"మీరు మందిచ్చే డాక్టరే అనుకున్నాను. శతకాలు చెప్పే పండితులనుకోలేదు" చిరాకుగా అంది అహల్య.
"మనసులో మలినం నిండి అనారోగ్యం పాలయినప్పుడు శతకాలు మంచిపని చేస్తాయి."
"జ్ఞానవంతులు! అన్నీ బాగానే తెలుసు. మీరు అందంగా వుంటారని నా మనసులో మాట చెబితే అంత వులిక్కిపడ్డారెందుకు?"
'మళ్ళీ మొదటికి వచ్చావా తల్లీ?' మనసులో గొణుక్కున్నాడు.
కొంచెం చిరాకుగా అడిగాడు "నేను అందంగా వుంటే మీకేమిటి లాభం చెప్పండి?"
"ఒక అందమైన పక్షినో, పువ్వునో అందంగా వుందని మెచ్చుకుంటాం. అలాగే యిదీ. మనసులోని ఆనందానుభూతిని తెలుపడం అన్నమాట. అంతమాత్రానికే ఏదో అక్రమసంబంధం పెట్టుకున్నట్టు గోల చేస్తారెందుకు?"
"పక్షినో, పువ్వునో మెచ్చుకోవడం పరాయి మగాడిని మెచ్చుకోవడం ఒక్కటి కాదుకదా?"
"చెప్పారుగాని, పండితవర్యా_నేను అహల్యను. సావిత్రినో, అనసూయనో కాదు."
"అయితే మీ వారిని వదిలేసి నా దగ్గరకొచ్చి వుండిపోతావా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు" పెదవులు బిగించి అన్నాడు.
"మీలాంటి అందమైనవాళ్ళు దొరుకుతారంటే మా వారిని వదిలెయ్యడానికి సాహసిస్తాను. కాని, వుండిపోవడం అంటే?"
"పచ్చిగా చెప్పాలంటే వుంచుకోవడం అన్నమాట. పెళ్ళయి పదేళ్ళు కాపురం చేసినదాన్ని ఫ్రెష్ గా పెళ్ళాడలేనుకదా? ఉంచుకోవడానికేమీ అభ్యంతరం లేదు."
దిండుతీసి అతడి ముఖాన విసిరికొట్టింది. ప్రక్కన వున్న పుస్తకాలు తీసి విసిరింది. స్టూల్ మీదున్న మందులబాటిల్స్ తీసి విసరబోయింది.
నవ్వుతూ పట్టుకున్నాడు అరవింద్. "అంత కోపం ఎందుకు, అహల్యా? నా అందం చూసి నా దగ్గరికి వచ్చేదానివి_నాకంటే అందమైనవాడు కనిపిస్తే నన్ను విడిచి వెళ్ళిపోవని ఏముంది? ఈ మాత్రం దానికి పెళ్ళి అన్న బంధం దేనికి? ఉంచుకొంటే బుద్ది పుట్టినప్పుదా ఈజీగా విడిచి వెళ్ళిపోవచ్చు."
"నువ్వు డాక్టరువా? అసలు నువ్వు మనిషివా? ఎలా కనిపిస్తున్నాను రా నీ కళ్ళకి? బజారుదానిలా కనిపిస్తున్నానా?"
"ఒక్క మొగుడ్ని వదిలేసినా ఒక్కటే. పదిమందిని వదిలేసినా ఒక్కటే. ఒకటే బిరుదు నీతిమాలిన ఆడదని."
చెళ్ళున చెంపమీద కొట్టినట్టుగా అయింది అహల్యకు. కళ్ళకి కమ్మిన పొరలు విడిపోయినట్టుగా అయ్యాయి. కోపం....దుఃఖం.
చీకటిలో దీపకళిక వెలిగినట్టు అనుభూతి.
అహల్యను తీసుకుపోవడానికి వచ్చాడు జగన్మోహన్.
అతడినొక్కడినే కన్సల్టింగ్ రూంలోకి పిలిచి చెప్పాడు అరవింద్. "ఆమెకు మందులొక్కటే పనిచెయ్యవు. ఆవిడలో ఒక అసంతృప్తి. అందమైన భర్త దొరకలేదని. అందమైన అమ్మాయిని ఆశపడి చేసుకోవడంలొ మీ తప్పు లేదుగాని, ఇన్నేళ్ళయినా ఆమె మనసును చూరగొనకపోవడం మీరు చేసిన తప్పు."
"ఆమెను ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తున్నానుకద, డాక్టర్? యింకెలా ఆమె మనసు చూరగొనాలి?"
"మీ మధ్య సాన్నిహిత్యం పెరగాలి. అందుకు మొదటి చర్యగా మీ అమ్మగారిని మీ మధ్యనుండి పంపెయ్యండి."
"ఆవిడమాకు ఏవిధమైన ఇబ్బందీ కలిగించదు. వంటావార్పు ఆవిడే చూసుకొంటుంది. మడివంట కాబట్టి వడ్డన కూడా ఆమే చేస్తుంది. అహల్యకి ఒక్క పనీ చెప్పదు. కోడలు చెయ్యలేదని బాధపడదు. అలాంటి మనిషిని పంపించడమంటే నాకు మనసొప్పదు డాక్టర్! ఆవిడ బాధపడుతుంది."
"విషయం యిదీ అని ఆవిడకు నచ్చజెప్పండి. కావాలంటే నేను చెబుతాను. మీ మధ్య మూడోమనిషి వున్నంతవరకు మీ మధ్య సాన్నిహిత్యం పెరిగే అవకాశం తక్కువ. ఇంట్లో మీ అవసరాలన్నీ మీ అమ్మగారు చూస్తుంటే మీతో మీ భార్యకి అటాచ్ మెంట్ కి అవకాశం ఎక్కడ? అసలు, అహల్యను పనిలేకుండా వుంచడం మరో తప్పు. తీరుబాటు ఎక్కువైతే మనిషికి పిచ్చిపిచ్చి ఆలోచనలు రావడం సహజం. డానికి తోడు కాలక్షేపపు నవలలు చదవడం. నవలా హీరోలా మీరు లేరని బాధపడడం. జీవితం నవలల్లో వున్నంత అందంగా లేదే అని అసంతృప్తి పడడం ఆమెకు తీరుబాటు లేకుండా చెయ్యడం ముందు మీరు చేయాల్సిన పని. ఇంట్లో పని ఎంతసేపు చేస్తుందని మీరనుకొంటే ఏదైనా సోషల్ సర్వీస్ సెంటర్ లొ చేర్పండి. సోషల్ సర్వీస్ లొ ఆమే ఆలోచనా దృక్పధంమారే అవకాశం ఎంతయినా వుంది."