"మీరు చెప్పినవి ఆచరణలో పెట్టటానికి ప్రయత్నిస్తాను డాక్టర్!"
"వీలైనంత తొందరగా మరొక పనికూడా చెయ్యండి. అహల్యను తీసుకొని కొన్నాళ్ళపాటు ఏవైనా సుందర ప్రదేశాల్లో తిరిగిరండి. సుందరప్రదేశాలు మీ మనసులు ఏకమై రసగీతికలు పాడేందుకు దోహదం చేస్తాయి. అహల్య మనసును మీరు గెలుచుకుంటారని నా ఆకాంక్ష. బెస్టాఫ్ లక్"
అతడి చెయ్యిపట్టి నొక్కి వదిలాడు అరవింద్.
* * * *
ఒక సుప్రభాతాన మసక చీకట్లు తొలిగిపోతుంటే అరవింద్ ఇంటితలుపు తట్టింది అరుణోదయ.
అరుంధతమ్మ తలుపు తెరిచింది.
"కొత్త పనిమనిషి, అమ్మగారూ" అంటూ నవ్వింది అరుణోదయ.
క్రితంరోజే అర్చన వచ్చి చెప్పింది. అరుణోదయ అరవింద్ తో ఆడి ఓడిపోవడం, పందెంలో అనుకొన్న ప్రకారం పనిమనిషిగా రావడం.
"ఆటలో కావాలని ఓడిపోయి జీవితంలో మీ అబ్బాయిని గెలుచుకోవాలని వస్తున్న పిల్ల. పెద్ద అందగత్తె అని చెప్పనుగాని విలక్షణంగా వుంటుంది. తెలివైనది. మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. మర్యాదస్తులు" అంటూ అరుణోదయ వివరాలన్నీ చెప్పింది.
ఇహ వాడి పెళ్ళి కళ్ళచూసే యోగంలేదు, ఈజన్మకింతే అని నెత్తి రాయి చేసుకుని రోజులు నెట్టుకొస్తున్న సమయంలో చాకులాంటి ఒక చిన్నది, రాయిలాంటి తన కొడుకు మనసును గెలుచుకొంటానని రావడం అరుంధతమ్మను సంతోషపరిచింది. "అందానిది ఏముంది? వికారపు రూపు లేకపోతే సరి! మంచితనం ముఖ్యం."
"మరీ అంత తీసికట్టుగా కూడా వుండదు పిన్నిగారూ! చక్కని పలువరస, పెసరికాయలా ముక్కు వున్నాయి. చామనచాయ. బ్రహ్మ ఆమే మోహంలో ఇవ్వని అందాలకు ప్రతిగా యిచ్చాడా అన్నట్టు ఒత్తయిన తలకట్టుంది."
ప్రొద్దున్నే ఎదురుగా ప్రత్యక్షమైన ఈ పిల్ల అర్చన చెప్పినట్టుగానే వుంది. సంతృప్తిగా ఒక నిట్టూర్పు విడిచి "లోపలికిరా అమ్మా" అంది. "కానీ, అమ్మగారూ అని పిలవకు! ఎలాగో వుంది. ఆంటీ అని పిలుపు. లేకపోతే అమ్మమ్మగారని పిలుపు. మనుమరాలి వయసుదానివేకదా."
జాగ్రత్తగా కుడికాలు ముందుపెట్టి లోపలికి నడిచింది అరుణోదయ. అర్చన పదే పదే చెప్పింది కుడికాలు ముందుపెట్టి వెళ్ళమని.
"పని చెయ్యడానికి వచ్చాను అమ్మగారూ. ఆంటీ, అమ్మమ్మ అని పిలిస్తే బాగుండదు."
"నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు శుక్రవారప్పూట ప్రొద్దున్నే మహలక్ష్మిలా వచ్చావు. ఆంటీ అని పిలుపు" అంటూ ఆ పిల్ల గడ్డం పుణికింది అరుంధతమ్మ.
"ఈ ఒక్కరోజు తరువాత అలాగే పిలుస్తాను...ముందు వాకిలి చిమ్మి నీళ్ళు చల్లాలికదమ్మగారూ? బకెట్, చీపురు ఎక్కడున్నాయో చూపండి" అచ్చు పనిమనిషిలా అడిగింది.
"అయ్యో! నీచేత అలాంటి పనులు చేయించుకోవాలంటే నాకెలాగో వుంది కదమ్మా?"
"పని పరమాత్మ స్వరూపం అంటుంది మా అమ్మగారు. ఆమె ఒక్క క్షణం ఊరికే వుండదు. పాచిపని, వంటపని అన్నీ ఆమె చూసుకొంటుంది. పని ఎంతచేస్తే తన ఆరోగ్యం అంత బాగుంటుందని చెబుతుంది. తీరిక సమయమ్లో టైలరింగ్ చేస్తుంది. ఇరుగు పొరుగున వుండే ఆడపిల్లలకి టైలరింగ్ లో శిక్షణ యిస్తుంది. నిజంగా మా అమ్మలాగా పనివిలువ అందరికి తెలిసి వుంటే ఈ దేశ సౌభాగ్యం మరో విధంగా వుండేది, అమ్మగారూ! మొన్నో పత్రికలో ఓ సుప్రసిద్ద సినిమా నటుడిని ఇంటర్వ్యూ చేస్తూ 'మీకో కోపంవస్తే ఏం చేస్తారు?" అని అడిగితే, 'బాత్ రూంలు క్లీన్ చేస్తాను' అని చెప్పాడు."
"కానీ, నీ ఇంట్లో నువ్వు చేసుకోవడం వేరు. మా ఇంటికి వచ్చి చెయ్యడం వేరు."
"మీ ఇంట్లో సత్తెమ్మ చెయ్యడంలేదూ?"
"అది జీతంకోసం చేస్తుంది."
"నేను జీవితం కోసం చేస్తున్నాను. ప్లీజ్, అమ్మగారూ! సత్తెమ్మకు చెప్పినట్టే నాకూ పనిచెప్పి చేయించుకోండి. మీరు యిబ్బంది పడి నన్ను యిబ్బంది పెట్టకండి."
"సరే! నేనొద్దంటే మాత్రం నువ్వింటావా? అదిగో అక్కడున్నాయి చీపురు బకెట్! కొళాయి అక్కడుంది" యింకా చేయాల్సిన పనులన్నీ చెప్పింది.
వాకిలి చిమ్మి నీళ్ళుచల్లి ముగ్గేసింది. తరువాత గదులు చిమ్ముతూ సుదర్శనం గారి గదిలోకి వచ్చింది.
ఆయన అప్పుడే లేచి బెడ్ మీద దుప్పటితీసి మడత పెడుతున్నాడు.
"అయ్యగారూ! నేను మడత పెడతాను. మీరెళ్ళి ముఖం కడుక్కోండి. అమ్మగారు టీ చేస్తున్నారు" అంటూ ఆయన చేతిలోని దుప్పటి చొరవగా అందుకుంది.
"సత్తెమ్మ ఏదీ? నువ్వెవరు?"
"సత్తెమ్మ ఊరెళ్ళింది అయ్యగారూ! నన్ను చెయ్యమని చెప్పి పోయింది."