Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 33


    కాదంబరి దృష్టి దూరంగా ఉన్న కారు మీద పడింది. ఆ కారు విరజదిగా గుర్తించింది. వెంటనే పరుగు లాంటి నడకతో వెళ్ళింది.
    ఆ కారు నుజ్జునుజ్జయింది. ఆ కారు చుట్టూ రాళ్ళు పెట్టారు. ఎండిన రక్తం మరకలు కనిపిస్తున్నాయి.
    కళ్ళు నులుముకుని చూసింది. నో డౌట్ అది మేడమ్ కారే... ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. 'దేవుడా... మా మేడమ్ కు ఏమీ కాకుండా చూడు...' ఆమె బిర్లామందిర్ వైపు తిరిగి దేవుడ్ని వేడుకుంది.
    ఎక్కడో ఏడుకొండల పైన వున్న ఆ శ్రీ వెంకటేశ్వరుడికి ఆమె విన్నపం వినిపించలేదు కాబోలు...
    ఆ కారుకు సమీపంలో వున్న ఓ షాపు దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగింది.
    'తెలియదు మేడమ్... ఏదో హాస్పిటల్ కు తీసుకెళ్ళారు....' చెప్పాడా షాపతను.
    చాలామందిని ఎంక్వయిరీ చేసింది. ఎవ్వరూ ఏ హాస్పిటల్ కు తీసుకువెళ్ళారన్నది సరైన సమాచారం ఇవ్వలేక పోయారు. కాదంబరి గబగబా దగ్గర్లో ఉన్న ఓ టెలిఫోన్ బూత్ వైపు నడిచింది.
    టెలిఫోన్ డైరెక్టరీ తీసింది. వరుసగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నింటికీ ఫోన్ చేయసాగింది.
    యాక్సిడెంట్ కేసులు రాలేదని కొన్ని హాస్పిటల్స్ నుంచి, వచ్చినా విరజ అనే పేరుగల వ్యక్తి లేరని మరికొన్ని హాస్పిటల్ వాళ్ళు చెప్పేశారు.
    టెలిఫోన్ డైరెక్టరీ ని పక్కకు గిరాటేసింది.
    ఆ టెలిఫోన్ డైరెక్టరీకి సప్లిమెంట్ గా వున్న మరో టెలిఫోన్ డైరెక్టరీ ని తిరగేస్తే కొత్తగా ప్రారంభమయిన స్టార్ హాస్పిటల్ నెంబర్ దొరికేది.
    తల పట్టుకొని అలానే కూర్చుండిపోయింది కాదంబరి. మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది ఒకోసారి టెన్షన్ వల్ల. ఇప్పుడామె పరిస్థితి అలాగే ఉంది.
    
                                * * *
    
    అభినయ్ సరాసరి ఇంటికి వెళ్ళాడు. ఇంటి గేటుకు తాళం వేలాడుతూ వుంది.
    విరజకు తెలిసిన ఫ్రెండ్స్ కు ఫోన్ చేద్దామన్నా తనకు తెల్సిన ఫ్రెండ్సెవరూ లేరు.
    అప్పుడు.... అప్పుడొచ్చిందా ఆలోచన....
    తను ఎయిర్ పోర్ట్ లో ఉండగా ఎవరో ఫోన్ చేశారు. ఎవరు వాళ్ళు? అసలెందుకు చేశారు?
    ఆ ఆలోచన రావడంతో వెంటనే 'సెల్'లో ఆ నెంబర్ చూసి డయల్ చేశాడు.
    
                                                           * * *
    
    'హలో... ఇందాక... అదే నాలుగు గంటల క్రితం, నా సెల్ కు ఫోన్ చేశారు...మీరెవరో.... ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా?' నాలుగు గంటల క్రితం తనకు ఫోన్ చేసిన నెంబర్ డయల్ చేసి అడిగాడు అభినయ్.
    'డాక్టర్ సిద్దార్ధ గారి సెల్ ఇది. ఆయన ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. ఎనీ మెసేజ్ టు డా.సిద్దార్ధ?' అడిగింది రిసెప్షనిస్టు డాక్టర్ సిద్దార్ధకు వచ్చిన సెల్ ఫోన్ కాల్ అటెండవుతూ...
    'అర్జంటుగా ఆయన్తో మాట్లాడాలి!'
    'సారీ సర్....ఆయన ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. బయటకు రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు....'
    'ఆల్ రైట్.... ఆపరేషన్ పూర్తవగానే నాకోసారి ఫోన్ చేయమని చెప్పండి.....నా పేరు అభినయ్....' చెప్పి ఫోన్ పెట్టేశాడు అభినయ్.
    
                                * * *
    
    ఒక మౌనిలా కూచొని ఉన్నాడు మహాపతి.
    అతనికి ఆకలి లేదు, దప్పిక లేదు....ఆసలతను ఈ లోకంలో వున్నట్టే లేడు. అతని మనసు నిండా ఆందోళనే. దేవుళ్ళందరికీ పేరుపేరునా మొక్కుకుంటున్నాడు. తన కూతురికి చేస్తున్న ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. దేవుణ్ణి ఇంకేం కోరడు తను....
    రామ్ బెనర్జీ హాస్పిటల్ లాంజ్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతని మనసులో రకరకాల ఆలోచన్లు తను అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అన్న ఆలోచన అతడ్ని స్థిమితంగా ఉండనివ్వడంలేదు.
    
                               * * *
    
    డా.సిద్దార్ధ, ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఆపరేషన్ థియేటర్ లో నుంచి బయటకు వచ్చారు. నర్సు వచ్చి వాళ్ళు వేసుకున్న ఆపరేషన్ గౌను విప్పింది. గ్లౌజులు తీసింది.
    సరిగ్గా వాళ్ళు ఆపరేషన్ థియేటర్ లో అడుగు పెట్టిన నాలుగున్నర గంటల తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళ మొహంలో అలసట.
    వాళ్ళు రాగానే మహాపతి అతఃరంగా లేచాడు.
    'ఒరే సిద్దూ! ఏమైందిరా... ఆపరేషన్ సక్సెసా?' అడిగాడు ఆదుర్దాగా మహాపతి.
    'ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ అబ్జర్వేషన్ లో కొన్ని రోజులు ఉంచాలి. కొత్త కాంప్లికేషన్స్ ఏమైనా క్రియేట్ అవ్వొచ్చు' చెప్పాడు డాక్టర్ సిద్దార్ధ.
    'అదేమిట్రా....' మహాపతి లో కంగారు. 'నథింగ్ టు వర్రీ మిస్టర్ మహాపతి.....ఏమైనా కాంప్లికేషన్స్ రాకుండా, అబ్జర్వ్ చేయడం మా డ్యూటీలో ఓ భాగం....అంతే....' చెప్పాడు ప్రొఫెసర్ రాబిన్ మార్క్.
    మహాపతి చేతులు జోడించి అన్నాడు. 'నా కూతురి ప్రాణాలు కాపాడిన మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు'
    'ఇది మా వృత్తిలో ఓ భాగం మిస్టర్ పతీ....' చెప్పాడు రాబిన్ మార్క్.
    'సర్... ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా గెస్ట్ గా ఓ వారం రోజులు ఉండగలరా? రిక్వెస్టింగ్ గా అడిగాడు డాక్టర్ సిద్దార్ద.
    'అవును ప్రొఫెసర్.... మా కోసం....' మహాపతి అన్నాడు.
    'ఆక్చువల్ గా నాకు వేరే అపాయింట్ మెంట్స్ ఉన్నాయి. కానీ వుంటాను. ఎందుకంటే, నేను ఆపరేషన్ చేసిన పేషంట్ గురించి అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అదీగాక, ఇలాంటి అరుదైన అవకాశం నేను ఉపయోగించుకోవాలి.... బట్ వన్ థింగ్....'
    'ఏమిటది ప్రొఫెసర్?' డాక్టర్ సిద్దార్ధ అడిగాడు.
    'ఆ అమ్మాయి ఎక్సయిట్ అవ్వకూడదు.... ఓవర్ ఎమోషన్ ఆమె ముందు మనం ఎక్స్ ప్రెస్ చేయకూడదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకు గుండెను డొనేట్ చేసిన వ్యక్తి చనిపోయారు. ఆమె తాలూకు వాళ్ళు గొడవ చేసినా, అద్వైత ముందు బరస్ట్ అయినా చాలా కష్టం...'
    'ప్రొఫెసర్...' ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు డాక్టర్ సిద్దార్ధ.
    విరజ డెడ్ బాడీని అప్పగించాలి. ఆవిడ కోరిక ప్రకారం,. మిస్టర్ అభినయ్ కు ఆ డెడ్ బాడీని అప్పగించాల్సిన బాధ్యత తన మీద ఉంది. అప్పుడు తన విరజ గుండెను ఎవరికి అమర్చారని అడిగితే... తన ప్రియురాలి గుండెను అమర్చిన వ్యక్తి అద్వైత అని తెలిసి.... అతను ఎక్సయిట్ అయితే.... ఆ అమ్మాయి వెంట పడితే.... మరో కార్నర్ లో ఆలోచించసాగాడు డాక్టర్ సిద్దార్ధ.
    'ఒరే సిద్దూ.... ఏమిట్రా ఆలోచిస్తున్నావు?'
    తన సందేహాన్ని చెప్పాడు డాక్టర్ సిద్దార్ధ. నిజంగా ఆ పరిస్థితిలో ఏం చేయాలో మహాపతికి కూడా తోచలేదు.
    'మరిప్పుడేం చేద్దామంటావురా.... పోనీ ఓ పని చేస్తే?'    
    ఏమిటన్నట్టు చూశాడు డాక్టర్ సిద్దార్ధ.
    'ఆ అబ్బాయికి అసలు విషయం కొన్నాళ్ళపాటు... అదే... అద్వైత రికవరీ అయ్యేవరకూ గోప్యంగా ఉంచుదాం....
    'అది.... అదెలా సాధ్యం పతీ.... ఓ డాక్టర్ గా... నా మోరల్ ఎథిక్స్ కే విరుద్దం అది' అన్నాదు సిద్దార్ధ.
    'కానీ, నువ్వు ఈ నిజం చెబితే.... అతను అద్వైతను చూసి బరస్టవ్వచ్చు. లేదా ఎమోషనై పోవచ్చు.'
    'అలా అని... నేను అబద్దం ఎలా చెప్పగల్ను.... ఓ వ్యక్తి చివరి కోరికను తీర్చకుండా....'
    'పోనీ ఓ పని చేయ్ సిద్దూ.... నువ్వు ఒక మూడు నెలలపాటు లాంగ్ లీవ్ పెట్టు ఈలోగా అన్నీ సర్దుకుంటాయి....అప్పటివరకూ నువ్వు మన ఫామ్ హౌస్ లో ఉండు.... విరజ గుండె ఎవరికి మార్పిడి చేసిందీ నీకూ, నాకూ తప్ప మరెవరికీ తెలియదు. నా చిట్టితల్లి కోసం ఇదొక్కటి చేయరా...' డాక్టర్ సిద్దార్ధ రెండు చేతులూ పట్టుకున్నాడు మహాపతి.

 Previous Page Next Page