బస్టాపులో నుంచుని బస్సు కోసం ఎదురు చూస్తున్న అతనికి వసంత కనిపించింది. అతనికి గుండెల్లో దేవినట్టయింది.
చూసీ చూడనట్టు ముఖం తిప్పుకున్నాడు.
కానీ "హలో సుధాకర్" అంటూ చొరవగా వచ్చేసింది వసంత.
బలవంతంగా ముఖం మీదికి నవ్వుని తెచ్చుకుని "హలో" అన్నాడతను.
"మీరీ మధ్య అటు కాలేజిలోనూ యిటు ఎక్కడా కనిపించటమేలేదు. ఎక్కడికైనా వెళ్ళేరా?"
"లేదు."
పేలవంగా నవ్వాడు.
"ఒకటే బిజీ! జీవించటానికి క్షణక్షణమూ పోరాడుతున్నాను."
పీక్కుపోయిన అతని ముఖమూ, కాంతిని కోల్పోతున్న అతని కళ్ళూ, అతని నిరుత్సాహమూ, అతని ఎక్వియరెన్స్ చూసీ ఆటను చాలా జబ్బుపడి తేరుకున్నాడేమోనని పించిందామెకు. "జబ్బు పడ్డారా?" అని అడిగింది తీవ్రంగా.
"సుధాకర్! నన్ను గాబరా పెట్టి చంపకండి. జీవితంలో రోజుల్ని ఎలా హాయిగా గడపొచ్చో నాకు తెలియ జెప్పారు మీరు. జీవితంలో రుచి చూపించింది మీరు. మీరు తప్ప మరే స్నేహంలేదు నాకు. మీకోసం వెతుకుతున్నాను నేను యిన్ని రోజులనుంచీ. మేం యిల్లు మారటం వలన తిరిగి ఆ వీధికి రాలేకపోతున్నాను. మీరు కాలేజిలో కనిపిస్తారేమో, ఇలా అవుపడతారేమోనని చాలా రోజులనుంచి వెతుకుతున్నాను"
"వసంతా! మా కుటుంబం పరిస్థితిలు చాలా దుర్భరంగా వున్నాయి. ఏ పూటకి ఆ పుటగా సంపాదించుకుని బ్రతుకుతున్నాం. ఎలా అయింది? దీనికెవరు బాధ్యులంటే చెప్పలేను. స్వార్ధం ఆడించిన ఆటలో మేం ఓడిపోయాం."
"మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు"
అతని గుండెల్లో మంటలు చెలరేగాయి.
"ఈ ఎగ్జామ్స్ కాగానే పెళ్ళి చేసేస్తారట."
"---- ---"
"నేను మీతో యీ విషయం మాటాడాలని-"
"ప్లీజ్ వసంతా! నన్ను మరిచిపో - నిన్ను పెళ్ళి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేయలేను."
"సుధా!"
"అవును వసంతా! నిన్ను మా యింటికి మీ నాన్నగారు చచ్చినా ఇవ్వరు. ఒకవేళ మనం తెగించి పెళ్ళి చేసుకున్నా నిన్ను ఎలా సాకాలి? తాదూర కంత లేదు మెడకో డోలు అన్నట్టుగా అవుతుంది నా స్థితి. నన్ను మరిచిపో- పరీక్షలు బాగా వ్రాసి పాసుకా. మీ నాన్నగారు చుసిన సంబంధం చేసుకో-"
"స్టాపిట్ సుధాకర్! ఇది బస్టాండు. మనకి దూర దూరంగా మనుషులున్నారు. నేను ఇంతకంటే గట్టిగా మాటాడలేను. కానీ నీవనుకున్నంత సులభంగా తెగిపోదు మన వ్యవహారం-"
"అదిగో నీ బస్-"
"మన రూట్స్ భిన్నం- అయినా యీ క్షణంలో విడిపోతున్నా రేపు తప్పక ఆ బంగళాలో కలుద్దాం- యేదో మార్గం ఆలోచించాలి. ప్లీజ్ ఎలాగయినా రేపు కలుసుకో." అని బస్ రాగానే వెళ్ళిపోయింది వసంత.
ముందు తమాషాకి కులసాకి ఆమెతో స్నేహం చేసినా స్నేహం ముదిరాక నిజంగానే వసంత అతని మనస్సు దోచుకుంది.
ఆమె సిన్సియారిటీ - ఆమె అమాయకత్వమూ, ప్యూరిటీ అతన్ని జయించేయ్.
కానీ పరిస్థితులే విషమించాయి.
నిజంగా యీ పరిస్థితుల్లో అతనికామె గుదిబండే!
ఆమె ఆలోచనల్లో మునిగివున్న అతనికి బస్ రావటం కనిపించలేదు. కానీ కదిలిబోయే క్షణంలో స్మృతికి వచ్చి బస్ ఎక్కేడు.
సీట్లో కూర్చుని టికెట్ తీసుకుని తలతిప్పి చూసిన అతనికి గుండె జల్లుమంది!
ఆ వ్యక్తి!
తనని బానిసగా చేసుకుని, కానీ పనులన్నీ చేయిస్తున్న ఆ వ్యక్తి.
చావు నవ్వు నవ్వేడతను.
"నీ కోసమే వద్దామనుకుంటున్నాను. నీవే కనిపించావు"
"ఏమిటో పని."
"బస్ దిగనీ చెపుతాను నెక్స్ టు స్టాపు కాక తర్వాత స్టాపులో దిగు. నేనూ దిగుతాను" అన్నాడు.
మరో అయిదు నిమిషాల్లో దిగేశారు.
ముందుకి నడుద్దాం."