Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 32


    సిద్దార్ధకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ చిన్ని లోపాన్ని సరిచేసే ఎఫిషియంట్ కావాలి.... తనాపనిచేయగలడా?
    "ఒరే సిద్దూ....ఏమిట్రా అలోచిస్తూన్నావు"
    "పతీ....విరజ గుండె ముందు భాగంలో ఒక ధమని సరిగ్గా పనిచేయడం లేదు..." డాక్టర్ సిద్దార్ధ చెప్పాడు.
    "అంటే..యిప్పుడా గుండె...." షాకింగ్ గా అడిగేడు మహాపతి.
    "ఆ గుండెకు మరమ్మత్తు చేయాలి.... అలా చేయగలిగే మంచి ఎఫిషియెంట్ కావాలి...."
    "నువ్వు...నువ్వు చేయలేవా? నిన్ను మించిన..."
    "గుండె మార్పిడి శస్త్రచికిత్స నేరు....చిన్న మరమ్మత్తుచేయడం వేరు....నేనిక్కడ చేయగలనా? లేనా? అన్నది కాదు... నకా మరమ్మత్తు విషయంలో ఓ వ్యక్తి తోడ్పాటు కావాలి..."
    "అలాంటి వ్యక్తి ఎవరైనా వున్నారా? ఉంటే వెంటనే పిలిపించరా... ఈ ప్రపంచంలొ ఏ మూలనున్నాసరే..."
    డాక్టర్ సిద్దార్ధ బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేయడం ప్రారంభించింది. సడన్ గా గుర్తొచ్చిందా విషయం.
    "ఒరే పతీ....యూ ఆర్ లక్కీ..." వన్ సెకన్ అంటూ ఎవరికో ఫోన్ చేశాడు. ఆ తర్వాత డాక్టర్ సిద్దార్ధ మొహం వెలిగిపోయింది.
    "రియల్లీ యూ ఆర్ లక్కీరా.... లండన్ కు చెందిన ప్రొఫెసర్ రాబిన్ మార్క్ ఇక్కడే ఉన్నారు.... ఓ సెమినార్ అటెండ్ అవడం కోసం వచ్చారు...అతడ్ని మనం పికప్ చేసుకోవాలి. ఇమీడియట్ గా...' చెప్పాడు గబగబా డాక్టర్ సిద్దార్ధ.
    'వెంటనే అతడ్ని పిలిపించరా...' చెప్పాడు కారు కీస్ తీస్తూ.
    'అతను హైటెక్ సిటీలో ఉన్నాడు.... ఈ ట్రాఫిక్ లో అతడు రావడానికి ఎంతలేదన్నా.... గంటకు పైగా పడుతుంది... ఎలా?'
    మహాపతి బ్రెయిన్ చురుగ్గా పన్జేస్తోంది. మహాపతి వెంటనే సెల్ ఫోన్ తీసి ఎవరెవరికో ఫోన్లు చేశాడు.
    రెండు నిమిషాల్లో ఫోన్ పెట్టేసి 'ఒరే సిద్దూ... సరిగ్గా ఐదు నిమిషాల్లో మన హాస్పిటల్ ప్రెమిసిస్ లో హెలీకాఫ్టర్ ఉంటుంది. నువ్వు ప్రొఫెసర్ రాబిన్ మార్క్ కు ఫోన్ చేసి విషయం వివరించు..... హెలికాఫ్టర్ లో అతడ్ని పికప్ చేసుకుందాం....ఇరవై నిమిషాల్లో మన దగ్గరుంటాడతను...'
    సిద్దార్ధ ఒక్క క్షణం మహాపతి కేసి చూశాడు. అతి తక్కువకాలంలో దేశంలోని టాప్ టెన్ మిలియనీర్స్ లో అతనొక్కడు ఎలా అయిందీ అర్ధమైంది. మహాపతి లాంటి వ్యక్తి తల్చుకుంటే హెలీకాఫ్టర్ క్షణాల్లో అరేంజ్ చేయడం కష్టమేమీ కాదు.'
    'వెరీగుడ్ మిస్టర్ పతీ.... యూ హేవ్ డన్ ఎ గుడ్ జాబ్...' అంటూ వెంటనే ప్రొఫెసర్ రాబిన్ మార్క్ కు ఫోన్ చేశాడు.
    
                                * * *
    
    చాలా టెన్షన్ గా ఉంది.
    హెలికాఫ్టర్ ప్రొఫెసర్ ని పికప్ చేసుకోవడానికి వెళ్ళింది.
    'ఈ ప్రాబ్లెం ఏమిట్రా?' అయోమయంగా అడిగాడు మహాపతి.
    'పెద్ద వర్రీ కావల్సింది ఏమీ లేదు. ఇది చిన్న లోపమే.... అయినా మరో ఎఫీషియెంట్ సలహా, సహకారం కోసమే ప్రొఫెసర్ ని పిలిపిస్తున్నాం..... ఇలాంటి విధానం బ్రిటన్ వైద్యులు అనుసరిస్తున్నారు.
    చిన్నచిన్న లోపాలు వున్న అవయవాలను మరమ్మత్తు చేసి రోగులకు అమర్చే విధానం ఒక మంచి ఆలోచన.
    బ్రిటన్ లోని న్యూకాసిల్ లోగల ఫ్రీమన్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ జాన్ డార్క్ ఇటువంటి పలు ఆపరేషన్లు నిర్వహించారు. తీవ్రమైన హృద్రోగంతో బాధపడే ఓ రోగికి గుండె అమర్చడానికి పూనుకున్నాడు. అయితే ఓ దాత ఇచ్చిన ఆ గుండె ముందు భాగంలో ఓ ధమని పనిచేయడం లేదు. వెంటనే ప్రొఫెసర్ జాన్ డార్క్ పావుగంటలో ఆ లోపాన్ని సరిచేసి శస్త్రచికిత్స ను విజయవంతం చేశారు. సైన్స్ సాధించిన ప్రగతి ఇది. ఒక విధంగా ప్రొఫెసర్ జాన్ డార్క్... మరో సృష్టి చేసి, పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.
    (* పై సంఘటన బ్రిటన్ లో నిజంగా జరిగినదే..... ప్రొఫెసర్ జాన్ డార్క్ కు సంబంధించిన వార్త ఇటీవల పత్రికల్లో వచ్చింది. -రచయిత్రి)
    'ప్రొఫెసర్ జాన్ డార్క్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఈ ప్రొఫెసర్ రాబిన్ మార్క్' చెప్పాడు డాక్టర్ సిద్దార్ధ.
    సరిగ్గా మరో పదినిమిషాల తర్వాత హెలికాఫ్టర్ ఆసుపత్రి ప్రెమిసిస్ లో దిగింది. డాక్టర్ సిద్దార్ధ, మహాపతి అతని కెదురు వెళ్ళి తీసుకువచ్చారు.
    
                                  * * *
    
    సరిగ్గా పదిహేను నిమిషాల్లో ప్రొఫెసర్ రాబిన్ మార్క్ విరజ గుండెకు మరమ్మత్తు చేశాడు. గుండె ముందు భాగంలోని ధమని పని చేయడం ప్ర్రారంభమైంది.
    
                                * * *
    
    విరజ డెడ్ బాడీని మార్చురీలోకి తీసుకువెళ్తున్నారు స్ట్రెచర్ మీద.
    అద్వైతకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువస్తున్నారు. రెండు స్ట్రెచర్ లో ఒకదానికొకటి ఎదురెదురయ్యాయి. ఓ స్ట్రెచర్ మార్చురీ వైపు, మరో స్ట్రెచర్ ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళాయి.
    విరజ మీద తెల్లగుడ్డ పూర్తిగా కప్పబడి ఉంది.
    'నా గుండెను నీకు ఇచ్చేసి నేను వెళ్తున్నాను ఫ్రెండ్'
    'నీ గుండెను స్వీకరించి, నా ఆయుష్షును నీ ద్వారా పొందుతున్నాను నేస్తం'
    అక్కడ మాటల్లేవు.... గుండె, గుండెకూ వుండే భాష తప్ప.
    విరజ తల దగ్గర సెల్ ఫోన్ స్ట్రెచర్ కదిలినప్పుడల్లా అటూ ఇటూ వూగుతోంది.
    సరిగ్గా అప్పుడే...
    
                                * * *
    
    టైం చూసుకున్నాడు అభినయ్. ఎయిట్ థర్టీ.... అతని మనసేదో కీడునుశంకిస్తోంది. ఇంతసేపైనా తన విరజ రాకపోవడమేమిటి? తనకేమీ అవ్వలేదు కదా...
    ఆ ఆలోచనే అతను భరించలేకపోయాడు. అప్పుడు వచ్చిందా ఆలోచన....విరజకు సెల్ చేస్తే.... ఛఛ... ఈ పని గంట క్రితమే చేయాల్సింది. తన బుర్ర ఎందుకు పనిచేయడం లేదు? అలా ఆలోచించిన మరుక్షణమే విరజ సెల్ కు ఫోన్ చేశాడు.
    

                                * * *
    
    విరజ డెడ్ బాడీని మార్చురీలోకి తరలించారు.
    బాడీ ఫ్రీజర్ బాక్స్ లొ విరజ శవాన్ని భద్రపరిచారు. ఎటువంటి రసాయనాలతో సంబంధం లేకుండా, చనిపోయిన వ్యక్తి శవాన్ని పదిహేను రోజులపాటు భద్రపర్చవచ్చు. పొరపాటున విరజ శవంతోపాటు, సెల్ ఫోన్ కూడా బాడీ ఫ్రీజర్ బాక్సులోకి చేరిపోయింది.
    బాడీ ఫ్రీజర్ బాక్సులో వున్న సెల్ రింగయింది. బాడీ ఫ్రీజర్ బాక్సులో ఆ రింగ్ సౌండ్ ప్రతిధ్వనిస్తోంది. అదే పనిగా సెల్ రింగవుతూ ఉంది.
    ఆ క్షణం... రసాయనాలతో గాజు బీకరులో భద్రపరచబడిన విరజ గుండె కొట్టుకుంటోంది. తన ప్రాణం తన సర్వం పిలుస్తోన్న పిలుపుకు ఆ గుండె ఆర్తిగా కదిలిపోతోంది నీ కోసం, నా గుండె కొట్టుకుంటోంది.... నా సవ్వడి విను.... అంటున్నట్టుంది.
    
                                 * * *
    
    షిట్.... విరజ సెల్ ఎందుకు ఆన్ చేయడం లేదు. సెల్ విరజ దగ్గర లేదా?
    విరజే ఈ లోకంలో లేదు.... అనే విషయం అతనికి తెలియదు.
    అదే పనిగా ఆ సెల్ కు రింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆమె గుండె కొట్టుమిట్టాడుతూ తపిస్తూ, సవ్వడి చేస్తూనే ఉంది.
    అతనో నిర్ణయానికి వచ్చాడు.
    
                                * * *
    
    కాదంబరి మరోసారి తన రిస్ట్ వాచీ వంక చూసింది. ఎయిట్ థర్టీ దాటింది.
    ఇంతవరకూ మేడమ్ రాలేదు. అభినయ్ కూడా రాలేదు. విరజ ఇంటికి ట్రై చేస్తే? పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం చుట్టూ చూసింది. మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.

 Previous Page Next Page