"ఎలా వచ్చేది?"
"ఏం?"
"మంజుకి ఎగ్జామ్- ప్రియతమ్ ఈ ఆదివారం వస్తానని రాశాడు. వాడొచ్చేసరికి యిద్దరూ లేకపోతేయెలా?"
"వచ్చాక ఎలాగూ వుంటారు కదా! మంజు ఎగ్జామ్స్ రాస్తుంది. ఏం భయం లేదు. మనం వెళ్ళి రావొచ్చు. ఒకటి రెండు రోజులు ఆలస్యమయినా నే వచ్చేస్తా. మీరిద్దరూ కలిసి రావొచ్చు. "శశి సమాధానం ఇవలేదు.
రామచంద్ర స్నానానికి వెళ్ళాడు. శశికళ కిచెన్ లోకి వెళ్ళి మరో అయిదు నిమిషాల్లో కాఫీ కలుపుకొని వచ్చింది. బాత్ రూం నుంచి తిరిగి వచ్చిన రామచంద్ర కాఫీ తాగేడు.
"బావుంది."
"ఏమిటి?"
"కాఫీ- వెరి నైస్"
"రోజు తాగేదే కదా"
"రోజు తిన్నన్నమే తింటున్నాం- తాగుతున్న నీరే తాగుతున్నాం. చేసున్న సంసారమే చేస్తున్నాం. రోజు అదే చారు పొడి, అదే నీళ్ళు అయినా రోజు రోజుకో రుచి. జీవితం నవనవోన్మేషమైంది. అందుకే రుచి కనపడుతుంది. జీవితంపై ప్రేమ పుడుతుంది." శశికళ జవాబుగా నవ్వేసింది.
అంతలో మణి మంజూష వచ్చింది. "గుడ్ మాణింగ్ డాడీ" అంటూ తండ్రి భుజాలపై వాలిపోయింది.
"గుడ్ మాణింగ్ అప్పుడె లేచావేమామ్మా?"
"ఎగ్జామ్ కదా! అందులో నువు వూరేళుతున్నావాయే . మళ్ళీ వారానికి కానీ రావు ఎలా డాడీ?" నవేశాడు రామచంద్ర.
"నాకు భలే కోపంగా వుంది డాడీ! మీరు ప్రయాణం యింకో నెల ఆగి పెట్టుకోరాదూ! నేను వచ్చేదాన్ని! నానమ్మని చూసి ఎన్నేళ్ళయింది. పూర్ నానమ్మ ఒక్కతి పల్లెలో ఎలా వుందో ఏమో, ఎలా పాసవుతుంది టైం! ప్చ్"
"పోనీ తోడుగా నువేళ్ళీ వుండరాదుటే" అంది శశికళ.
"ఓ మైగాడ్! ఆ పల్లెటుల్లోనా! ఒక సినిమా లేదు. ఒక పార్క్ లేదు. ఒక లైబ్రరి లేదు బయటకు వెళ్ళేందుకు ఒక స్పాట్ లేదు. పొద్దెలా పోతుంది?
"పొలాలన్నీ తిరిగొస్తే సరి"
"ఒక్కరోజు- రెండు రోజులు- తర్వాత."
"తిరిగిన పొలాలే తిరిగేది. చూసిన తోటనే చూస్తేసరి."
"పో డాడీ, బోర్ కొట్టదా?"
"ఇక్కడ నువు చూసిన పార్కె చూట్టం లేదా!"
"డాడీ పార్కుకి నిమిషా నిమిషానికి అందం మారుతూ వుంటుంది గంట గంటకి మనుషులు మారుతూ వుంటారు. ఇక్కడ లైఫ్ అక్కడి లైఫ్ వేరు డాడీ! అసలు మీరు వుండగలరా అక్కడ" సూటిగా ప్రశ్నించింది మంజూష.
;మై గుడ్ నెస్! అక్కడా' అనుకుని నవేశాడు.
మరో అరగంటకి టాక్సిలో స్టేషన్ కు వెళ్ళిపోయాడు రామచంద్ర.
రాత్రంతా రైలు ప్రయాణం. స్టేషన్ లో స్నానం చేసి కాంటిన్ లో టిఫిన్ ముగించుకుని బస్ స్టాండు వచ్చి బస్సెక్కాడు. ఆరుగంటల ప్రయాణం తర్వాత మిట్ట మధ్యాహ్నం వేళకు నంద్యాలలో దిగాడు. అక్కడ బస్ స్టాండులో లంచ్ ముగించుకున్నాడు. హోటల్ మెతుకులయినా ఆ బియ్యం, ఆకుకూరలు ఎంతో రుచికరంగా అనిపించాయి.
బస్టాండులో చింత చెట్టు క్రింద నుంచున్నాడు రామచంద్ర. తన ఊరికి బస్సు లేదు యిన్నేళ్ళయినా! ఊరురికి , బస్సు పధకంలో కూడా తన ఊరికి బస్సు రాలేదు. పబ్లిక్ టాక్సీలే తిరుగుతున్నాయి.
చెప్పాడానికి ఆచరణతో చూసేదానికి ఎంత తేడా! ప్రభుత్వం తప్పు కాదు, పాలకులది తప్పు కాదు. ఎలక్షన్ సమయంలో మాటల తీపిదనానికి మనుష్యుల గారడికి లొంగిపోయి ఓట్లు వేసే ప్రజానీకంది తప్పు.