Previous Page Next Page 
పాదాభివందనం పేజి 33

"అమ్మా కొన్ని సత్యాలయినా అప్రియమైనవి చెప్పకూడదు." బాధగా అన్నాడు. కాంతమ్మ మౌనం వహించింది.

కబుర్లు దొర్లుతున్నాయి మళ్ళీ-- రామచంద్ర అక్కగారి విషయాలు, చెల్లెలి విషయాలు అడిగాడు. తమ కబుర్లు చెప్పాడు.

పూజామందిరంలో ప్రవేశించాడు రామచంద్ర.

ఆ గదిలో కళాకాంతులు క్రమేపి తగ్గి పోతున్నట్టుగా వున్నాయి. కాంతమ్మగారి నిత్య పూజలతో తృప్తి చెందినట్లు లేరు దేవుళ్ళు. ఆ నైవేద్యం తో సంతృప్తి పడ్డట్టుగా లేవు సాలగ్రామాలు.

దేవుళ్ళ పటాలు మాత్రం కుంకుమ బొట్లతో పూల అలంకరణతో తృప్తి పడ్డట్టుగా కనిపిస్తాయి. ఏదో తెలియని ఆవేదన గుండెలో గుబులు పుట్టించింది.

"బాబూ! నా తర్వాత ఈ దేవుళ్ళు ఎమోతారా అని బాధగా వుందిరా! వీళ్ళని తీసుకెళ్ళి శుచీ మడి లేని వూళ్ళలో పడేయోద్దు. ఏ శ్రిశైలమో వెళ్ళి గంగలో కలిపెయ్!"

"అమ్మా" ఆర్తిగా పిలిచాడు.

"అవునురా నాయనా ! అనాధ ప్రేత సంస్కారం మున్సిపాలిటి వాళ్ళు చేసినట్టు పూజా పురస్కారాలకి నోచుకోని దేవుళ్ళని అలాగే వదిలెయ్యకూడదు. గంగపాలు చేయాలి. గండకి నది గర్భంలో పుట్టిన ఆ సాలగ్రామాలు జలగార్భంలో దాగిపోవాలి అంతే!" రామచంద్ర అవాక్కైపోయాడు.

"ఈ యిల్లు....." ఆమె క్షణం సేపు ఆగి అంది "పాడు పెట్టకు. ఇక్కడ సంస్కృతం పాఠశాల పెట్టాలనుకొంటున్నారు యాజులు గారు. ఆయనకిచ్చెయ్. బడికి కాబట్టి తీసుకొంటాడు.

సాలగ్రామాల్ని యివచ్చు గానీ అయన దానం పట్టని మనిషి ఆయన్నెందుకు మనం భంగపరచాలి. ఇస్తామంటే తీసుకోడు. తిరస్కరించిన పాపం ఆయనకెందుకు."

తరతరలాడిపోయాడు. ఈ మనుషులకి యీ శివునికి ఎంత లంకె? తన యింట్లో పటాలున్నాయి. శశికళ 'మాస్టారు గారి ముందు గంటల తరబడి కుర్చోన్నట్టుగా ఉంటుంది.

నిజం ఇన్నేళ్ళు యీ యింటిని ఆశ్రయించుకొన్న యీ దేవతలు ఎమైపోతారు? ఎక్కడికి పోతారు. "తోటలు అన్ని తగ్గిపోతున్నాయి. మామిడితోట మీ నాన్నగారు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. అది ముసలిదై పోతుంది. నారింజ తోటలు పాడైపోయాయి. మెట్టపొలాలు సరైన అజమాయిషీ లేక బిళ్ళయిపోతున్నాయి." అందామె.

'నిజమే అనుకున్నాడు రామచంద్ర. అతనా సాయంకాలం అవన్నీ చూసొచ్చాడు అమ్మ చెప్పినట్టుగానే వున్నాయి. పూలయినా కాయలైనా పోషించి ఆదరించే వాళ్ళు లేకపోతే ఒట్టి పోతాయి. ఆశ్రయం యిచ్చే రాత లేకపోతే "అవి" కృశించిపోయినట్లుగా పోతాయి.

"నీ యిష్టం అన్నీ అమ్మేస్తానంటే వద్దనను. నాదేముంది ? ఒక కాలు అక్కడా ఒక కాలు యింట్లో.....ఈ కాలం ఎప్పుడో ఒకప్పుడు అక్కడ వేసేస్తుంది. జీవుడు గుటుక్కుమంటాడు. ఈ ప్రేమ యీ ఆత్మీయతా యీ అనుబంధం అంతా మట్టిలో కలిసిపోతుంది."

రామచంద్ర కళ్ళలో నీళ్ళు చిమ్మేయి. "అమ్మా" అన్నాడు బాధగా.

కాంతమ్మగారూ కళ్ళు తుడుచుకున్నారు. దేవుడి మందిరం వైపు అదోలా చూసి కదిలారు. మరో పది నిమిషాలకి రామచంద్ర కూడా బయటికి వొచ్చాడు.

కందిపచ్చడి, తోటకూర వేపుడు మామిడికాయ పులుసు మునక్కాయల చారు గడ్డ పెరుగు-తెల్లగా ముత్యాల్లా నెల్లూరు బియ్యమన్నం.

నాసా తర్పణంగా వుంది. రామచంద్రకు రుచి చచ్చిన నోటికి రుచి తెలిసినట్టుగా వుంది. ప్రేమ అంటే తెలీని వ్యక్తికీ ప్రేమమృతాభిషేకం జరిగినట్టుగా వుంది సౌందర్యం అంటే తెలియని మనిషికి సౌందర్య రసాదిదేవత సాక్షత్కారించినట్టుగా వుంది.

రాత్రంతా తల్లితో కబుర్లు చెప్పుకుంటూ కమ్మగా నిద్రపోయాడు. అతని మనస్సులో ఏదో సంకల్పం బీజప్రాయంగా ఏర్పడింది.

అర్ధరాత్రి!

హటాత్తుగా మెళుకువవైంది రామచంద్ర.

ఏవో కేకలు! హడావుడి! జనం పెట్టె ఆర్తనాదాలు! గలగలలు.

అటూ చూశాడు పక్క మీద తల్లిలేదు.

ఏమిటి చెప్మా అనుకుంటూ గేటు తీసుకుని వచ్చాడు చల్లగాలి విస్తున్నా వేడి సెగలు -పొగవాసనలు.

"ఏమిటి?"

పరుగెత్తుతున్న ఓ వ్యక్తిని అడిగాడు.

"రామయ్య ఇల్లు అంటుకోంది. అందరూ వెళ్ళి అర్పుతున్నారు. "పరిగెడుతూనే జవాబు చెప్పాడా వ్యక్తి. అతని వెంటే వెళ్ళాడు రామచంద్ర. లుంగీ , బనియన్ తో వెళుతున్నాననే స్పృహ లేదు.

అక్కడా........

ఉరిజనమంతా అక్కడే ఉన్నట్టుగా వున్నారు. కొందరు కడవలతో నీళ్ళు పోస్తున్నారు. ఇంకొందరు ఇంటిపైకి ఎక్కి మంటలార్పుటున్నారు. ప్రాణ ప్రమాదం లేదు. వస్తు నష్టం కలక్కుండా పశు నష్టం కలక్కుండా యదాశక్తిగా కాపాడుతున్నారు.

ఎవరో నిళ్ళ బిందె ఇచ్చారు. రామచంద్ర చేతికి! మంటల వెలుగు తప్ప వెలుగులేదు. ఆ ప్రయత్నంగా అందుకుని బెండె మరోవ్యక్తికి అందించాడతను. అంచెలంచెలుగా బిందెలు చేతులు మారుతున్నాయి. మంటలు అరిపోతున్నాయి.

ఒక గంటకు అగ్ని హొత్రుడు శాంతించాడు.

రామచంద్రకి చప్పున ఓ సంగతి గుర్తొచ్చింది. ఆర్నెల్ల క్రితం ఇలాగే తన డిపార్ట్ మెంట్ ప్రక్కన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ సర్విస్ వారికి ఫోన్ చేశారు. అంతే! ఎవరు తోడ్పడతారు? సానుభూతి లేదు. ఓదార్పు లేదు. తమకి పట్టనట్టుగా తమకి సంబంధించనట్టుగా చూస్తూ ఉండిపోయారు.

అక్కడికి యిక్కడికి తేడా?

ఇక్కడ ఆత్మీయత ఆరాటం, అనురాగం మూర్తిభావించిన మనుషులు, ఒక మనిషి ఆపద గ్రామ గ్రామానికి వచ్చినట్టుగా పడే అనుబంధం ఎక్కడి కెక్కడ రాక్షసులకి దేవతలకి ఉన్నంత తేడా.

అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు! అవే భావనలు రాత్రి బీజప్రాయంగా వున్న ఆ సంకల్పం యిప్పుడు మొలకెత్తింది.

నాలుగు రోజులు గడిచిపోయాయి. ప్రయాణమవుతున్నాడు రామచంద్ర. "మళ్ళీ ఎప్పుడు చూస్తాను- చూళ్ళేను" అందామె.

"అమ్మా!" ప్రేమగా పిలిచాడతను.

"చెప్పుబాబూ! రామచండ్రా! 'రామా' అని ప్రేమగా రోజు యీ చివరి రోజుల్లో పిలుచుకొవచ్చని ఆ పేరు పెట్టుకున్నాను. ఎంత పాపం చేసినా ఆజామిళుడు చివరి రోజుల్లో చివరి క్షణంలో నారాయణ అన్నందుకు ముక్తి పొందాడట! నేనెంత పాపం చేసుకున్నాను. నిన్ను రోజు నోరారా పిలుచుకునే అదృష్టానికి నోచుకోలేదు" ఆవేదనతో అందామె. 

 Previous Page Next Page