స్ట్రెచర్ మీది నుంచే తలను కాస్త పైకి లేపి, అద్వైత ముఖాన్ని రెండు చేతులతో స్పృశించింది.
* * *
సెవన్ పి.యమ్.
అభినయ్ ఎయిర్ పోర్ట్ అంతా కలియ తిరిగాడు. తన విరజ రాలేదు. "నేనొచ్చే వరకూ నువ్వు అక్కడే వుండు... నేనే నిన్ను రిసీవ్ చేసుకోవాలి...." అన్న విరజ మాటలు గుర్తొచ్చాయి.
'ఆరోజు సీత లక్ష్మణరేఖ దాటినా, నేను మాత్రం నీ మాట దాటను" అన్న తన మాటలూ గుర్తొచ్చాయి.
విరజ యింత ఆలస్యం చేయదు. అయిదు నిమిషాల ముందే వుంటుంది. అలాంటి విరజ యింకా ఎందుకు రాలేదు? వెంటనే యింటికి ఫోన్ చేశాడు. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా విరజ 'ఆన్ దవే' లో వుండి వుండొచ్చు. తన కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకురావడంలో ఆలస్యం జరిగి వుండొచ్చు.
పోనీ విరజ సెల్ కు ట్రయ్ చేస్తే....? తనదసలే ఫాస్ట్ డ్రైవ్.... ఈ టైంలో సెల్ చేసి డిస్ట్రబ్ చేయడం ఎందుకు? అనీజీగా వెయిట్ చే...స్తూ...నే....వు....న్నా....డు.... అభినయ్.
* * *
కాదంబరి ఓసారి తన రిస్ట్ వాచీ వంక చూసుకుంది. సెవన్ థర్టీ....! సెవన్ కల్లా తనని యిక్కడ వుండమని చెప్పిన మేడమ్ యింకా ఎందుకు రానట్టు...ఫ్లయిట్ లేటా?
ఆమె చేతిలో రెండు ఖరీదైన గులాబీ దండలు వున్నాయి. తను ఎంతో హేపీగా వచ్చింది. వాళ్ళ పెళ్ళికి తనే సాక్షి అయినందుకు సంతోషంగా వుంది. వాళ్ళ పెళ్ళి చూసే అదృష్టం తనొక్కరికే వుందని సంబరపడింది. కానీ యిదేమిటి? మేడమ్ యింకా ఎందుకు రానట్టు...? ఆమెలో రాన్రాను ఆత్రం ఎక్కువవుతోంది.
* * *
"డాక్టర్..."
"యస్ మిస్ విరజా...."
"సే మిసెస్ విరజా అభినయ్... మానసికంగా నాకెప్పుడో నా అభీతో పెళ్ళయింది డాక్టర్...."
డాక్టర్ షాకయ్యేడు.... ఇలాంటి క్రిటికల్ పొజిషన్ లో కూడా ఆమె తన ప్రేమను మరిచిపోలేదు.
"డాక్టర్.... మరికొద్ది సేపట్లో నా శరీరం నుంచి నా గుండెను వేరు చేస్తారు... నా శరీరం చలనం కోల్పోతుంది. ఈలోగా ఒక్కసారి నా అభినయ్ తో మాట్లాడాలి.... తనొచ్చే వరకూ నేను బ్రతికివుండక పోవచ్చు. అయినా నేను తను వచ్చేసరికి చ...చ్చి....పో...వా....లి... యస్ డాక్టర్... నా చావు గురించి అభినయ్ తెలుసుకొని, కదిలిపోవడం నేను చూడలేను.
నేనిక బ్రతకను అని తెలిసిన మరుక్షణం నా అభి కుప్ప కూలి పడిపోతాడు. అతన్ని ఓదార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. వున్న నేను, ఈ ప్రపంచాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అందుకే ఈ చివరి క్షణాల్లో నా అభీ గొంతు వినాలి...నా అభీతో మాట్లాడాలి... ప్లీజ్..."
డాక్టర్ వెంటనే విరజ చెప్పిన సెల్ నెంబర్ కు ఫోన్ చేశాడు.
* * *
సెవన్ ఫార్టీ...
అభినయ్ చాలా టెన్షన్ ఫీలవుతున్నాడు. అప్పుడే సెల్ రింగయింది. వెంటనే ఆత్రంగా డిస్ ప్లే చూసేడు, విరజ నెంబరేమోనని ఏదో కొత్త నెంబర్.
"షిట్..." అనుకుంటూ 'నో' బటన్ నొక్కాడు. ఎవరో తనని డిస్ట్రబ్ చేయడానికి.... తను ఆ కాల్ అటెండ్ అయ్యేలోగా, విరజ ఫోన్ చేస్తే.... తను విరజ కాల్ మిస్సవ్వడూ...
మళ్ళా రింగయింది.... మరోసారి ఆత్రంగా చూసి యింతక్రితం నెంబరే కావడంతో మళ్ళీ కట్ చేశాడా కాల్ ని.
మరో రెండు, మూడు సార్లు అలానే రింగయింది. ఓ పక్క విరజ కోసం వెయిటింగ్, మరో పక్క విరజ కాల్ ఎక్కడ మిస్సవుతుందోననే టెన్షన్. మళ్ళీ సెల్ రింగ్ కావడంతో కోపంగా 'యస్' బటన్ ప్రెస్ చేసి....
"చూడండి.... మీరెవరో నాకు తెలియదు. ఓ ఆఫెనవర్ తర్వాత చేయండి. ప్లీజ్ డోంట్ డిస్ట్రబ్ మీ..." అని చెప్పేసి, అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా కట్ చేసేశాడు.
ఆ కాల్ అటెండ్ అయివుంటే విరజ పరిస్థితి తెలిసేది అతనికి.
"సారీ మిస్ చాలా సార్లు ట్రయ్ చేసినా, ఫోన్ కాల్ కట్ చేస్తున్నారు. అయినా ట్రయ్ చేస్తూనే వున్నాం. డిస్ట్రబ్ చేయొద్దంటూ చెప్పి, మా మాటలు వినిపించుకోకుండానే కట్ చేశారు...." డాక్టర్ సిద్దార్ధ చెప్పాడు.
"షిట్...." బాధగా అనుకుంది......తను అభినయ్ తో ఎలా మాట్లాడాలి....బహుశ తన కాల్ కోసం వెయిట్ చేస్తూ.... ఆ ఫోన్ కాల్ మిస్ చేస్తున్నాడేమో....ప్చ్....! అభీ.... నా గుండె చూడు చివరి క్షణాల్లో నీతో మాట్లాడాలని ఎలా తపించిపోతోందీ....ఎలా...ఎలా.....ఎలా...
"డాక్టర్.... నాకు అర్జంటుగా టేప్ రికార్డర్ కావాలి....ప్లీజ్...."
డాక్టర్ సిద్దార్ధ విరజ చివరి మాటలకు లాజిక్కు అర్దాలూ వెతక్కూడదని డిసైడై వెంటనే, టేప్ రికార్డర్ తెప్పించాడు.
మృత్యుశయ్య మీద విరజ మరణవాంగ్మూలం అది.... ఆమె గుండె లోతుల్లో నుంచి, తన గుండె తన నుంచి వేరయ్యే ముందు చెప్పే ఒక గుండె సవ్వడి వ్యధ అది.
"అభీ....! నా ప్రియమైన అభీ.... చూసేవా....! నీ కోసం నా గుండె ఎలా కొట్టుమిట్టాడుతూ వుందో....కానీ, ఈ గుండె మరికాసేపట్లో నా శరీరం నుంచి వేరవుతుంది. నేనిక ఈ ప్రపంచం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించబోతున్నాను. ఈ వూహే భరించలేకపోతున్నాను కదూ... కానీ, యిది వూహకాదు అభీ....వాస్తవం....నువ్వు తట్టుకోలేని వాస్తవం.... నీ ముందే నా శరీరం మెల్లిమెల్లిగా ఆయుష్షుని కోల్పోయి, నిశ్చలనం కవడం నువ్వు చూసి భరించలేవు. నా మరణ దృశ్యం వీక్షించలేవు.... అభీ... నా మనసు యింకా.... యింకా నీ గురించి తపిస్తూనే వుంది.... గుర్తుందా అభీ.... నీ కోసం నేనిచ్చే కానీక నా గుండె.... ఈ గుండె ఆగిపోకుండా, మరో శరీరంతో నిక్షిప్తపరుస్తున్నా.... ఈ గుండెసవ్వడి ఎక్కడవుందో గుర్తించగలవా...." ఆగి డాక్టర్ వంక చూసింది అప్పటికే విరజకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది.
తన గుండెను స్వీకరించేదెవరో...అభికి చెప్పాలి....డాక్టర్ వంక చూసింది, ఆమె ఎవరో కనుక్కొని అభికి చెప్పాలని....అప్పటికే ఆలస్యం అయిపోయింది.
మెల్లిమెల్లిగా ఆమె స్పృహ తప్పుతోంది. అభీ....అభీ.... అభీ ....నా చి...వ....రి.... శ్వా...స....నీకు... వి...ని...పి...స్తూందా..
విరజ తల పక్కకు వాలిపోతోంది. డాక్టర్లు పరుగెత్తుకొచ్చారు.
"కమాన్-వెంటనే ఆపరేషన్ థియేటర్ కు షిఫ్ట్ చేయండి. ఆపరేషన్ చేసి వెంటనే గుండెను తొలగించాలి...." చెప్పాడు డాక్టర్ సిద్దార్ధ.
డాక్టర్ సిద్దార్ధ తలపట్టుకున్నాడు. తన మెదడు పేలిపోతుందేమోనన్న అనుమానం కలిగింది. అతను చాలా డిస్ట్రబ్ గా వున్నాడు.
విరజ శరీరం నుంచి గుండె వేరైంది. విరజ పార్ధివదేహం స్ట్రెచర్ మీద వుంది. తెల్లని గుడ్డ ఆమె శరీరం మొత్తాన్ని ఆక్రమించుకొని, ఈ జీవి ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకుందని చెబుతుంది.
ఒక చిన్న ప్రకంపనం అతని మనసు పొరల్లో నుంచి ఉవ్వెత్తున పైకి ఎగిసి, పెద్ద విస్పోటనన్ని సృష్టిస్తుందేమోనన్న ఫీలింగ్.
చనిపోయేముందు విరజ చెప్పిన మాటలు గుర్తొచ్చి డాక్టర్ సిద్దార్ధ కళ్ళు మాత్రమే కాదు, మనసూ చెమర్చింది.
"నా డెడ్ బాడీని నా అభికి అప్పగించండి. అతడే నాకు అంత్యక్రియలు చేయాలి...."
చాలా చిన్న వాక్యం....అంతకు మించి ఆమె మాట్లాడాలని, చివరిసారిగా అతడ్ని చూడాలి 'ఎంతగా తపించిపోయింది!
ఓ మనిషికి ప్రాణదానం చేసింది. తను మరణించనున్నాననే విషయం తెలిసే, తన గుండెని దానం చేసిన ఆమె ముందు అతను వామనుడే అయ్యాడు.
డాక్టర్ గా అతనెన్నో కేసులు టేకప్ చేశాడు. ఆపరేషన్ చేస్తుండగానే, చనిపోయిన కేసులు అతనికి కొత్తకాదు. కానీ, విరజ విషయమే అతడ్ని కదిలించి వేస్తోంది.
ఓ పక్క అద్వైతీ ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే ఓ షాక్ లాంటి నిజం తెలిసింది. విరజ గుండె ముందు భాగంలో ఒక ధమని సరిగ్గా పనిచేయడం లేదు. ఆ ఒక్క చిన్నలోపం తప్పిస్తే ఆ గుండె అంతా సవ్యంగానే వుంది.