Previous Page Next Page 
మణిదీపం పేజి 31

    "మాట వరుసకి కాదు. మాటంటే మాటే. ఒకరోజు మీ ఇంట్లో దాసీగా పని చేస్తాను" పట్టుదలగా అంది అరుణోదయ.

    "ఛఛ! చూసినవాళ్ళు ఏమనుకుంటారు మీరొచ్చి మా ఇంట్లో పనిచేస్తుంటే?"

    "ఆటలో ఓడిపోయి నాకు దాసీ అయిందని చెప్పండి."

    "ఛీ ఛీ! ఏం మాటలవి?" నొచ్చుకున్నాడు అరవింద్. "అసలు నేను ఆడకపోతే బాగుండేది."

    "ఆముదం చెట్టు మహా వృక్షంకాదు చిన్న చెట్టు అని ప్రపంచానికి తెలిసేదెలా?"

    "అది నేను గెలిచిన గర్వంతో అన్నమాట. ఆట మూడోవంతు వరకు నన్ను మూడు చెరువుల నీళ్ళు తాగించారు. ఎదుటి మనిషి సామర్ధ్యాన్ని ఒప్పుకునే నిజాయితీ వుంది నాకు."

    "అందుకే మీలాంటి మంచి మనిషి దగ్గర పని చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మన పందాన్ని అక్షరాలా అమలుపర్చనీయండి. దయచేసి ఏ అడ్డంకులూ కల్పించకండి."

   
                             *    *    *    *    *


    అహల్యను ఆ రోజు డిశ్చార్జి చేశారు.

    ఆమె వెళ్ళేముందు చెప్పాడు అరవింద్ "మీకు కథలంటే యిష్టముగా? మీకో కథ చెబుతాను. రోజా అందమైన అమ్మాయి. కాలేజి స్టూడెంట్. లక్షాధికారికి ఏకైక కుమార్తె. వాళ్ళ క్లాసులో ఇద్దరు అబ్బాయిలుంటారు. మురళి, వేణు, మురళి చాలా అందగాడు, డబ్బున్నవాడు. కాని చదువులో అంతంత మాత్రం. కొంచెం అల్లరి చిల్లర టైప్. వేణూది మామూలు అందం. మధ్యతరగతివాడు. కాని ఇంటెలిజెంట్. జెంటిల్ మేన్ కూడా. ఇద్దరూ రోజా ప్రేమ కోసం పోటీపడతారు. ఆ ఇద్దరిలో రోజా ఎవరిని వరించడం సబబో మీరు చెప్పండి."

    "నా ఓటు మురళికే. మంచి ఈడూ జోడూ తరువాతే యింకే విషయమైనా,"  

    "రోజా కూడా సరిగ్గా మీలాగే ఆలోచించింది. అందమయిన కలల్లో తేలిపోయే ఆడపిల్లకి అందం ఒక్కటే ప్రముఖంగా కనబడుతుంది. అందమైన మురళి మెడలో వరమాల వేసింది. కాని సరిగ్గా ఏడాది తరువాత అందమైన ఆ ముఖాన్ని యాసిడ్ పోసి కాలుస్తుంది."

    "మైగాడ్! ఎందుకలా చేసింది?"

    "ఆ అందమే తనను గుడ్డిదాన్ని చేసిందన్న కోపం. అతడికి అన్ని దుర్గుణాలున్నాయి. తాగుడు, జూదం, ఆడపిల్లల షోకు_ఇలా అన్ని చెడు అలవాట్లున్న ఆ మహాపురుషుడికి భార్య అంటే అపనమ్మకం ఆమె శీలం మీద, ఆమె మనసు మీద. సిగరెట్లతో కాల్చేవాడు. ఆమెకు నెల తప్పితే ఆ నెల తనవల్లకాదు ఇంకెవరివల్లో తప్పిందంటాడు. బలవంతంగా అబార్షన్ చేయిస్తాడు. ఇలా అడుగడుగునా ఆమెను చిత్రహింస పెడతాడు. రోజా చివరికో రోజు తిరగబడుతుంది. అందమయిన ఆ ముఖం మీద యాసిడ్ పోసి కసి తీర్చుకుంటుంది."

    "ఆ తరువాత?"

    "కథ విషాదాంతం చేయమంటారా? సుఖాంతం చేయమంటారా?"

    "నాకు విశాదాన్తాలు యిష్టముండవు. సుఖాంతమే చేయండి."

    "వేణు గుండెలో గుడికట్టి ఆమెను ఆరాధిస్తూనే వుంటాడు. మోసపోయిన రోజాను ఆర్తితో గుండెలకు హత్తుకుంటాడు. మ్రోడయిన ఆమె జీవితం అతడి సాహచర్యంలో చివురులు వేస్తుంది."

    "బాగుంది కథ. కాని చిన్నపిల్లలకి చెప్పండి. అందమైన మగాళ్ళంతా దుర్మార్గులూ, అందవిహీనులంతా గుణవంతులంటే ఎవరు నమ్ముతారు? మా మేనత్త ఒకామె వుంది. అచ్చు నాలాగే అందంగా వుటుంది. ఆమె భర్త మాత్రం ఎలుగుబంటిలా భయంకరంగా వుంటాడు. ఆమెను క్షణం క్షణం వేపుకుతింటాడు. మా అన్నయ్య మంచి అందగాడు. అతడి భార్య మామూలుగా వుంటుంది కాని ఆవిడంటే మా అన్నయ్యకి ఆరోప్రాణం. ఆమెమీద ఈగ వాలనివ్వడు. దీనికేమంటారు?"

    "అదేకదా నేను చెప్పేది? పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు వేమనకవి. ముందు మీ వారినీ మిమ్మల్నీ చూసి బొత్తిగా ఈడూ జోడూ కాదు అనుకున్నాను. కాని అతడిని అబ్జర్వ్ చేశాక అంత మంచి మనిషిని భర్తగా పొందడం మీరు చేసుకున్న పుణ్యం అనిపించింది."

    "ఏమిటిట అంత మంచితనం?"

    "పెద్దగీత పక్కన చిన్నగీత పెడితేనే పెద్ద గీత అవుతుంది. అలాగే ఒకరి మంచితనం తెలియాలంటే మరొకరి చెడుకు పోల్చాలి. అప్పుడది మరింత ఎక్కువై కనిపిస్తుంది. భార్యలను సిగరెట్లతో కాల్చే వాళ్ళు, శీలాన్ని శంకించి హింసించేవాళ్ళు, కిరాతకంగా ఒళ్ళు కుళ్ళబొడిచే వాళ్ళు-అలాంటి పురుషులు అధిక శాతం వున్న ఈ సమాజంలో భార్యను అపురూపంగా, అత్యంత అభిమానంగా చూసుకునే జగన్మోహన్ ని పొందడం మీ అదృష్టం కాదా?"

    "అదృష్టమో, దురదృష్టమో_ఆ ముఖం చూడాలంటేనే నాకసహ్యం. నా తల్లిదండ్రులు ఉరేసుకు చస్తారన్న భయం లేకపోతే ఎప్పుడో అతడిని వదిలేసి పారిపోయేదాన్ని."

    "అతడి మంచితనాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి. అతడి ముఖంకూడా డెఫినెట్ గా ప్రీతిపాత్రమౌతుంధి మీకు. బలవంతమో, రాసిపెట్టో మీరతడికి భార్య అయ్యారు. మీ అమ్మానాన్న భయానికో, సంప్రదాయంపట్ల గౌరవమో ఆ తాళిని తెంపుకుపోలేదు. అలాంటప్పుడు మీ మధ్య వున్న బంధాన్ని ఇష్టంగా మార్చుకోవడం తెలివయినవాళ్ళు చేసే పని. ప్రతిక్షణం ముక్కుపట్టుకు వున్నట్టుగా వుంటే అతడికి సుఖంలేదు. మీకూ సుఖంలేదు. కలిసి అన్యోన్యంగా జీవించడం కూడా ఒక కళ. ఇన్ని పుస్తకాలు చదివే మీరు ఆ కళ నేర్చుకోలేదంటే నాకు మిమ్మల్ని చూసి జాలిపడాలనిపిస్తుంది. జీవితానికి బాట చూపని పుస్తకాలు చదివి లాభం ఏమిటి?"   

 Previous Page Next Page