చాపమీద కూర్చుని "మామయ్య ఏరీ?" అంది పాకని నిశితంగా చూస్తూ.
"వెనుక చెట్టుక్రింద పడుకున్నారు, మిషన్ చప్పుడుకి కూచోటం కష్టం కదా?"
"జయ ఏదీ?"
"అక్కడ కూర్చుని పిల్లలకి ట్యూషన్ చెపుతోంది"
సుధా కళ్ళల్లో నీరు తిరిగింది.
"ఎంత కష్టం వచ్చిందత్తయ్యా! మాయామహల్ లో సమస్తం మరిపోయినట్టుగా కొద్దిరోజుల్లోనే అంతా మారిపోయింది ప్చ్! భగవంతుడున్నడంటారు ఎక్కడున్నాడో!"
నవ్వింది ఆమె.
"నిజంగా వున్నాడు సుధా! బజార్నపడుతున్న మా కుటుంబాన్ని ఎన్నడో సహాయం చేశాడాయన అన్న కృతజ్ఞతతో ఆదుకున్నాడు వెంకన్న. ఈ మూడుగదుల పాక అతనిదే మాకు వదలి మళ్ళీ పక కప్పుకున్నాడతను.
బ్రతకటానికి జీవనాధారం లేని ఈ కుటుంబానికి పిల్లల ట్యూషన్ ఏర్పాటుచేశారు చుట్టుపక్కలవాళ్ళు. ఎదురింటి బ్యాంక్ ఎసిస్టెంట్ మేనేజర్ అనంతశర్మగారు లోన్ యిప్పించి మిషన్ కొనిపించారు.
తింటున్నాం. బ్రతుకుతున్నాం.. అంతో యింతో కంపల్సరీ పిగ్నీ క్రింద దాచుకుంటున్నాం.
సుధాకర్ ఆ కాస్త బి.ఏ. పూర్తి చేస్తే ఇంకా మీకు దిగులేముంది. త్వరలో ఓ ఇంటిస్థలం కొనుక్కోగలం.
సెంటు వందేభయ్ చొప్పున వాయిదాలమీద ఇస్తానన్నారు.
బ్యాంక్ వాళ్ళు సహాయం చేస్తున్నారు.
ఇంతకంటే ఇంకేం
"అవునమ్మా పరీక్షకి వెళ్ళలేదు" అని "నమస్తే మేడం" అన్నాడు అప్పుడేవచ్చిన సుధాకర్.
"ఒరే! సరే! మేడం ఏమిటి? నమస్తే ఏమిట్రా? అది నీకంటే చిన్నది. ముందుగా వాళ్ళమ్మ అన్నట్టుగా జరిగివుంటే అది ఈ ఇంటి కోడలయి వుండేది. నీపై వాళ్ళమ్మగారి కెంత ప్రేమని, తప్పు--- అలా అనకూడదు" అని "ఇంతకీ పరీక్షకి యెందుకు వెళ్ళలేదు?" అని కోపంగా అడిగింది ఆమె.
అత్తయ్యగారు అలా మాటాడేసరికి ఎన్నెన్నో అడగాలనుకున్న సుధా సిగ్గుతో, బెరుకుతో తలవంచింది.
అది గమనించాడు సుధాకర్, నవ్వుకున్నాడు తనలో "ఈ ఆడవాళ్ళ చేదస్తం. ఎలా మాటాడాలో తెలీదు" అనుకుని "అమ్మా! పరీక్షలకి ఫీజు ఎంతో తెలుసా? మనవద్ద చిల్లిగవ్వ లేదారోజుల్లో- పోనీ కష్టపడి సంపాదించి ఫీజు కట్టినా పాసవుతనానన్న నమ్మకం లేదు. చించో దంచో పాసైనా ఆ కాగితాన్ని ఏం చేయాలి, ఫ్రేమ్ వేయించటానికి కూడా నదగ్గర డబ్బులేదు- ఎంతెంత చదువుకున్న వాళ్ళూ చిన్న చిన్న ఉద్యోగాలకే ఎగబడుతున్నయీ రోజుల్లో బి.ఏ.తో ఏం చేయాలి.
అందుకే ఉద్యోగం దొరకగానే శుభ్రంగా చదువు మానేశాను.
ప్రయివేట్ కంపెనీ ఐనా నెలకు నాలుగొందల జీతం! బోనస్ ఇంకేం కావాలి.
డబ్బు సంపాదించటం ప్రధానమమ్మా ఈ రోజుల్లో.
అదేలాటిదైనా యెంత చిన్నదైనా ఉద్యోగం అంటూ వుండాలి మనకి. కానీ మన అదృష్టంవల్ల మంచి ఉద్యోగమే వచ్చింది."
ఆ మాటలు ఆ ఇద్దర్నీ కదిపేశాయ్.
అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. కొడుకు చూకుండా కళ్ళువత్తుకుంది. "ఈ కుటుంబంలో అందరికీ పనిచేయాలి కష్టపడి సంపాదించాలనే దృష్టి ఏర్పడిపోయింది" అనుకుంది.
సుధ ఏమీ మాటాడలేదు.
"ఇదిగోనమ్మా జీతం" అని నాలుగువంద కాగితాలు అందించాడతను.
"తొలి జీతం. ఇందులో కొంతతీసి ముడుపుకట్టాలి"
"వేస్ట్! మనకి ఉద్యోగం ఇప్పించడా ఆ తిరపతి వెంకన్న మన సామర్ధ్యం. మన ప్రయత్నం మనకు కూడు పెడుతుంది. ఆ ముడుపు డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అయినా వస్తుంది."
"నోర్ముయ్యరా! నాస్తికుడిలాగా మాటాడకు. ఆ తిరపతి వెంకన్న దయే లేకుంటే యీ సరికి మనం చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోయేవాళ్ళం" అందామె మందలింపుగా.
జవాబు చెప్పలేదతను.
"అయితే ఫీజు కూడా కట్టలేద?"
"ఊహుఁ"
"చాలా పొరపాటు చేసారత్తయ్యా! నేనున్నానన్న ఆలోచన కూడా మీకు వచ్చినట్టు లేదు-ఈ ఏడు బి.ఏ.
అయిపోయి వుంటే తర్వాత ఎం.ఏ. చేసేవాడు కదా!" అంది సుధామయి.
"అంత ఓపిక యికలేదు నాకు! చదివే రోజులు అయిపోయాయి."
బదులు పలకలేదు సుధామయి.
అంతలో ట్యూషన్ ముగించి వచ్చింది జయప్రద.
మసక చీకట్లు కమ్ముకుంటున్నాయ్.
జయప్రద అందించిన కాఫీ తాగి లేచింది సుధామయి.
"ఒరే సుధాకర్! ఆ బస్ స్టాప్ వెళ్ళి బస్సెక్కించి రండి" అంది అన్నపూర్ణ.