Previous Page Next Page 
మధుకీల పేజి 32

    సిగరెట్ ముట్టించి కులాసాగా నడుస్తున్నాడతను.
    ముళ్ళకంచెపై నడిచినట్టుగా వుంది సుధాకర్ కి.
    "ఈ రోజు నుంచీ నీ పంట పండింది."
    "ఏమిటి?"
    "నీ పని మారుతోంది"
    'ఎందుకు?'
    'నిన్ను మా మనుషుల్లో ఒకనిగా చేసుకున్నాం.'
    'అక్కర్లేదు'
    'అలా అంటే కుదరదు, ఇది నీకు ప్రమోషన్.'
    'థాంక్స్! కానీ నా ప్రాణానికి నన్ను వదిలేస్తే చాలా సంతోషిస్తాను.'
    'సుధాకర్! అనవసరంగా బెంబేలుపడకు. ఏం కష్టపడి పోతున్నావని యీ బాధ. హయిగా డబ్బు అందబోతోంది. తీసుకో, సుఖపడు, మీ వాళ్ళని సుఖపెట్టు.'
    "నీ డబ్బు నాకక్కర్లేదు."
    "నీ డబ్బు నా డబ్బు అని బాండ్ చేయబడలేదు ఏదీ. ఎవరి చేతుల్లోవుంటే- ఎవరు ఖర్చు చేసి అనుభవించగలిగితే అది వాళ్లది. ఇప్పుడు నీ ఫామిలీ ఎంత నికృష్ట స్థితిలో వుందో నాకు బాగా తెలుసు. అందుకే బాస్ తో నీ విషయం చెప్పాను అయన కరిగిపోయారు---" అతను ఆగేడు.
    "కానీ నామాట వినండి, మీరు నా జీవితంతో ఆడుకోవటం ప్రారంభించాక నా బ్రతుకే మారిపోయింది. మానసికంగా కూడా నేను చాలా కృంగిపోయాను. బ్రతికే మార్గం కనిపించక బాధపడుతున్నాను. ట్యుటోరియల్ కాలేజీలో ఏదో ఖాళీ వుందంటే వెళుతున్నాను--- నన్ను వదిలెయ్."
    అతను క్రూరంగా నవ్వాడు.
    "మిస్టర్ సుధాకర్. శ్లేష్మంలో పడ్డ ఈగ గతి యిక అంతే! తప్పించుకునే మార్గం వుండదు. మేం నిన్ను వదలం, నీవు విడిపోలేవు. ఒకటే మార్గం. మా మాట వినడం-- డబ్బు తీసుకోవడం-అంతే!"
    నిట్టూర్చాడు సుధాకర్.
    "ఈ రోజు సాయంకాలం ఆరింటికి స్టేషన్ కి వెళ్ళు ఎక్స్ ప్రెస్ లో ఒకతను దిగుతాడు."
    "ఎందుకు"
    "అతనో బేగ్ నీకిస్తాడు, అది నాకు పార్క్ లో అందించేయాలి నీవు"
    "అంతేనా."
    "అవును అంతే! ఇదిగో వంద రూపాయలు, సాయంకాలం మరో వంద తీసుకో. నెలకు ఐదుసార్లిలా చెయ్యాలి నీవు. ప్రతి శుక్రవారం సాయంకాలం నీకు డ్యూటీ- ఆ రోజు నీకు రెండొందలు అందుతుంది."
    "అతన్నెలా గుర్తించాలి."
    "మనిషి విలువ ఎంత అంటాడతను- పెంచుకోగలిగినంత అనాలి నువ్వు. అదో ఆకాశం మండుతోంది అంటాడతను- నేనే మండిస్తున్నది అనాలి నువ్వు. అతను ఇచ్చిన కేస్ తీసుకోవాలి, నీ చేతిలో ఉండే ఖాళీ కేస్ అతనికివ్వాలి నీవు. ఇదిగో ఖాళీ కేస్. ఇక వస్తాను. బై! బై! మళ్ళీ సాయంకాలం కలుద్దాం" అని అతను గబ గబా ఎదర సందులోకి నడిచివెళ్ళాడు.
    నిట్టూర్చాడు సుధాకర్. నేరుగా ఇంటికి వెళ్ళాడు.
                               *        *        *
    ఇంటిచుట్టూ కలువతీగల కంచె.
    తడకగేటు తొలగించుకోవాలని అడుగుపెట్టింది సుధామాయి.
    పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుధాకర్ ఎగ్జామ్స్ కి రావటంలేదు. ఏ కబురూ తెలియలేదు, అనుకుంటూ వచ్చిందామె. ఆ రోజే మొదటి పరీక్ష అయింది.
    గేటునుంచి పాకవరకూ వున్న మట్టిరోడ్డు కిరుపక్కలా వున్న పూల మొక్కల్ని క్రోటను మొక్కల్ని చూస్తూ సాగింది సుధామయి.
    వాకిట్లో నీడపడి తలెత్తి చూసింది అన్నపూర్ణ.
    సుధామయిని చూసి కుడుతున్న కుట్టుమిషన్ మీద నుంచి లేచి వచ్చింది. సుధాని చూడగానే ఆమె ముఖం వికసించింది.
    "రా సుధా! రా! ఎన్నెల్లయింది నిన్నుచూసి- ఈ మధ్య రానేలేదు" అంది ఆమె.
    శుభ్రంగా అలికి ముగ్గులుపెట్టిన నేల-ఆరు గజాల చదరం గది అది. ఓ వార మిషన్, దానిముందు చాప - చాపపై గుడ్డలు-పేలికలు."
    "అత్తయ్యా!"
    "బెంబేలు పడకు సుధా! కష్టాలు రామచంద్రునివంటి వారికి తప్పలేదు కనకవు సింహాసనముపై కూర్చున్న హరిశ్చంద్ర చక్రవర్తే కాటికాపరితనం చేశాడు. ఓడలు బళ్ళవుతాయ్, బళ్ళు ఓడలవుతాయ్. కాలం తెచ్చే మార్పు ఇది. కనీసం యీ మాత్రమైనా చూసాడు భగవంతుడు. అదెంత కాదు."

 Previous Page Next Page