Previous Page Next Page 
మణిదీపం పేజి 30

    "సరే! నన్ను చెప్పమంటే నేను చెబుతాను."

    "చెప్పండి."

    అప్పటికే అర్చనా, రామకృష్ణ గుడినుండి వచ్చేశారు. ఆసక్తిగా వింటున్నారు వాళ్ళిద్దరి సంభాషణ.

    "నేనోడితే మీకు ముద్దివ్వను. ఒకరోజు మీ ఇంట్లో దాసీగా, అంటే పనిమనిషిగా పనిచేస్తాను. మీరోడితే ఏం చేస్తారో చెప్పండి."

    "ఇదేం పందెం!" తెల్లబోయాడు అరవింద్.

    "మీకీ పందెం నచ్చకపోతే జయంతీ, నేనూ పెట్టుకున్నదే పెట్టుకుందాం. మీరు గెలిస్తే అందమైన అమ్మాయి ముద్దు మీదవుతుంది."

    "చాలా మజాగా కూడా వుంటుంది" రామకృష్ణ ఉత్సాహంగా అన్నాడు- "ఆ పిల్ల ఆటలోనే కాదు, సవాల్ చేస్తున్నది. నీ మగతనాన్నే సవాల్ చేస్తున్నట్టుగా వుంది. నువ్వు ముద్దు వద్దంటే నీ మగసిరికే తల వంపులు."

    ఎర్రగులాబీలా కందిపోయింది అరవింద్ వదనం. "పెళ్ళి కావలసిన పిల్ల కదా? ఇదికాక ఇంకేదైనా పెట్టమను."

    "నాకు పెళ్ళి కాకపోయినా ఫర్వాలేదు. ముద్దు పెడతాను."

    "వద్దులే! ముద్దు బదులు పనిమనిషిగానే చెయ్యండి."

    "మీరోడితేనో?"

    "అదీ మీరే చెప్పండి."

    "మీరోడితే మీరు నా బుగ్గమీద ముద్దు పెట్టాలి."

    అరవింద్ బిత్తరచూపులు చూస్తుంటే, రామకృష్ణ అతడి చెవిదగ్గర గుసగుసగా అన్నాడు_ "వద్దనకు ముద్దు! ముద్దు వద్దంటే నీ మగతనాన్నే శంకించాల్సి వస్తుంది మేమంతా."

    "సరే! ఈ పందానికి నేను రెడీ! తను ఓడితే మా ఇంట్లో ఒకరోజు దాసీగా పనిచేస్తుంది. నేనోడితే ఆమె బుగ్గమీద ముద్దు పెడతాను."

    "అంకుల్! ఆంటీ! మీరు సాక్షి" అంటూ చెస్ బోర్డు మీద తెల్లపావులు పెట్టసాగింది అరుణోదయ.

    అర్చన ఇంట్లోకి వెళ్ళి ప్లేట్లలో కారప్పూస, మైసూర్ పాక్ బిళ్ళలూ తెచ్చింది.

    ఆట ప్రారంభమైంది.

    మొదట్లో మామూలుగా ఆడినా మధ్యలో బలం పుంజుకుంది అరుణోదయ. ఆమె వేసే ఎత్తు ఎత్తుకీ తల పట్టుకోసాగాడు అరవింద్. కనుబొమలు తీవ్రంగా ముడివేసి తీవ్రంగా ఆలోచనలో మునిగిపోతున్నాడు ఒక అమ్మాయి ముందు అదీ తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదీ అయినా ఆ పిల్లముందు ఓడిపోవడమా?

    "ఒక్కో ఎత్తుకి పావుగంతా, అరగంటా టైం తీసుకుంటే ఎలా డాక్టర్ గారూ! మరీ ఇంత స్లోగా ఆడితే నాకు నిద్రోచ్చేస్తుంది" అంది మైసూర్ పాక్ బిళ్ళ నోటికందిస్తూ. ఆమె పావు జరపడానికి నిమిషంకంటే ఎక్కువ తీసుకోవడంలేదు.

    ఒక గంట ఆమె దాడినుండి తప్పించుకోవడంతోనే సరిపోయిందతడికి. ఒక గుర్రం, ఒక ఒంటె, రెండు బంట్లు బలైపోయాయి. విజయావకాశాలు తగ్గిపోయినట్టేనని అనుకుంటూండగానే ఆట మారిపోయింది. అరుణోదయ మంత్రితో అతడి రాజును ఉచ్చులో బిగించడానికి వేసిన ఎత్తులో చేసిన పొరపాటును చక్కగా వుపయోగించుకున్నాడతను. మూడే మూడు ఎత్తుల్లో ఆమె ఆట కట్టించేసి విజయగర్వంతో కాలర్ ఎగరేసి నవ్వాడు.

    "అయ్యో అరుణక్కా! ఎంత పనిచేశావు? అంకుల్ ను మట్టి కరిపించి మన ఆడవాళ్ళ గొప్పతనం జండాలా ఎగురవేస్తావనుకొన్నాను. ఏమైంది నీకు?" నుదురు కొట్టుకుంది జయంతి.

    తన ఓటమికి స్థాణువు అయినట్టుగా కూర్చుంది అరుణోదయ. "ఏమైంది నాకు? అన్ని విధాలా ఆట నాది అనుకుంటున్న సమయంలో ఎలా జరిగింది పొరపాటు. నాకయితే ఎవరయినా నా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారేమోనని అనుమానం వస్తుంది. లేకపోతే ఇలా జరుగదు. నేనేమిటి? ఓడిపోవడం ఏమిటి?"

    "బాగా ఆడడం ఒక్కటే గొప్పకాదు. జయాపజయాలు నిజాయితీగా స్వీకరించే గుండె ధైర్యం కూడా వుండాలి. అంతేకాని ఓడిపోయి బ్లాక్ మ్యాజిక్ చేశానంటారా?"

    "బ్లాక్ మ్యాజిక్ కాకపోతే ఏదో ఒక మ్యాజిక్. వాలికి ఎదురుగా వెళ్ళి పోరాడేవాడి బలాన్ని లాగేసి, రెట్టింపు బలంతో పోరాడే శక్తి వుందట. అలాంటిదేదో వుండాలి మీ దగ్గర. లేకపోతే నేనోడిపోవడం అసంభవం.

    "చెట్టులేనిచోట ఆముదం చెట్టే మహావృక్షమట. అలా వుంది మీ ఆత్మవిశ్వాసం. ఆట సరిగ్గా రానివాళ్ళతో ఆడి గొప్పగా ఫీలయిపోతే ఎలా?"

    "నువ్వు మంత్రితో అరవింద్ రాజును 'చెక్ చేయడానికి రావడమే పొరపాటు స్టెప్ ఆ పొరపాటును అరవింద్ చక్కగా వుపయోగించుకున్నాడు. అతడి దశ తిరిగిపోయి నీ మీద విజయం సాధించాడుగాని లేకపోతే అతడు ఓడిపోవడం ఖాయం అనుకున్నాం. మొదట్లో నువ్వు వేసిన ఎత్తులకి అతడికి చెమటలు పట్టాయి తెలుసా?" అన్నాడు రామకృష్ణ.

    "ఒకరోజు పనిమనిషిగా బ్రతకాల్సిన గీత నీ నుదుట వ్రాసిపెట్టివుంటే ఎలా తప్పించుకుంటావు?" దొంగ సానుభూతి చూపుతూ అంది అర్చన.

    "ఏదో మాట వరుసకి అనుకున్నంత మాత్రాన పనిమనిషిగా చేయాలని ఏం లేదు. అసలు ఆమెచేత పని చేయించుకుంటానని ఎలా అనుకున్నారు?"   

 Previous Page Next Page