ఎండ మాడ్చేస్తుంది. దాహం వేస్తుంది.
ఎదురుగా "చెరకుపాల" గానుగ ఆడించి అమ్ముతున్నారు. అంతా చుట్టూ చేరి గ్లాసులు గ్లాసులు ఖాళి చస్తున్నారు. తను వెళ్లలనుకున్నాడు. కానీ తనూ తన హొదా! స్టేట్ బ్యాంక్ ఎంప్లాయి తను! డిప్యుటి జనరల్ మేనేజర్ కాబోతాడు త్వరలో! అలాటి తను వెళ్ళి ఒక సామాన్యుడిగా అలా గ్లాసు అందుకొని 'డ్రింక్' తీసుకోగలడా!
ఏర్ కండిషన్డ్ హొటల్స్ లో, కుషన్ చెయిర్స్ లో ఫ్రిజ్ లోంచి తీసిన డ్రింక్స్ కి అలవాటు పడ్డాడు తను.....
గొంతు తడారిపోతుంటే ఆగలేకపోయాడు. వెళ్ళి నుంచోగానే తన అడక్కుండానే ఓ గ్లాస్ అందించాడు కురాడు. ఎర్రగా సన్నని మిస కట్టులో హాలివుడ్ హీరోలా వున్నాడు. ఇదే బాంబే లో అయితే ఏ ప్రోడ్యుసరు చూసినా నిమిషాల మీద తన్నేసుకపోతాడు. లక్షలు యిస్తారు. కానీ వీడి అదృష్టం ఇలా వుంది గానుగ తిప్పుకుంటూ చేరుకుపాలు అమ్ముకుంటూ!.......
అంతలో టాక్సీ వచ్చింది.
"ఎక్కడున్నారు జనం! వీళ్ళంతా ఎక్కడికి వెళుతున్నారు. ఏమిటో ఈ అంతులేని ప్రయాణాలు ఇంత రద్దీగా జనం వున్నా యింకా నష్టం అంటారేం కార్పోరేషన్ వాళ్ళు! ఎక్కడికి పోతుంది యీ డబ్బు!"
టాక్సీ వద్దకు వచ్చాడు రామచంద్ర.
ఫస్ట్ డే ఫస్ట్ షోకి అమితాబ్ సినిమాకి వున్నంత ఫాలోయింగ్ వుంది జనం అంతా ఎక్కేశారు. చిమ దూరేంత సందు లేదు. అపుడే డ్రైవర్ తిరుగుముఖం ప్రయాణానికి ఇగ్నిషన్ కి మీద చెయ్యి వేస్తున్నాడు.
"హతాశుడయ్యాడు" రామచంద్ర.
ఆ రద్దీలో తను వెళ్ళలేననుకున్నాడు.
"ఎక్కండి సార్!" క్లీనర్ కురాడు అన్నాడు.
"ఎక్కడ! స్థలం లేదు."
"మీరు రండి! ఎలాగో సర్దుకోవాలి- ఇది తప్పితే మళ్ళీ నాలుగింటికి మేమే వెళ్ళి రావాలి"
"షటిల్ సర్విసా!"
వాడికి అర్ధం కాలేదు తెల్లముఖం వేశాడు.
"ఇంకో టాక్సీ తిరగదా"
"ఉహూ ఇదొక్కటే"
అంతలో టాక్సీ కదిలింది. అంతలో నలుగురు ప్రయాణికులు వచ్చారు. వాళ్ళని లోపలికి తోశాడు క్లీనర్. మరో నిమిషం తర్వాత పూర్ణ గర్భిణిలాగా వెళ్ళిపోయింది టాక్సీ. ఉస్సురుమన్నాడు.
మరో మూడు గంటలు వెయిటింగ్ హారిబుల్! సమ్మర్ లో యిలాగే నుంచుంటే తనకు సన్ స్ట్రోక్ ఖాయం.....ఎందుకు అర్దాంతరంగా పోవాలి. చప్పున బస్టాండ్ కు అటువేపు వున్న కార్ల వద్దకి వెళ్ళాడు. బాడుగ మాట్లాడుకొని ఎక్కి కూర్చున్నాడు! యాభయ్ రూపాయిలు పోయినా ఎంత హాయి.
కారు టవున్ లిమిట్స్ దాటింది. అటూ ఇటూ బారుగా ఎదిగిన చెట్లు, ఉటిలో లాగా చల్లని గాలులు, ఎగుడు దిగుళ్ళు అక్కడక్కడా వున్నా రివున జారిపోతుంది అంబాసిడర్. ఆబగా చూస్తున్నాడు రామచంద్ర.
దారికి అటూ ఇటూ అరటి తోటలు, పంట పొలాలు ఒకటోకటే గుర్తొస్తున్నాయి. తన హైస్కూల్ కి, కాలేజికి , యూనివర్సిటీలకి వెళుతూ చేసిన ప్రయాణాలు గుర్తుకొచ్చాయి.
కాలం గీచిన గితలకి మార్పు లేకుండా అలాగా ఒంటరి సైనికుడిలా నిలుచుంది. క్రింద కెనాల్ నీళ్ళు తగ్గిపోయి, పేద పడిన రైతు జీవితం లాగా వుంది. వెన్నెల్లో వేసవిలో అందాలు చిందే సుందరిలా నుంచున్నాయి దారి వెంబడి చెట్లు.
ఊరి ముందుకి వచ్చింది కారు. అదుగో చర్చి! అదుగో రామాలయం! అదుగో మసీదు! దారిలో ఏ మార్పు లేదు......ఊరు మధ్యకి వచ్చింది కారు.
రామచంద్ర సూచన మేరకు కారు యింటి ముందుకి వెళ్ళింది. పురాతన కట్టడంలా ఒంటరిగా నుంచుంది మేడ! రామచంద్రం గుండెల్లోంచి ఏదో ఆత్మీయత, ఏదో మమతానుబంధం తన్నుకొని వచ్చింది.
గేటు కిర్రుమని చప్పుడు చేసింది. పాతబడటం వల్ల, వసారాలో మంచం పై పడుకుని అద్యాత్మరామయణం కీర్తనలు పాడుకుంటున్న కాంతమ్మగారు గేటు చెప్పుడికి అటూ చూశారు.
"అమ్మా!"
తొలిసారిగా శిశువు కేక వేసినట్టుగా పిలిచాడు. ఆమెని చూడగానే.
"రామా!"
ప్రేమ స్వరతరంగితమై రసరమ్యమై తలపు పిలుస్తుంది. చప్పున వెళ్ళి పాదాభివందనం చేశాడు. అతన్ని అక్కున చేర్చుకుని ప్రక్కన కూర్చో పెట్టుకుంది. కారు వచ్చింది చూసిన జనం వాళ్ళ చుట్టూ పక్కల వాళ్ళు అంతా బిలబిలా వచ్చేశారు.
రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. శశికళను గురించి మంజూష ను గురించి అడుగుతున్నారు. ఆ జవాబులే తనకి అన్నట్టుగా పట్టుకున్న చేయి విడవకుండా ఆప్యాయంగా నిమురుతూ వింటుంది కాంతమ్మ.
కొడుక్కి తాగేందుకు నీళ్ళు, తినేందుకు టిఫిన్ ఇవాలని కూడా తోచలేదు ఆమెకి. ఆనందంతో అలాగే వుండిపోయింది.
"అమ్మయ్యా! అయ్యకు మంచినీళ్ళవవా" ఎవరో అన్నారు. కాంతమ్మ లేచింది. ఆమె వెంట రామచంద్ర కూడా లేచాడు.
గడప దాటుతూ వుంటే తొలిసారిగా ఉద్యోగం వచ్చినప్పుడు బ్యాంక్ గడప దాటిన వేళ కలిగిన అనుభూతి గుర్తుకొచ్చింది. ఇల్లంతా మాసిపోయాక పోయినా గోడలు పాతబడి పోయాయి. ఎంత వెల్ల వేయించినా యింకా వృద్దాప్యం కనిపిస్తోనే వుంది. కాంతమ్మ గారు కూడా బాగా తగ్గిపోయారు. మనిషిలో అలసట, బలహీనత కనిపించకపోయినా వృద్దాప్యం కనిపిస్తోంది.
కుండలో నీళ్ళు గ్లాసుతో ముంచి యిచ్చింది. కంచు గ్లాసు! నీళ్ళు ఫ్రిజ్ లో కంటే చల్లగా ఉన్నాయి.
"వానాకాలంలో కొన్న ముంత అందుకే చల్లగా వున్నాయి " అందామె. సున్నివుండలు, కారప్పూస, కజ్జికాయలు, జంతికలు, చక్రాలు ఒక్కొక్కటే తెచ్చి ప్లేటులో పెట్టింది.
కట్లెట్స్, అమ్ లెట్స్ రసగుల్లాలు, బాదుషాలు తిన్న రామచంద్రంకి మళ్ళీ తన తెలుగు తిండి గుర్తుకొచ్చింది! ఒక్కొక్కటే ఆప్యాయంగా ఆబగా తినసాగాడు.
"శశి బావుందా? మంజు చదువు అయిపోతుందా! వాడెప్పుడోస్తాడు. రామా! అందరూ రాకుడదట్రా! మళ్ళీ చూస్తానో లేదో?"
"అమ్మా!" ఆ మాట వినలేనట్టుగా అన్నాడు.
"అవును నాయనా! పండుటాకు రాలిపోకుండా ఎన్నాళ్లుంటుంది? మీ నాన్నగారు చెప్పేవారంట- అది కాలధర్మంట!"