్ట్ రిసీవర్ లిఫ్ట్ చేసి చెప్పింది.
'విరజ పేరుతో మీ హాస్పిటల్ కుయాక్సిడెంట్ కేసు ఏదైనా వచ్చిందా?' కాదంబరి కంఠం వణుకుతోండగా అడిగింది.
'వన్ సెకన్ ప్లీజ్...' అంటూ రిసెప్షనిస్ట్ రికార్డు తిరగేసి...
'యస్.... బట్ ఉయార్ సారీ టు సే... షీ ఈజ్ నో మోర్... ఆవిడ చనిపోయారు..... డెడ్ బాడీ మార్చురీలో ఉంది. మేమే వాళ్ళకు ఇన్ ఫార్మ్....'
కాదంబరి చేతిలోని రిసీవర్ కిందికి జారి గులాబీ దండల మీద పడింది.
'కాదంబరీ చేతిలోని రిసీవర్ కిందికి జారి గులాబీ దండల మీద పడింది.
కాదంబరీ....' బామ్మ కంగారుగా మనవరాలి భుజాలు తట్టింది.
కాదంబరి మాట్లాడ్డంలేదు. ఆమె శరీరం స్తబ్దుగా మారింది. విరజ మేడమ్....చ...ని.... పోయిందా?
'న్నో...' గట్టిగా అరిచింది.
'ఏమైందే నా చిట్టితల్లీ....'
'బామ్మ...' అంటూ బామ్మ ఒళ్ళో తలపెట్టింది.
'మేడ....మ్.... మన మేడమ్ మనకిక లేరట' అంది వెక్కుతూ.
బామ్మ షాకయింది.
'ఏమిటే నువ్వంటున్నది...'
'అవును బామ్మా.... సాయంత్రమే నాకు ఫోన్ చేశారు మేడమ్. కాదంబరీ! నువ్వే మా పెళ్ళికి సాక్షివి' అంది. ఎంతగా నవ్వుతూ మాట్లాడింది.... ఇంతలోనే ఇలా...' ఏడుస్తూ అంది కాదంబరి.
* * *
ఐదు నిమిషాలపాటు ఏడుస్తూనే ఉంది. కాదంబరి ఈ నిజాన్ని జీర్ణించుకోలేక పోతోంది. ఇప్పుడేం చేయాలి! ఈ విషయాన్ని అభినయ్ కు చెప్పాలి? అసలు ఈ సంగతి అభినయ్ కు ఇంకా తెలిసిందా లేదా? తెలిస్తే తట్టుకోగలడా? వాళ్ళ ప్రేమ తనకు తెలియదా? కొద్దిసేపు విరజ లేకపోతేనే తట్టుకోలేని వ్యక్తి... శాశ్వతంగా విరజ లేదంట....
మరోసారి అభినయ్ సెల్ కు ఫోన్ చేసింది.
* * *
సెల్ ఫోన్ రింగ్ అవ్వడం విని, కళ్ళు తెరిచాడు అభినయ్. డిస్ ప్లే చూశాడు. అది కాదంబరి ఇంటి నెంబర్.
'కాదంబరీ.... నువ్వా.... చూశావా కాదంబరీ నేనో ఫూల్ ని.... నీకు ఫోన్ చేయాలన్న ఐడియానే రాలేదు. మేడమ్ నీకు కనిపించిందా? తనసలు ఎక్కడికి వెళ్ళింది కాదంబరీ? నాకు.... నాకు భయంగా ఉంది.'
అటువైపు కాదంబరి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎప్పుడూ స్టాఫ్ ముందు గంభీరంగా ఉండే వ్యక్తి....
'కాదంబరీ.... మాట్లాడవేంటి?'
'సార్.... మనం అర్జంటుగా స్టార్ హాస్పిటల్ కు వెళ్ళాలి...'
'హాస్పిటల్ కా.... ఇప్పుడెందుకు? నా విరజకు ఏమీ కాలేదుగా.... చెప్పు కాదంబరీ....'
'సార్.... మీరు వెంటనే బయల్దేరండి. మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను....' కాదంబరి ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది.
* * *
అభినయ్ కు నిద్రమత్తు వదిలింది.
టైం చూసుకున్నాడు. మూడూ ముఫ్ఫై.... మరి కాసేపట్లో తెల్లవారుతుంది. కారు కాదంబరి ఇంటి వైపు పోనిస్తుండగా అతనికా అనుమానం వచ్చింది.
తన సెల్ కు వచ్చిన ఫోన్ కూడా స్టార్ హాస్పిటల్ నుంచే....
అంటే విరజకు....
తల విదిల్చాడు అభినయ్.
ఆ వూహే భరించలేక పోతున్నాడు. తన విరజకు ఏమీ అవ్వదు. తన విరజ తన కోసం బ్రతికే ఉంటుంది.
కారు స్పీడుగా వెళ్తోంది.
* * *
కాదంబరి గులాబీ దండలు చేతుల్లోకి తీసుకుంది. విరజ పార్ధివ దేహం మీద వేయడానికే తను ఈ దండలు కొన్నది?
భగవాన్.... నీదెంత రాతి మనసయ్యా.... నీ సమక్షంలో ఒక్కటవ్వాలనుకున్న వాళ్ళిద్దరిలో ఒక్కరిని మిగిల్చి, మరొకర్ని వేరు చేస్తావా?
* * *
కారు వేగంగా స్టార్ హాస్పిటల్ వైపు వెళ్తోంది.